చార్మినార్ దానమిస్తే రిజిస్టర్ చేసుకుంటరా?

  • ఇచ్చే వ్యక్తికి ల్యాండ్​పై హక్కు ఉందా.. లేదా పట్టించుకోరా?
  • హఫీజ్‌‌పేట భూముల కేసులో వక్ఫ్‌‌బోర్డును ప్రశ్నించిన హైకోర్టు
  • విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ‘‘వక్ఫ్‌‌ నామా కింద రాజ్‌‌భవన్‌‌నో, చార్మినార్‌‌నో దానంగా ఇస్తే రిజిస్టర్‌‌ చేసుకుంటారా, దాతృత్వంలో ఉన్న నిజాయితీ ఏపాటిదో, అసలు దానం చేసిన వ్యక్తికి భూమిపై హక్కు ఉందా లేదా. ఇవన్నీ చూడాలని చట్టం చెబుతున్నా పట్టించుకోరా. వక్ఫ్‌‌ బోర్డుకు 65 ఏళ్ల క్రితం భూమి ఇస్తే 2014 వరకూ ఎందుకు రిజిస్టర్‌‌ చేసుకోలేదు” అని హైకోర్టు రాష్ట్ర వక్ఫ్‌‌ బోర్డును ప్రశ్నించింది. శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌‌పేటలోని సర్వే నంబర్‌‌ 80లోని భూముల విషయంలో ప్రభుత్వం గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ కె.ప్రవీణ్‌‌కుమార్, సాయి పవన్‌‌ ఎస్టేట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్, మరొకరు విడివిడిగా రిట్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్‌‌ ఎమ్మెస్‌‌ రామచంద్రరావు, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌లతో కూడిన బెంచ్‌‌ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డును పైవిధంగా ప్రశ్నించింది. గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ఇవ్వడంపై వక్ఫ్‌‌బోర్డు వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు లాయర్లు వాదిస్తూ, మునీరున్సీసా బేగం 1955లో వక్ఫ్‌‌నామా ఇచ్చినప్పుడు చేతులు కాలాయని సంతకం చేయలేదని, అసలు వక్ఫ్‌‌నామా ఇచ్చిన భూమిపై ఆమెకు హక్కు ఎలా సంక్రమించిందో కూడా చెప్పలేదని, 1966లో ఆస్తుల అమ్మకం డాక్యుమెంట్స్‌‌లో మాత్రం సంతకాలు చేశారని చెప్పారు. ఈ భూములపై 2006లో తుది డిక్రీ వచ్చిందని, 2013 నవంబర్‌‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయని వివరించారు. ఆ తర్వాతి ఏడాది వక్ఫ్‌‌బోర్డు భూమిని రిజిస్టర్‌‌ చేయించి నవంబర్‌‌ 1న గెజిట్‌‌ జారీ చేసిందన్నారు. ఈ వాదనలను ప్రభుత్వం తరఫున అడిషనల్ ఏజీ జె.రామచంద్రరావు ఖండించారు. హఫీజ్‌‌పేట్‌‌ ల్యాండ్స్‌‌ పూర్తిగా ప్రభుత్వానివేనని, 1963లో కొందరు తాము నిజాం వారసులమని ఆస్తులను వాటాలుగా పంచుకున్నట్లు రాసుకుంటే చెల్లుబాటు కాదన్నారు. భూమిపై హక్కుల కోసం ఎవరూ సూట్‌‌ వేయడంగానీ, కోర్టు ద్వారా హక్కులు పొందడంగానీ జరగలేదన్నారు. భూమి రాష్ట్రానిది అయినప్పుడు ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయకుండా కేసు వేసి ఉత్తర్వులు పొందితే దానికి చట్టబద్ధత ఉండదని హైకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. ముతవల్లీ తరఫు న్యాయవాది వాదిస్తూ, మునీరున్సీసా బేగం వక్ఫ్‌‌నామా ఇచ్చినప్పుడు చేతులు కాలితే సంతకం చేయలేదన్నారు.  తర్వాత విక్రయాల్లో సంతకం ఎలా చేశారో చెప్పలేదన్నారు. ఆమె మరణించిన తర్వాత తప్పుడు డాక్యుమెంట్స్‌‌తో చేసినట్లుగా ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి 

బోధన్‌‌‌‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఫారిన్ లిక్కర్ అగ్గువకే

మంత్రి గంగుల పిటిషన్.. సర్కారుకు నోటీసులు

కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్​కు..

Latest Updates