కొన్ని జాగ్రత్తలతో…మతిమరుపు దూరం

with-some-caution-absence-of-forgetfulness

ఒక విషయాన్ని విన్నా, చూసినా, మాట్లాడినా, స్పందించినా వాటిని తర్వాత గుర్తుంచుకోకపోవడం మతిమరుపు లక్షణం. ఒక పని బాగా చేసినా ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోతుంటారు. సాధారణంగా మెదడు ప్రతి విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి గుర్తుంచుకుంటుంది.
అయితే కొందరిలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగదు. దీంతో చాలా విషయాలు స్పష్టంగా గుర్తుండవు. బాగా ఆలోచిస్తే తప్ప గుర్తురావు. రెండు రోజుల క్రితం ఏ కూర తిన్నారో కూడా గుర్తుండదు. ఇలాంటి పరిస్థితి ఉందంటే మతిమరుపు కిందే లెక్క.

కారణాలు..

..వయసు పైబడటం వల్ల కొందరిలో మతిమరుపు పెరుగుతూ ఉంటుంది. ఇది సాధారణమే. కొంతవరకు తగ్గించొచ్చు కానీ, పూర్తిగా నివారించలేం.

… మెదడులో గాయాలున్నా, రక్తం గడ్డకట్టినా మెదడు పనితీరు దెబ్బతిని మర్చిపోతుంటారు.

…ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగలడం వల్ల. మెదడులో ఇన్ఫెక్షన్ల వల్ల.

… పోషకాహార లోపం, నిద్రలేమి, యాంగ్జైటీ, డిప్రెషన్,  ఒత్తిడి వంటి మానసిక ఆందోళనలు.

… కొన్ని రకాల మందులు వాడటం వల్ల, పార్కిన్​సన్స్​ వంటి జబ్బులు ఉండటం వల్ల.

… జీవితంలో ఏదైనా అనుకోని ప్రమాదం, విపత్తు, వేధింపులను ఎదుర్కోవడం వల్ల.

లక్షణాలు…

….  ప్రతి విషయాన్ని సులభంగా మర్చిపోవడం

…  ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుంచుకోకపోవడం

…  ఒకే అంశం గురించి పదేపదే ప్రశ్నించడం

…  ఒక విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పదాల్ని వెతుక్కోవడం

…  ఒక పని చేస్తూ మరో పని గురించి మర్చిపోవడం

వైద్యుల్ని సంప్రదించాలి…..

ఇది చాలా మందిలో సాధారణంగానే కనిపిస్తుంది. ఏదో ఒక సందర్భంలో తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పర్లేదు. కానీ, రోజూ ఇలా ఏదో ఒకటి మర్చిపోతుంటే మాత్రం కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. చాలా మంది దీనికి డాక్టర్​ను సంప్రదించడం అవసరమా అని ఆలోచిస్తారు. కానీ, దీనికి చికిత్స తీసుకోవడం అవసరం. వైద్యుల్ని సంప్రదిస్తే సమస్యకు మూలాల్ని గుర్తించి చికిత్స అందిస్తారు. న్యూరాలజిస్ట్,  సైకాలజిస్ట్,  సైకియాట్రిస్ట్​లను సంప్రదించాలి. రోగి పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మందులతో ప్రయోజనం ఉండొచ్చు. కొన్నిసార్లు రకరకాల థెరపీల ద్వారా మతిమరుపు ప్రభావాన్ని తగ్గిస్తారు.

కొన్ని జాగ్రత్తలు….

మతిమరుపు ఉందంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అయితే ఈ సమస్య ఉన్న వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

…గేమ్స్​ ఆడినా, వర్కవుట్లు చేసినా, రన్నింగ్​ చేసినా శరీరం అంతా రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడుకు కూడా రక్తం ఎక్కువగా చేరడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.

…మెదడుకు శక్తినిచ్చే పనులు చేయాలి. పజిల్స్​ పూరించడం, రూబిక్​ క్యూబ్స్​ సరి చేయడం, డ్యాన్స్,  మ్యూజిక్, కొత్త భాష, డ్రాయింగ్​ వంటివి నేర్చుకోవడం చేయాలి.

…  వీలున్నప్పుడల్లా ఫ్రెండ్స్, రిలేటివ్స్​ను కలుస్తుండాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపాలి.

… చేయాల్సిన పనుల జాబితా​ రాసుకుని, పనులను ప్రాధాన్య క్రమంలో చేయాలి.

..  రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే మెదడు అలసటకు గురై పనితీరు తగ్గిపోతుంది.

…యోగా, ధ్యానం చేయాలి. అన్ని పోషకాలు అందేలా మంచి ఆహారం తీసుకోవాలి.

..డిప్రెషన్,  ఒత్తిడి వంటి సమస్యలుంటే వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.

డిజిటల్​ డిమెన్షియా….

నేటి కాలంలో పెద్దవాళ్లే కాకుండా యువత కూడా మతిమరుపు సమస్యను ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీపైనే ఎక్కువగా ఆధారపడటం. ఎవరి నెంబర్​ అయినా ఫోన్​లో సేవ్​ చేసుకుంటున్నారు. అడ్రస్​లు వంటివి కావాల్సి వస్తే గూగుల్​ మ్యాప్స్​పై ఆధారపడుతున్నారు. ఫలితంగా మెదడుకు పనిలేకుండా పోతోంది. నేటి తరంలో చాలా మందికి తమ ఏరియా పిన్​ కోడ్​ నంబర్లు కూడా తెలీవంటే ఆశ్చర్యపోనవసరం లేదు. డిజిటల్​ టెక్నాలజీ వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుండటాన్ని ‘మ్యాన్​ఫ్రెడ్​ స్పిట్జర్’ అనే జర్మన్​ శాస్త్రవేత్త ‘డిజిటల్​ డిమెన్షియా’గా పేర్కొన్నాడు. దీని ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటోంది.

Latest Updates