ఆరేంజ్ ఆ రేంజ్‌లో ఆడుతుందా?

సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ అంచనాలు

ఆడింది ఏడు సీజన్లు.. ఓసారి చాంపియన్​షిప్​.. ఇంకోసారి రన్నరప్.. మూడు సార్లు ప్లే ఆఫ్స్​.. ఇంకో  రెండు సార్లు ఆరో స్థానం. ఐపీఎల్​లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ ప్రస్థానమిది.  జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్​లో తేడా ఉండదు. టీమ్​ బ్యాలెన్స్​లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్​ అటు బౌలింగ్​లో ఇరగదీసి ప్రత్యర్థి తలవంచడం ఆరెంజ్​ ఆర్మీ స్టైల్​. దాంతో ధనాధన్​ లీగ్​లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సన్​రైజర్స్..​ నయా సీజన్​లోనూ ఫేవరెట్​గా బరిలోకి దిగనుంది. తమను ఓ సారి చాంపియన్​గా నిలబెట్టిన డేవిడ్​ వార్నర్​ నాయకత్వంలో నే  యూఏఈలో సవాలుకు ​ సిద్ధమవుతోంది.  ఎడారి దేశంలోనూ ఆరెంజ్​ ఆర్మీ​ తమ సత్తా చూపిస్తుందా..!! అంచనాలను అందుకుంటుందా..!! హైదరాబాద్​ రేంజ్​ పెంచుతుందా..?

వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​: ఐపీఎల్​లోనే అత్యంత నిలకడగా ఆడే జట్లలో సన్​రైజర్స్​ హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. 2013లో ధనాధన్​ లీగ్​లోకి అడుగుపెట్టిన సన్​రైజర్స్​ 2016లో చాంపియన్​షిప్​ సాధించింది. ఆ తర్వాత జరిగిన మూడు సీజన్లను టాప్​–4లోనే ముగించింది. 2018 సీజన్​లో రన్నరప్​గా నిలిచిన ఆరెంజ్​ ఆర్మీ.. గత సీజన్​లో నాలుగో ప్లేస్​తో సరిపెట్టుకుంది. అయితే ఏ ఒక్కరి వల్లనో కాకుండా జట్టుగా రాణించడమే సన్​రైజర్స్​ సక్సెస్​ సీక్రెట్​. డేవిడ్​ వార్నర్​, కేన్​ విలియమ్స​న్​, భువనేశ్వర్​ కుమార్​ను బేస్​ చేసుకుని ఆ ఫ్రాంచైజీ బలమైన జట్టును నిర్మించింది. దీంతో నిలకడగా ఆడుతూ ఆశించిన రిజల్ట్స్​ సాధిస్తోంది.  ఇప్పుడు 2020 సీజన్​లోనూ అదే నిలకడ కొనసాగిస్తుందని అంచనాలున్నాయి.  అయితే, గత సీజన్​లో జట్టును నడిపించిన కేన్​ విలియమ్సన్​ నుంచి డేవిడ్​ వార్నర్​కు తిరిగి జట్టు పగ్గాలు అందించారు. వార్నర్​ తమను మరోసారి చాంపియన్​గా నిలబెడతాడని ఆ జట్టు భావిస్తోంది.  21వ తేదీన ఆర్‌‌సీబీతో జరిగే మ్యాచ్​తో సన్​రైజర్స్..​ ఐపీఎల్​ 13 జర్నీని మొదలుపెట్టనుంది.

