గెంటేసిన ఐపీఎల్‌లోనే నేనేంటోనిరూపించుకుంట

న్యూఢిల్లీ: ఎస్‌‌ శ్రీశాంత్‌‌.. ఇండియా క్రికెట్‌‌లో ఆణిముత్యం లాంటి పేసర్. తన బంతుల మాదిరిగానే దూకుడైన వ్యక్తిత్వంతో చాలా తక్కువ టైమ్‌‌లో ఎంతో పేరు తెచ్చుకున్న ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఈ కేరళ స్పీడ్‌‌స్టర్‌‌ అంతే వేగంగా పతనమయ్యాడు. దుందుడుకు స్వభావంతో విమర్శల పాలవడంతో పాటు ఐపీఎల్‌‌ స్పాట్‌‌- ఫిక్సింగ్‌‌ కేసులో ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొని నేషనల్‌‌ టీమ్‌‌కు దూరమయ్యాడు. బీసీసీఐ విధించిన బ్యాన్‌‌ ఈ ఏడాది సెప్టెంబర్‌‌తో ముగుస్తుండడంతో 37 ఏళ్ల లేటు వయసులో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇండియా తరఫున మరొక్క మ్యాచ్‌‌ ఆడాలన్నది తన కల అంటున్నాడు. ఆ మ్యాచ్‌‌ ఆడుతూ చనిపోయినా ఫర్వాలేదని చెబుతున్నాడు. తనను ఆట నుంచి గెంటేసిన ఐపీఎల్‌‌లోనే తానేంటో మళ్లీ నిరూపించుకుంటా అని చెబుతున్నాడు. ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకుంటే రంజీ టీమ్‌‌లోకి తీసుకుంటామని కేరళ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ భరోసా ఇవ్వడంతో శ్రీశాంత్‌‌ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్‌‌ ప్రారంభించిన శ్రీ… ప్రముఖ ఫిజికల్‌‌, మెంటల్‌‌ ట్రైనింగ్‌‌ కోచ్‌‌ టిమ్‌‌ గ్రోవర్ సాయం తీసుకుంటున్నాడు.

అమెరికా బాస్కెట్‌‌బాల్‌‌ లెజెండ్స్ మైకేల్‌‌ జోర్డాన్‌‌, కోబి బ్రయాంట్‌‌ తదితరులకు శిక్షణ ఇచ్చిన గ్రోవర్ ఆన్‌‌లైన్‌‌ క్లాస్‌‌లు అటెండ్‌‌ కావడం కోసం ఉదయం 5 గంటలకే నిద్రలేస్తున్నట్టు చెప్పాడు. ‘ఎన్‌‌బీఏలో గ్రోవర్‌‌కు చాలా పేరుంది. వారానికి మూడు సార్లు ఉదయం 5.30 నుంచి 8.30 వరకు గ్రోవర్ ఆన్‌‌లైన్‌‌ క్లాస్‌‌లు అటెండ్‌‌ అవుతున్నా. ఆపై, మధ్యాహ్నం 1.30 నుంచి 6 గంటల వరకు ఎర్నాకుళం ఇండోర్ నెట్స్‌‌లో కేరళ అండర్– 23 ప్లేయర్స్‌‌, సచిన్‌‌ బేబీ లాంటి రంజీ ప్లేయర్లతో కలిసి ట్రెయినింగ్‌‌లో పాల్గొంటున్నా. తొలి రెండు గంటల్లో రెడ్‌‌ బాల్‌‌తో, చివర్లో వైట్‌‌ బాల్‌‌తో రోజూ కనీసం 12 ఓవర్లు వేస్తున్నా. నా యాక్షన్‌‌ మునుపటిలానే ఉంది. ఔట్‌‌ స్వింగర్ రిలీజ్‌‌లో కూడా మార్పేమీ లేదు’ అని శ్రీశాంత్‌‌ చెప్పాడు. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో రాణిస్తే వచ్చే సీజన్‌‌ ఐపీఎల్‌‌ ఆక్షన్‌‌లోకి వస్తానని చెప్పాడు. తనను బయటికి గెంటేసిన వేదికపైకి తిరిగి రావడంతో పాటు మ్యాచ్‌‌లు గెలిపిస్తానని స్పష్టం చేశాడు. తానేంటో రుజువు చేసుకునేందుకు, ఇండియాకు తిరిగి ఆడేందుకు ఐపీఎల్‌‌ ఒక్కటే ప్లాట్‌‌ఫామ్ అన్నాడు.

