ప్రపంచంలోనే గయానా రిచెస్ట్ కంట్రీ!

దక్షిణ అమెరికాలో రెండో పేద దేశం గయానా. పేదరికం, నిరుద్యోగం తాండవిస్తున్న కంట్రీ. అలాంటి దేశం ఇప్పుడిక ఆ ఖండంలోనే రిచ్చెస్ట్‌‌గా మారబోతోంది. ఖండమేంటి ప్రపంచంలోనే ధనిక దేశమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా అక్కడ ఆయిల్‌‌ నిల్వలున్నట్టు తెలిసింది మరి. దేశానికి అనుకుని అట్లాంటిక్‌‌ మహా సముద్రంలో 550 కోట్ల బ్యారెళ్ల ఆయిల్‌‌ ఉందని తేలింది. దీంతో 2020 నాటికల్లా దేశ జీడీపీ 300 నుంచి 1,000 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అబ్బే ఇది ఇప్పట్లో కాదని అనుకోవచ్చు. కానీ అక్కడి జనాభా కేవలం 7 లక్షల 50 వేలే. కాబట్టి జీడీపీ, తలసరి ఆదాయం రాకెట్‌‌లా దూసుకుపోతుందని నిపుణులు అంటున్నారు.

ఆయిల్‌‌ కర్స్‌‌ భయం

ఒకప్పటి బ్రిటిష్‌‌ కాలనీ గయానా. ఆ ఖండంలో ఇంగ్లిష్‌‌ మాట్లాడే ఒక్కగానొక్క దేశం. నిరుద్యోగం, పేదరికానికి కేరాఫ్‌‌. ఇలాంటి సమయంలో ఆయిల్‌‌ నిల్వలు ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. కానీ చరిత్ర వారిని హెచ్చరిస్తోంది. చాలా దేశాల్లో ఆయిల్‌‌ నిల్వలు కనుగొన్నపుడు అక్కడ అవినీతి తీవ్రంగా పెరిగింది. ఆయిల్‌‌ దుర్వినియోగం, దొంగతనం ఎక్కువైంది. దీన్నే ఆయిల్‌‌ కర్స్‌‌(శాపం) అంటుంటారు. గయానాలో ఇప్పటికే అవినీతి ఎక్కువని, కాబట్టి ఈ దేశాన్నీ ఈ ముప్పు భయపెడుతుందని ఓ ఎన్జీవో వెల్లడించింది. మరోవైపు ప్రస్తుతం గయానాలో  రాజకీయ సంక్షోభం తలెత్తింది. అక్కడి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. ఎన్నికలు పెట్టాల్సిన సర్కారు తీర్మానంపై కోర్టుకెక్కింది. దీంతో నిరసనలు, అల్లర్లు పెరిగాయి.

యూత్‌‌ను ఎడ్యుకేట్‌‌ చేస్తే..

ఆయిల్‌‌ నిల్వలున్నాయని సంబరపడలేమని, కొన్ని దేశాల్లో ఆయిల్‌‌ నిల్వలు బయటపడ్డాక ముందున్న పరిస్థితి కన్నా దారుణంగా తయారయ్యాయని గయానా ఎన్విరాన్‌‌మెంటల్‌‌ ప్రొటెక్షన్‌‌ ఏజెన్సీ హెడ్‌‌ విన్సెంట్‌‌ ఆడమ్స్‌‌ హెచ్చరించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ విద్యనందిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా గట్టెక్కొచ్చని చెప్పారు. గయానాలో అతిపెద్ద విద్యా సంస్థ యూనివర్సిటీ ఆఫ్‌‌ గయానాలో ఫ్యాకల్టీని మార్చాల్సివుందన్నారు. దేశ అవసరాలకు తగ్గట్టు గయానా యూత్‌‌ను తయారు చేస్తే సమస్యలుండవని చెప్పారు. ప్రస్తుతం గయానాలో పెట్రోలియం ఇంజినీరింగ్‌‌ ప్రోగ్రామ్‌‌కు సంబంధించిన ల్యాబ్‌‌లు లేవని, వాటినీ ఏర్పాటు చేయాలని వర్సిటీ డీన్‌‌ ఎలెనా అన్నారు. మంచి అనుభవమున్న వారిని ఉద్యోగంలోకి తీసుకుందామంటే జీతాల్లేవని, ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు.

బాగుపడతామని ఆశ లేదు

గయానా రాజధాని జార్జిటౌన్‌‌కు పక్కనున్న సోఫియాలోని ప్రజల్లో బాగుపడతామన్న ఆశే లేదు. టౌన్‌‌లోని 10 శాతం మంది ఇక్కడే ఉంటారు. కానీ నగరంలోని పది శాతం వనరులు కూడా ఇక్కడ ఖర్చు చేయరు. ఇప్పటికీ ఇక్కడి చాలా ఇళ్లలో కరెంటు, నీళ్ల కనెక్షన్‌‌ లేదు. మరి ఇలాంటి ప్రాంతానికి ఆయిల్‌‌ బెనిఫిట్స్‌‌ ఎలా వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గయానాలో ఏం జరుగుతోంది? నైజీరియాలో ఏం జరిగింది? వెనెజులా పరిస్థితేంటో అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందుకే బాగుపడతామనే నమ్మకం వారికి ఎంతమాత్రం లేదు.