భర్తపై అక్రమ కేసులు పెట్టారని పురుగుల మందు తాగింది

జగిత్యాల,​ వెలుగు: పార్టీ మారినందుకు  మంత్రి  కొప్పుల ఈశ్వర్​అనుచరులు, పోలీసులతో అక్రమ కేసులు బనాయించి తన భర్తపై రౌడీషీట్ పెట్టారంటూ ఓ వివాహిత పోలీస్​ స్టేషన్​ఎదుట పురుగుల మందు తాగిన ఘటన కలకలం రేపింది.  బాధితురాలి కథనం ప్రకారం… జగిత్యాల జిల్లా నేరెళ్ల గ్రామానికి చెందిన జాజాల రమేశ్​​ కొన్నేళ్ల క్రితం బీసీ విద్యార్థి సంఘ నాయకునిగా పని చేశాడు. టీఆర్ఎస్​పార్టీలో చేరి చురుగ్గా పనిచేసి మంత్రి కొప్పుల సన్నిహితునిగా మారాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరెళ్ల గ్రామ ఎంపీటీసీ టికెట్​ఆశించి భంగపడి మనస్తాపం చెందాడు. దీంతో టీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరాడు. ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాంగ్రెస్​ మద్దతుతో  భార్య అనూషను సర్పంచిగా పోటీ చేయించాడు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో  అధికార పార్టీకి ఇద్దరూ గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మంత్రి కొప్పుల అనుచరుల వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు వాపోయింది.

అయితే గతంలో అనూష , రమేశ్​​ ప్రేమించుకున్నారు. వివాహం విషయంలో గొడవలు జరగడంతో అనూష రమేశ్​​పై పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టింది.  ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకోవడంతో కేసుల్లో రాజీ కుదిరినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు గతంలోని కేసులను తిరగదోడి అక్రమ కేసులతో రౌడీషీట్​ పెట్టారని బాధితురాలు ఆరోపించింది. రౌడీషీట్​ పెట్టొద్దంటూ వేడుకున్నా వినకపోవడంతో శనివారం ధర్మపురి పోలీస్ స్టేషన్​ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై ధర్మపురి సీఐ లక్ష్మీబాబు మాట్లాడుతూ రౌడీషీట్ కేసు మూడు నెలల క్రితమే  నమోదైందన్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు భర్త రమేశ్​​ వేధింపులతో అనూష  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం అందిందన్నారు.

Latest Updates