చెట్లపై ప్రేమ.. ఈ చిన్నారిని గూగుల్ స్టార్ చేసింది!

గూగుల్ డూడుల్ పోటీ: లక్ష మందిలో ఏడేళ్ల చిన్నారి దివ్య విక్టరీ

చెట్లు నడవగలిగితే బాగుండు అంటూ చిత్రం

రెండో తరగతి చదువుతున్న హర్యానా చిన్నారి

పిట్ట కొంచెం గూత ఘనం! అచ్చంగా ఈ పాపకు సూట్ అయ్యే మాట ఇది. లక్ష మందితో పోటీపడి గూగుల్ స్టార్‌గా నిలిచిందీ ఏడేళ్ల చిన్నారి. చెట్లపై తనకున్న ప్రేమ… బొమ్మలు గీయడంలో ఉన్న టాలెంట్.. ఈ ఘనత సాధించేలా చేసింది. గూగుల్ డూడుల్-2019 పోటీలో విజేతగా నిలిపింది.

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఏడేళ్ల చిన్నారి దివ్యాన్షి సింఘాల్ రెండో తరగతి చదువుతోంది. 2019 గూగుల్ డూడుల్ ప్రకటన తనలో ఆసక్తిని రేపింది. 1వ తరగతి మొదలు పదో తరగతి విద్యార్థుల వరకు డూడుల్‌కు మంచి థీమ్‌తో చిత్రాలు గీసి పంపాలని కాంపిటీషన్ పెట్టింది. దాదాపు లక్ష మందిపైనే ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ, ఆ చిన్నారి ఆలోచన ముందు వాళ్లంతా సైడ్ అయిపోయారు. దివ్య వేసిన ‘వాకింగ్ ట్రీస్’ బొమ్మకు టాప్ ప్లేస్ దక్కింది.

 అమ్మమ్మ ఊరిలో ఆలోచన

వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరికెళ్లడం అంటే ఆ చిన్నారి దివ్యకు చాలా ఇష్టం. కానీ అక్కడ చెట్లను నరుకుతున్న ఘటనలు చూసి ఆ పసి మనసుకు చివుక్కుమంది. మనకు ప్రాణవాయువునిచ్చే చెట్లకు ప్రాణాలను నిలుపుకునే శక్తి ఉంటే బావుండు అనుకుంది. అప్పుడు తన మనసులో అనిపించిన ఆలోచననే గూగుల్ డూడుల్ పోటీలో బొమ్మగా మలిచానని చెబుతోంది దివ్య. చెట్లకు కాళ్లు ఉండి.. తమను నరకడానికి ఎవరైనా వస్తే అవి నడుచుకుంటూ.. తప్పించుకుంటే ఎంత బావుండునో కదా అని ఆ చిన్నారి చెప్పింది. దీన్ని బొమ్మగా గీసి.. గూగుల్ పోటీలో విజేతగా నిలిచింది.

Latest Updates