ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. సహించం: వరంగల్ కాంగ్రెస్ నేతల ఫైర్

వరంగల్ అర్బన్: అధికారం అండ చూసుకుని ప్రశ్నించిన వారందరిపై కేసులు పెట్టి అణచివేయాలని చూస్తే సహించబోమని.. వరంగల్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగారాఘవరెడ్డి తదితరులు వరంగల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రశ్నించే నాయకులపై కేసులు పెడుతున్నారు .అణిచివేత కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా…ఇక సహించబోమని స్పష్టం చేశారు. కేసులపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టండి… వరంగల్  అభివృద్ధి పై టీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమా..? అని ఆయన సవాల్ చేశారు.  మంత్రి కేటీఆర్ వరంగల్ కు వస్తే మమ్ములను హౌజ్  అరెస్ట్ చేస్తారా..? టీఆర్ఎస్ నాయకులు ఖబడ్దార్… ఇకపై కేసులు పెట్టి వేధిస్తే భయపడబోమన్నారు.

పోలీసుల తీరు మార్చుకోవాలి: జంగా రాఘవరెడ్డి

జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగారాఘవరెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ ఎస్ నేతలకు పోలీసులు ఏజెంట్లు గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడి పార్టీలు మారబోమన్నారు. మంత్రి దయాకర్ రావు ఓటమి భయంతోనే టీఆర్ఎస్ లో చేరారు.. ఆనాడు నమ్మి చేరదీసిన  చంద్రబాబును వెన్నుపోటు పొడిచిన చరిత్ర దయాకర్ రావుదని విమర్శించారు. ఒక రేషన్ డీలర్ కు వందలకోట్లు ఎలా వచ్చాయి ? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భార్యకు తాళి కట్టాలన్నా… దయాకర్ రావుకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుందేమోనన్న పరిస్థితులు వరంగల్ జిల్లాలో ఉన్నాయని ఆరోపించారు. డీసీసీబీ బ్యాంకులో నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు.. డీసీసీబీ బ్యాంకును లాభాల్లో నడిపిన చరిత్ర మాది అన్నారు.

 

Latest Updates