బలం

ఎప్పట్లానే సన్​రైజర్స్​ టీమ్​ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు కెప్టెన్​ డేవిడ్​ వార్నర్, జానీ బెయిర్​స్టో జట్టు ప్రధాన ఆయుధాలు. పాకిస్తాన్​, ఆసీస్​తో సిరీస్‌ల్లో అదగరొట్టిన జానీ ఫుల్​ఫామ్​లో ఉన్నాడు. వీరికి అదనంగా మాజీ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ ఉండనే ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు స్కోరు బోర్డు నడిపించడం లో కేన్​ దిట్ట. ఆరు రోజుల క్వారంటైన్‌ రూ‌‌ల్‌ నేపథ్యంలో వార్నర్‌‌, బెయిర్‌‌స్టో ఆర్‌‌సీబీతో ఫస్ట్‌ మ్యాచ్‌కు దూరమైతే.. కేన్‌ టీమ్‌ను లీడ్‌ చేసే చాన్సుంది. ఇక,  మనీశ్​ పాండే, విజయ్​శంకర్, సాహా రూపంలో మంచి బ్యాట్స్​మెన్​ ఆ తర్వాతి స్థానాలకు అందుబాటులో ఉన్నారు. వీరుకాక గత ఆక్షన్​లో కొనుగోలు చేసిన  ప్రియమ్​ గార్గ్​, విరాట్​ సింగ్, హైదరాబాదీ బావనక సందీప్​​ వంటి యంగ్​స్టర్స్​పై కూడా​ జట్టు నమ్మకంగా ఉంది. ఇక, అఫ్గాన్​ వీరులు రషీద్​ ఖాన్​, మహ్మద్​ నబీ ఆల్​రౌండర్లుగా కీలకం కానున్నారు. ఈ స్పిన్నర్లిద్దరికీ యూఏఈ పిచ్​లపై కావాల్సినంత అనుభవం ఉండడం జట్టుకు అడ్వాంటేజ్​ కానుంది. పేస్​ బౌలింగ్​ విషయానికొస్తే భువీ ఆధ్వర్యంలోని లైనప్​ పటిష్టంగా నే ఉంది.  ఖలీల్​ అహ్మద్​, సిద్ధార్ద్​ కౌల్​, సందీప్​ శర్మకు తోడుగా ఫాబియన్​ అలెన్​, మిచెల్​ మార్ష్​, స్టాన్​లేక్​తో చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి.​

బలహీనత

ఫైనల్‌ ఎలెవన్ ఎంపిక ఈ సీజన్​లో సన్​రైజర్స్​కు అతి పెద్ద సమస్య. తుది జట్టులో నలుగురు ఫారిన్​ ఆటగాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఈ రూల్​ వల్లే విలియమ్సన్​  కెప్టెన్సీ కోల్పోయాడు.  వార్నర్​ జట్టులో ఉండడం అత్యవసరం కాబట్టి అతనికి కెప్టెన్సీ అప్పజెప్పారు. దీంతో బెయిర్​స్టో, విలియమ్సన్​లో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే చాన్సుంది.  దాని వల్ల మిడిలార్డర్​ భారమంతా పాండే​, శంకర్, సాహాపై పడనుంది. వీళ్లు క్వాలిటీ ప్లేయర్లే అయినా భారీ పెర్ఫామెన్స్​ల కోసం నమ్మకం పెట్టుకోలేం. లాస్ట్‌ సీజన్‌లో మిడిలార్డర్‌‌ వైఫల్యమే దెబ్బకొట్టింది.  కొత్త కుర్రాళ్లు విరాట్​ సింగ్​, ​గార్గ్​, అబ్దుల్​ సమద్​ ఏ మేరకు ఆడతారో చెప్పలేం. దీంతో మిడిలార్డర్​లో డొల్లతనం కనిపిస్తోంది.  బౌలింగ్​ విభాగంలోనూ ఈ నంబర్​ రూల్​ సమస్య కానుంది. ఫారిన్​ పేసర్​ లేదా పేస్​ బౌలింగ్​ ఆల్​రౌండర్​ కావాలనుకుంటే రషీద్, నబీలో ఒకరిని పక్కనపెట్టాలి.  ఈ కాంబినేషన్​ సమస్యను ఎలా దాటుతుందో చూడాలి. ఈ విషయంలో తప్పు జరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశముంది.

అంచనా

వార్నర్​, బెయిర్​స్టో, రషీద్​ ఖాన్​ నిలకడగా ఆడి అంచనాలు అందుకుంటే  సన్​రైజర్స్​ కచ్చితంగా ప్లే ఆఫ్స్​ చేరుతుంది. మిడిలార్డర్​ కూడా సక్సెస్​ అయితే టైటిల్​ ఆశించవచ్చు.

జట్టు

బ్యాట్స్​మెన్:  వార్నర్​(కెప్టెన్​), విలియమ్సన్​, మనీశ్​ పాండే, విరాట్​ సింగ్, ప్రియమ్​ గార్గ్​, అబ్దుల్​ సమద్​, బావనక సందీప్​

వికెట్​ కీపర్లు: బెయిర్​స్టో, సాహా, శ్రీవత్స్ గోస్వామి

ఆల్​రౌండర్లు: స్టాన్​లేక్​, విజయ్​ శంకర్​, మిచెల్​ మార్ష్​, రషీద్​ ఖాన్​, నబీ

బౌలర్లు:  భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్, కౌల్, బాసిల్‌ థంపి, నటరాజన్, అభిషేక్​, షాబాజ్​ నదీమ్, అలెన్, సంజయ్​ యాదవ్.

For More News..

ఆర్టీసీ రూట్లు ప్రైవేట్‌ వైపు!

Latest Updates