జొమాటో-స్విగ్గీ పోటాపోటీ

వెలుగు బిజినెస్‌‌ డెస్క్‌‌ : జొమాటో మరోసారి నిధుల వేటలో పడటంతో ఆన్‌‌లైన్‌‌ ఫుడ్‌‌ డెలివరీ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు. దిగ్గజాలు రెండూ ఇప్పటికే నువ్వా, నేనా అనే అధిపత్య పోరుకు తెరతీశాయి. ఆన్‌‌లైన్‌‌ ఫుడ్‌‌ ఆర్డరింగ్‌‌ రంగంలోని జొమాటో మారోసారి రూ. 4,249 కోట్లు (600  మిలియన్‌‌ డాలర్లు) నిధులు సమీకరించనుంది. ఇప్పటికే ఇన్వెస్టర్‌‌గా ఉన్న యాంట్‌‌ ఫైనాన్షియల్‌‌ నేతృత్వంలో ఈ నిధులను కంపెనీ సమకూర్చుకోనుంది. తాజా నిధుల సమీకరణతో జొమాటో వ్యాల్యుయేషన్‌‌ 300 కోట్ల డాలర్లకు చేరనుంది.చైనాకు చెందిన ఆన్‌‌లైన్‌‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌‌కు చెందినదే యాంట్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌. ఫుడ్‌‌ యాగ్రిగేటర్‌‌ సర్వీసులకు ఇండియాలో డిమాండ్‌‌కు కొరత లేకున్నా, ఈ వ్యాపారంలో నష్టాలను తట్టుకునేందుకు సిద్ధంగా కంపెనీలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గేమ్‌‌లో నిలబడాలంటే భారీగా డబ్బు ఉండి తీరాల్సిందేనని పేర్కొంటున్నారు.

లాగవుట్‌‌ క్యాంపెయిన్‌‌ దెబ్బ….

ఇప్పుడొచ్చే నిధులతో జొమాటో మళ్లీ మార్కెట్లో భీకరంగా తలపడుతుందని భావిస్తున్నారు. జొమాటో బిజినెస్‌‌ మోడల్‌‌, కంపెనీ ప్లాన్స్‌‌.. రెండూ ఇన్వెస్టర్లకు నచ్చాయనేది తాజా నిధుల సమీకరణతో తెలుస్తోందని ఆ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌ కామర్స్‌‌, రైడ్‌‌ హెయిలింగ్‌‌ యాప్స్‌‌లాగే ఇప్పుడు ఫుడ్‌‌ డెలివరీ బిజినెస్‌‌లోనూ ఇద్దర్లు ప్లేయర్లే ప్రధానంగా మారారు. ఈ విభాగంలో ఇండియాలో జొమాటో, స్విగ్గీలే పెద్ద ప్లేయర్లని ఈక్యూబ్‌‌ ఫండ్‌‌ మేనేజింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌ హరీష్‌‌ హెచ్‌‌.వీ. చెప్పారు. జొమాటో ఇంతకు ముందు రౌండ్లలో సమీకరించిన నిధుల కంటే ఎక్కువగానే ఈ రౌండ్‌‌లో సమీకరిస్తోంది. మరోవైపు నేషనల్‌‌ రెస్టారెంట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎన్‌‌ఆర్‌‌ఏఐ) ఫుడ్‌‌ యాగ్రిగేటర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లాగవుట్‌‌ క్యాంపెయిన్‌‌ నిర్వహిస్తోంది. ఫుడ్‌‌ యాగ్రిగేటర్లు ఇచ్చే భారీ డిస్కౌంట్లతో  తమ వ్యాపారాలు భారీ నష్టాలపాలవుతున్నాయనేది ఎన్‌‌ఆర్‌‌ఏఐ ఆరోపణ. ఫుడ్‌‌ యాగ్రిగేటర్లు ట్రాన్స్‌‌పరెన్సీ పాటించడం లేదని, డేటాను దాచిపెడుతున్నారనీ కూడా ఎన్‌‌ఆర్‌‌ఏఐ విమర్శిస్తోంది. మార్కెట్లోని అధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ ఆరోపిస్తోంది.