కొందరిని క్షమించా.. కానీ ఏదీ మర్చిపోలేదు

శ్రీ ఆటకు దూరమైన ఈ ఏడేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. మరి, మునుపటిలా అందరినీ నమ్మగలనా అనిపించినప్పుడు కాస్త భావోద్వేగానికి గురవుతున్నానని శ్రీశాంత్‌‌ చెప్పాడు. ఇంత జరిగిన తర్వాత కూడా అందరిపై నమ్మకం ఉంచగలను కానీ.. గుడ్డిగా నమ్మి మరోసారి మోసపోనని చెబుతున్నాడు. కొందరిని క్షమించానని, కానీ ఏదీ మర్చిపోలేదని స్పష్టం చేశాడు. ‘ట్రస్ట్‌‌ అనేది చాలా విలువ తక్కువ పదం. ట్రస్ట్‌‌ నుంచి టీ తీసేస్తే మిగిలేది రస్ట్‌‌ (తుప్పు) మాత్రమే. అయినా మనం ఎదుటివారిని నమ్మాల్సిందే. నేను చీకటి రోజుల్లో ఉన్నప్పుడు నన్నెవరూ పట్టించుకోరని అనుకున్నా. కానీ, ఆ థియరీ తప్పని కొందరు నిరూపించారు. ఇర్ఫాన్‌‌ పఠాన్‌‌ నన్ను కలిశాడు. హర్భజన్‌‌ సింగ్‌‌ నా బాగోగులు చూశాడు. మలయాళ ఫిల్మ్‌‌ ఇండస్ట్రీ యాక్టర్స్‌‌, పలువురు పొలిటీషయన్స్‌‌ ఇలా ప్రతి ఒక్కరూ నా మంచి కోరారు’ అని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌‌కు దూరమైన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పాడు.

అందుకే సినిమాల్లో నటించి డబ్బు సంపాదించుకోవాల్సి వచ్చిందన్నాడు. అయితే, వచ్చే ఐదేళ్లలో తన ఫోకస్‌‌ మొత్తం క్రికెట్‌‌పై ఉంటుందని స్పష్టం చేశాడు. లేటు వయసులో టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న శ్రీశాంత్‌‌ ఏ ఫార్మాట్‌‌లో ఆడేందుకైనా సిద్ధమే అంటున్నాడు. ‘ఏ గేమ్‌‌ అయినా సరే ఇండియాకు ఆడడం ముఖ్యం. ఒక్క గేమ్‌‌ ఆడుతూ నేను చనిపోయినా సరే. ఏ ఫార్మాట్ కావాలని నన్ను అడగడం అంటే.. సహారా ఎడారిలో బాగా దాహంతో ఉన్న వ్యక్తితో జ్యూస్‌‌ లేదు వాటర్‌‌తో సరిపెట్టుకో అన్నట్టు ఉంటుంది. అఫ్‌‌కోర్స్‌‌ నేను అన్నీ ఆడుతా. ఎందుకంటే నా పనైపోలేదు. నేను మళ్లీ బౌలింగ్‌‌ చేయడం మీరు చూస్తారు’ అని శ్రీ చెప్పుకొచ్చాడు. అవకాశం వస్తే 2021 టెస్టు చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో ఆడాలని ఉందన్న శ్రీశాంత్‌‌… 2023 వరల్డ్‌‌ కప్‌‌ కూడా తన టార్గెట్‌‌ అన్నాడు.

సూసైడ్‌‌ చేసుకుందామనుకున్నా..

2013లో స్పాట్ ఫిక్సింగ్‌‌ ఆరోపణలు చుట్టుముట్టినప్పుడు నిరంతరం ఆత్మహత్య ఆలోచన లు వచ్చాయని శ్రీశాంత్‌‌ తెలిపాడు. ‘ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ఈ లోకం నుంచి వెళ్లిపోవడమే సులభమైన మార్గం అనుకున్నా. మరణం అంచుల దాకా వెళ్లా. కానీ, నా ఫ్యామిలీ గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకున్నా. ఒక దశలో నేను చీకటిని చూసి భయపడ్డా. డీప్‌‌ డిప్రెషన్‌‌లోకి వెళ్లా. కనీసం ఇంటి నుంచి కాలు బయట పెట్టలేకపోయా. ఎక్కడ తప్పు జరిగింది.. నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అని ఆలోచిస్తుండే వాడిని. ఆ టైమ్‌‌లో మా పేరెంట్స్‌‌కు కనిపించేప్పుడు ఒకలా.. గదిలో మరోలా రెండు రకాల జీవితాలు గడపడం చాలా కష్టంగా అనిపించేది. నేను ఈ ప్రపంచానికి శ్రీశాంత్‌‌ను, మా ఫ్యామిలీకి గోపు.. కానీ నా రూమ్‌‌లో నేను ఏమిటో నాకు తెలిసేది కాదు. అందుకే కొత్త హాబీస్‌‌ను అలవాటు చేసుకున్నా. ఒంటరితనానికి, డిప్రెషన్‌‌కు మధ్య తేడా తెలియక ప్రజలు కన్‌‌ఫ్యూజ్‌‌ అవుతారు. మనం నిరాశలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడాలని చెబుతారు. కానీ, నేను మాత్రం నీతో నువ్వే మాట్లాడుకోవాలంటా. పుస్తకాలు చదవాలి. మన గురించి మనం తెలుసుకునే ప్రక్రియే అది. నేను వేదాలు, మలయాళ సాహిత్యం చదివి నాలెజ్జ్‌‌ పెంచుకునే ప్రయత్నం చేశా’ అని శ్రీశాంత్‌‌ వివరించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates