రాయలసీమను రతనాల సీమగా మారుస్తం: కేసీఆర్

  • ఇద్దరు ముఖ్యమంత్రులం ఒక నిర్ణయానికి వచ్చినం
  • 70 ఏండ్ల నుంచి ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నం
  • కొంత మందికి జీర్ణం కాకుంటే మేం చేసేదేం లేదు
  • జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తా: సీఎం కేసీఆర్
  • కంచికి వెళ్లి వస్తూ, ఏపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆతిథ్యం

తిరుమల/ హైదరాబాద్‌‌, వెలుగు:    రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఏపీ సీఎం జగన్‌‌కు పెద్దన్నగా సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్‌‌ అన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని, ఆ నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయన్నారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగాలన్నా, రతనాల సీమగా మారాలన్నా గోదావరి జలాలు రావాల్సిన అవసరముందన్నారు. సోమవారం కేసీఆర్‌‌ కుటుంబ సభ్యులతో కలసి  తమిళనాడు కంచిలోని అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేసీఆర్‌‌ వెంట నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌‌పర్సన్‌‌ ఆర్‌‌కే రోజా, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌‌రెడ్డి, టీఆర్‌‌ఎస్‌‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్‌‌కుమార్‌‌రెడ్డి, తదితరులు కంచికి వచ్చారు. తిరుగుప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్తోనే సీమ అభివృద్ధి

‘‘గోదావరి నీళ్లతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తం.70 ఏండ్ల నుంచి ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నం. ఇద్దరు ముఖ్యమంత్రులం ఒక నిర్ణయానికి వచ్చినం. కొంత మందికి జీర్ణం కాకుంటే మేం చేసేదేం లేదు” అని సీఎం కేసీఆర్ కామెంట్​చేశారు. పట్టుదల ఉన్న యువ నాయకుడు ఏపీ సీఎం జగన్‌‌ అని కితాబిచ్చారు. జగన్​తోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్‌‌ సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. రోజా ఇంట్లో సీఎం కేసీఆర్​సుమారు రెండు గంటల పాటు ఉండి, ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి హైదరాబాద్‌‌ బయలుదేరారు. కేసీఆర్‌‌ వెంట విమానాశ్రయానికి ఏపీ పంచాయతీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్‌‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ తమ ఇంటికి రావటం సంతోషంగా ఉందని రోజా అన్నారు.“ కేసీఆర్ గారు మా ఇంటికి  రావడం మా అదృష్టం” అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Latest Updates