నాగబాబు నవ్వులు.. రీ ఎంట్రీ?

తెలుగు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షోలో నాగబాబు, రోజాల జడ్జిమెంట్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ రాజకీయంగా వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల కొంతకాలం షోకు దూరంగా ఉన్నారు. వీళ్ల స్థానంలో హీరోయిన్లు మీనా, సంఘవిలు, కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఎన్నికలు ముగియడంతో రోజా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. కానీ, నాగబాబు మాత్రం ఇంకా జబర్దస్త్​లోకి అడుగుపెట్టలేదు. తాజా ఎపిసోడ్లలో కమెడియన్ అలీ రోజాతో కలిసి జడ్జిగా చేస్తున్నాడు. ఇటీవలే అలీ జబర్దస్త్​ ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. అయితే ఎన్నికల హడావిడి ముగిసినా నాగబాబు ఇంకా ఎంట్రీ ఇవ్వకపోవడంపై అభిమానులు.. ఆయన రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం నాగబాబు రీ ఎంట్రీ త్వరలోనే ఉండే అవకాశం ఉంది. అయితే అలీతో దాదాపు నాలుగు ఎపిసోడ్లు చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో రాబోయే ఒకటి, రెండు వారాలపాటు అలీనే కనిపిస్తాడు. తదుపరి షెడ్యూ ల్ షూటింగ్ లో నాగబాబు పాల్గొంటారు. అవి ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెలలో ప్రసారమయ్యే అవకాశం ఉంది. దీంతో జబర్దస్త్​లో తిరిగి నాగబాబు నవ్వుల్ని చూడొచ్చు. మరోవైపు రాజకీయంగా కీలకంగా వ్యవహరించాల్సిన టైమ్ లో రోజా జబర్దస్త్​లో కొనసాగుతుందా? లేదా అనే సందేహాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.

Latest Updates