ఎన్‌‌ఆర్‌‌ఏఐ క్యాంపెయిన్‌‌తో జొమాటో తన ఇన్ఫినిటీ డైనింగ్‌‌ ప్రోగ్రామ్‌‌ను సస్పెండ్‌‌ చేసింది. ఫిక్స్‌‌డ్‌‌ ధరలకు పరిమితి లేకుండా ఇష్టమైన ఫుడ్‌‌, బెవరేజెస్‌‌ను కొనే వీలును జొమాటో గోల్డ్‌‌ పెయిడ్‌‌ మెంబర్షిప్‌‌ స్కీములోని మెంబర్లకు జొమాటో కల్పించేంది. కిందటి నెలలో  తన కస్టమర్‌‌ సపోర్ట్‌‌ టీమ్‌‌లోని 541 మంది ఎంప్లాయీస్‌‌ (మొత్తం ఉద్యోగులలో 10 శాతం) ను జొమాటో ఇంటికి పంపింది.  టెక్నాలజీ వాడకం వల్ల ఉద్యోగుల అవసరం తగ్గిందని ఇందుకు కంపెనీ వివరణ ఇచ్చింది. అయితే ఇతర ఐటీ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకుంటున్నామని తెలిపింది. ఇండియాలో ఫుడ్‌‌ డెవలివరీ మార్కెట్‌‌  2023 చివరి నాటికి 500 కోట్ల డాలర్లకు చేరుతుందని డెలాయిట్‌‌ అంచనా వేస్తోంది. ఇండియాలో మార్కెట్‌‌ అధిపత్యం కోసం స్విగ్గీ, జొమాటోలు కుస్తీ పడుతున్నాయి. పోటీ వల్ల రెండు కంపెనీలు భారీ నష్టాలు మూటకట్టుకుంటున్నాయి.  మార్కెటింగ్‌‌ కోసం పెట్టే ఖర్చు, డిస్కౌంట్లు, జీతాలు పెరగడం రెండు కంపెనీల పైనా ప్రభావం చూపిస్తోంది. జొమాటో రెవెన్యూ 2019లో 206 మిలియన్‌‌ డాలర్లకు పెరిగింది. నష్టాలు 294 మిలియన్‌‌ డాలర్లకు పెరిగాయి. ఒక్క 2019 లోనే జొమాటో ఖర్చులు ఏకంగా 500 మిలియన్‌‌ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి.

సింగిల్‌‌ మీల్స్ కోసం స్విగ్గీకి

స్విగ్గీ ఎక్కువగా సింగిల్‌‌ మీల్స్​, యువతను ఆకట్టుకుంటుండగా, నిర్ధారిత రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌‌ ఎంపిక చేసుకనే ఫ్యామిలీల అవసరాలను జొమాటో నెరవేరుస్తోందని మార్కెట్‌‌ నిపుణులు చెబుతున్నారు. ఈ రెంటిలోనూ ఏవరేజ్‌‌ రెవెన్యూ జొమాటోకే ఎక్కువగా ఉంటోందని ఇండియా కోషెంట్‌‌ పార్ట్‌‌నర్‌‌ ఆనంద్‌‌ లూనియా తెలిపారు. 2019 ఏప్రిల్‌‌ నాటికి జొమాటో ఇండియాలోని 500 సిటీలకు విస్తరించింది. 2020 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొత్తం 21.4  కోట్ల ఆర్డర్లను జొమాటో నెరవేర్చింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి ఈ ఆర్డర్లు 5.5 కోట్లు మాత్రమే. ఫుడ్‌‌ డెలివరీతోపాటు బీ2బీ రంగంలోనూ జొమాటో ప్రవేశించింది. ఫుడ్‌‌@వర్క్‌‌ పేరుతో ఈ రంగంలో ఉంది. 70 సంస్థలలోని కెఫెటేరియాలకు ఫుడ్‌‌ అందిస్తోంది. నెలకు 30 లక్షల దాకా ఆర్డర్లను పూర్తి చేస్తోంది. రెస్టారెంట్‌‌ లిస్టింగ్స్‌‌, రివ్యూస్‌‌, టేబుల్‌‌ రిజర్వేషన్స్‌‌ వంటి కార్యకలాపాల ద్వారా జొమాటోకు మొత్తం రెవెన్యూలో 13 శాతం వస్తోంది. ఇక స్విగ్గీని చూస్తే, ఫుడ్‌‌ డెలివరీతోపాటు స్విగ్గీ స్టోర్స్‌‌, స్విగ్గీగోలను మొదలెట్టింది. స్విగ్గీ  యాక్సెస్‌‌ (రెస్టారెంట్‌‌ పార్ట్‌‌నర్లు), స్విగ్గీ డెయిలీ సబ్‌‌స్క్రిప్షన్‌‌ మీల్స్‌‌ లోనూ అడుగుపెట్టింది. స్విగ్గీ కంటే మెరుగైన అంకెలను జొమాటో సాధించగలదని భావిస్తున్నట్లు లూనియా చెబుతున్నారు. జొమాటో గోల్డ్‌‌లో చాలా మంది మెంబర్లున్నారనే విషయం మార్చిపోకూడదని అంటున్నారు. జొమాటో ఇప్పటిదాకా (తాజా 600 మిలియన్‌‌ డాలర్లు కాకుండా) 13 రౌండ్లలో మొత్తం 755.6 మిలియన్‌‌ డాలర్ల నిధులు సేకరించింది. ఇక స్విగ్గీ మొత్తం 10 రౌండ్లలో 1.5 బిలియన్‌‌ డాలర్లను సమీకరించింది. 2018 నాటికి స్విగ్గీ రెవెన్యూ రూ. 470 కోట్లకు చేరగా, నష్టాలు రూ. 397.3 కోట్లకు పెరిగాయి.

Latest Updates