పడిపోతున్న ఆదాయం.. తగ్గుతున్న ఖర్చు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల వాసుల ఆదాయం  భారీగా పడిపోతోంది. దీంతో కార్లు, బైకులు, విమానయానం, ఎఫ్‌‌‌‌ఎంసీజీ వస్తువులకు డిమాండ్‌‌‌‌ తగ్గిపోతున్నది. గత కొన్ని క్వార్టర్లతో పోలిస్తే ఈ క్వార్టర్లో వినియోగం మరీ తక్కువ నమోదయింది. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను అదుపు చేయడంపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం కూడా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నెల కొత్తగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం వినియోగాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే వాటిలో వినిమయరంగం కూడా ఒకటి. ఎఫ్‌‌‌‌ఎంసీజీ వస్తువుల వాడకం తగ్గడంపై హిందుస్థాన్‌‌‌‌ యూనిలీవర్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సంజీవ్‌‌‌‌ మెహతా స్పందిస్తూ ఎఫ్‌‌‌‌ఎంసీజీ రంగం మాంద్యానికి గురికాదు అని చెప్పలేం కానీ మాంద్యాన్ని చాలా వరకు తట్టుకొని నిలబడుతుందని అన్నారు. ‘‘ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజలు స్నానం చేయడాన్ని, పళ్లు తోముకోవడాన్ని ఆపరు. కానీ ఉపయోగించే బ్రాండ్ల సంఖ్య తగ్గుతుంది. పెద్ద ప్యాక్‌‌‌‌లకు బదులు చిన్నవి, తక్కువ ధరవి కొంటారు’’ అని వివరించారు. ప్యాసింజర్‌‌‌‌ కార్ల అమ్మకాల పరిస్థితి కూడా ఏమీ బాగా లేదు. గత పది నెలల్లో ఒక నెల మినహా మిగతా అన్ని నెలల్లో అమ్మకాలు తగ్గాయి. టూవీలర్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. పెద్దనోట్లు రద్దు చేసిన 2016, నవంబరు పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎఫ్‌‌‌‌ఎంసీజీ అమ్మకాల్లో మూడొంతుల కంటే ఎక్కువ మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదవుతాయి. ప్రస్తుతం ఇవి ఆరేడు క్వార్టర్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ ఏడాది మార్చి ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ కోటీ 60 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది కేవలం 0.1 శాతం ఎక్కువ. 2013 జూన్‌‌‌‌ తరువాత ఇంత అత్యల్ప పెరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి.

ముందున్నది ముళ్లబాట…

మారుతీ సుజుకీ అమ్మకాలు గత నెల 17.2 శాతం తగ్గాయి. 2012 తరువాత ఇంత అత్యల్ప వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఎక్కువగా అమ్ముడయ్యే బాలెనో, డిజైర్‌‌‌‌, స్విఫ్ట్‌‌‌‌ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంTవత్సరంలో 4–8 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. కొత్త కాలుష్య నియంత్రణ ప్రమాణాల వల్ల ధరలు పెరిగాయి కాబట్టి వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమని మారుతీ సీఎఫ్‌‌‌‌ఓ అజయ్‌‌‌‌ సేఠ్‌‌‌‌ అన్నారు. కార్ల కంపెనీలు ఈ ఏడాది ఆరుశాతం వరకు పెరుగుదల నమోదు చేసినా, వచ్చే ఏడాది మాత్రం అమ్మకాలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఐహెచ్‌‌‌‌ఎస్ ఆటోమోటివ్‌‌‌‌కు చెందిన గౌరవ్‌‌‌‌ వంగల్ అన్నారు. వాహనరంగంలో స్కూటర్ల విభాగం దారుణంగా దెబ్బతింది. గత 13 ఏళ్ల తరువాత తొలిసారిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వృద్ధి నమోదయింది. హిందుస్థాన్‌‌‌‌ యూనిలీవర్‌‌‌‌, బ్రిటానియా, డాబర్‌‌‌‌, జీసీపీఎల్‌‌‌‌ సగటు వృద్ధి మార్చి క్వార్టర్‌‌‌‌లో ఆరు శాతం దాటలేదు.

ఇవీ కారణాలు

అన్ని రంగాల్లోనూ వినియోగం పడిపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. గత రెండేళ్లుగా సాగు ఆదాయం చాలా తక్కువగా ఉంది. ధరలూ తక్కువే ఉన్నాయి. అందుకే వ్యవసాయ ద్రవ్యోల్బణం స్వల్పంగానే పెరిగింది. వ్యవసాయరంగం నామినల్‌‌‌‌ జీడీపీ పెరుగుదల 2018 అక్టోబరు–డిసెంబరు క్వార్టర్‌‌‌‌లో కేవలం రెండుశాతం నమోదయింది. 2012 ఏప్రిల్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ తరువాత ఇదే అత్యల్పం. చాలా వస్తువులపై జీఎస్టీ శ్లాబును తగ్గించినా,  వాటి ధరలు మాత్రం తగ్గలేదు. మూడోకారణం ఐఎల్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ దివాలా తీయడం. లిక్విడిటీ దొరక్కపోవడంతో గత ఏడాది సెప్టెంబరులో ఇది పతనమయింది. దీంతో మిగతా కంపెనీలకూ లిక్విడిటీ దొరకడం ఇబ్బందిగా మారింది. జీడీపీ వృద్ధితో సమానంగా మార్కెట్లోకి నగదు రావడం లేదని క్రెడిట్‌‌‌‌ సూసీ విశ్లేషించింది. ‘‘స్థూల (గృహపొదుపు డేటా), సూక్ష్మ (సెక్టర్‌‌‌‌, కంపెనీ అమ్మకాల డేటా) ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే ఆదాయం సరిపోక చాలా మంది వస్తువుల కొనడం ఆపేశారు’’ అని కోటక్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్‌‌‌‌ ఈక్విటీస్‌‌‌‌కు చెందిన సంజీవ్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ అన్నారు. ఆదాయ వృద్ధి పద్ధతులు, సాగు జీడీపీ వృద్ధి తక్కువగా ఉండటం వల్ల 2017 నుంచి వినియోగం తగ్గిందని అన్నారు.

Latest Updates