ఆ పిల్లలు ఆమెని గెలిపిస్తరా?

ముంబైలోని కండివలి రైల్వేస్టేషన్‌. అక్కడున్న స్కైవాక్‌ దగ్గర పిల్లలతో సరదాగా గడుపుతోంది ఓయువతి. రోజు విడిచి రోజు ఆమెకి అదే పని. ఆమె వాళ్లకు పాఠాలు చేప్పే టీచర్. కేవలం పాఠాలు చెప్పి సరిపెట్టు కోదు. విద్యను అభ్యసించడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆసక్తిని పిల్లల్లో నింపుతుంది. అదనంగా కళలు,చేతివృత్తుల గురించి వాళ్లకుబోధిస్తుంది. ఇరవై రెండేళ్ల హైమంతిసేన్‌ ఇలా చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.

హైమంతి ఆఫీస్ వెళ్లాలంటే ఈ స్టేషన్‌ నుంచే వెళ్లాలి. అలా రోజువారీ ప్రయాణంలో భిక్షమెత్తుకొనే పిల్లల్ని గమనిస్తూ ఉండేది. ఎస్కలేటర్‌ దగ్గర పడిగాపులు కాస్తూ వచ్చిపోయేవారి వెంట పడుతూ డబ్బులు అడగటం వాళ్ల పని. వాళ్లంతా ఆ దగ్గర్లోని మురికివాడలో నివసిస్తుంటారు. ఆర్నెల్ల పాటు పిల్లల పరిస్థితిని గమనించిన హైమంతికి రోజురోజుకీ బాధ ఎక్కువైంది. చదువుకోవాల్సిన పిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరగడం చూసి చలించి పోయింది. వారికి ఎందుకు విద్య దూరమైందన్న ఆలోచన ఆమెలో కలిగింది. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి నేరుగా ఆ పిల్లల కుటుంబాల్ని కలవడానికి సిద్ధమైంది.

ఎక్కువే అడిగారు….

కొందరు పిల్లల్ ని వెంటబెట్టుకుని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లింది. ‘ పిల్లల్నిస్కూళ్లలో చేర్చాం.. వాళ్లే స్కూల్‌ ఎగ్గొట్టి తిరుగుతున్నారు’ అని వాళ్లు సమాధానం చెప్పారు. అయితే రోజు విడిచి రోజు పాఠాలు చెప్పేందుకు తాను సిద్ధమని చెప్పింది హైమంతి. ‘అయితే ఇంకేం పిల్లల్ ని స్కూల్‌ మాన్పించేస్తాం’ అన్నారు ఆ పేరెంట్స్‌. అంతేకాదు ‘పాఠాలు మాత్రమే చెప్తారా ? పిల్లలకి భోజనం, బట్టలు కూడా ఇస్తారా ?’ అని అడిగారు. ‘ఇవ్వను’అని సున్నితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది హైమంతి.

స్కూల్‌ మళ్లీ ఎగ్గొట్టారు….

గతేడాది వేసవి సెలవులు ముగిశాక హైమంతి ప్లా న్ ఆఫ్‌ యాక్షన్‌లోకి దిగింది. పిల్లలకు స్వయంగా పాఠాలు చెప్పడం కంటే ముందు దగ్గర్లోని కొన్ని స్కూల్‌ మేనేజ్ మెంట్లతో మాట్లాడి కొందరు పిల్లల్ని చేర్పించింది హైమంతి. ‘రైట్‌ టు ఎడ్యుకే షన్’ కింద వాళ్లను చేర్చుకునేందుకు ఆ స్కూల్‌ మేనేజ్ మెంట్లు అంగీకరించాయి.అయితే ‘ఈ పిల్లలు స్కూల్లో కూర్చోరు, చేర్పించుకున్నా ఉపయోగం ఉండదని’ వాళ్లు ఆమెతో అన్నారు. వాళ్లు రోజూ స్కూలుకు వచ్చేటట్లు చూసే భరోసా తనదని ఆమె మాటిచ్చింది. కానీ హైమంతి మాటకు విలువలేకుండా పోయింది. పిల్లలు షరా మామూలుగా మళ్లీ స్టేషన్‌ బాట పట్టారు. అయితే హైమంతి మాత్రం పట్టువీడలేదు. తన ఆశయాన్ని మార్చుకోలేదు.

ప్లాన్ జునూన్‌…

ఈ పిల్లల్ని తానే స్వయంగా సరిచేయాలని నిర్ణయించుకుంది. పిల్లలకు శిక్షణ ఇస్తూ, క్రమక్రమంగా బడిపై ఆసక్తిని పెంచడానికి నిశ్చయించుకుంది. ఆఫీస్‌ ముగిశాక రోజూ గంట పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఇందుకోసం ‘జునూన్‌’ అనే ఎన్జీవోను స్థాపించింది. కండివలి రైల్వేస్టేషన్‌ స్కైవాక్ ను పిల్లలకు పాఠాలు చెప్పేందుకు వేదిక చేసుకుంది. ఆమె ఆశయం నచ్చిన కొందరు యువతీయువకులు ఆ ఎన్జీవోలో చేరారు. జునూన్‌ సేవలు ఒక ప్రణాళిక ప్రకారం సాగుతాయి. ప్రతి శని, ఆది వారాలు పిల్లలకు డ్యాన్స్‌, కళలు, నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. మంగళ, గురు, శుక్రవారాల్లో స్కూళ్లలోని పాఠాలు చెబుతారు. బుధవారం మాత్రం పిల్లలు ఈ టీచర్లు చేసే వీధి నాటకాలను చూస్తారు. ఆసక్తి ఉన్న కొందరు పిల్లలు అందులో పాల్గొంటారు. ఆరు నెలల క్రితం మొదలైన జునూన్‌ వల్ల పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కానీ, ఇప్పటికీ కొందరు పిల్లలు క్లాసులకు రావడంలేదు. అయితే భవిష్యత్తులో పిల్లలందరూ తన ఆశయాన్ని గెలిపిస్తా రని నమ్మకంతో పనిచేస్తూనే ఉంది హైమంతి.

Latest Updates