అందుబాటు ఇళ్లకు ఉప్పల్ దిక్కు బెస్ట్

హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్​బూమ్ ఉంది. కోర్ సిటీలో పెరిగిన డిమాండ్ తో స్థిరాస్తి కొనుగోలు చేయాలని అనుకునేవారంతా శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో మరింత డిమాండ్ ఉండే లోకేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఐటీ కారిడార్ కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ సిటీ తో పోల్చితే అందుబాటు ధరల్లో, సామాన్యుడి స్తోమతకు తగినట్లుగా ఆవాసాలను కొనుగోలు చేయాలంటే ఈస్ట్ సిటీ వైపు చూడాల్సిందే. మెట్రో డిపో రాకతో ఉప్పల్ లో రియల్ వ్యాపార స్వరూపమే మారిపోగా, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత డిమాండ్ వస్తుందని ఏవీ కన్ స్ట్రక్షన్ ఎండీ, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకటరెడ్డి ‘వెలుగు’ తో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈస్ట్ లో డెవలప్​మెంట్​కు స్కోప్​

సిటీలో ఇతర ప్రాంతాల కంటే ఈస్ట్ సిటీలో డెవలప్ మెంట్ కు ఎంతో స్కోప్ ఉంది. ప్రస్తుతం ఐటీ కారిడార్, కోర్ సిటీలో పెరిగిన ట్రాఫిక్, జనాభాతో అందుబాటు ధరల్లో సొంతింటిని కొనే పరిస్థితి లేదు. తక్కువ ధరలో, ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారేవరైనా ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, కాప్రా, హయత్ నగర్, ఎల్బీ నగర్, మల్లాపూర్, చర్లపల్లి, ఆర్కే పురం, బీబీనగర్, ఔశపూర్, ఘట్ కేసర్, నారాపల్లి, చెంగిచర్ల, యాదగిరిగుట్ట వైపు చూస్తున్నారు.ఈ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. ఇండింపెంట్, అపార్టుమెంట్, లగ్జరీ విల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఫిర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి పరిసర ప్రాంతాలలో 30కిపైగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఈస్ట్ సిటీ మరింత కాస్ట్లీ అవుతుంది.

 మెట్రో డిపోతో మారిన తీరు

చాలా ఏళ్ల క్రితమే ఉప్పల్ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీఎస్ఐఆర్, ఎన్ఐఎన్, సర్వే ఆఫ్ ఇండియా, యూనివర్సిటీలు, జెన్ పాక్, స్టేడియం వంటివి వచ్చాయి.  అయితే రెండేళ్ల క్రితం ఏర్పాటైన మెట్రో డిపోతో ఈస్ట్ సిటీ రియల్  స్వరూపం మారిపోయింది. అప్పటికే ఉప్పల్ కేంద్రంగా కొన్ని ఐటీ సంస్థలు పనిచేస్తున్నా.. అంతగా గుర్తింపు లేదు కానీ డిపో నిర్మాణం, మెట్రో రాకపోకలతో  ఐటీ రంగానికి సెకండ్ డెస్టినీగా ఈ ప్రాంతం మారబోతోంది. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండే యాదాద్రి ఆలయాన్ని ప్రభుత్వం వేల కోట్లతో డెవలప్ చేస్తోంది. ఘట్ కేసర్ వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు మొదలైతే అభివృద్ధి మరింత ఊపు అందుకుంటుంది.

మౌలిక వసతులే మెయిన్ అసెట్

ఉప్పల్ గుండా పోయే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, నారాపల్లి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు 6 కి.మీ పొడవైన ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం, నారాపల్లి, చెంగిచర్ల ప్రాంతంలో వందల ఎకరాల్లో విస్తరించిన పచ్చని అటవీ భూములతో ఈస్ట్ సిటీకి ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ ప్రాంతాన్ని మల్టీ పర్పస్ జోన్ గా మార్చే యోచనలో  ప్రభుత్వం ఉండగా, మరిన్ని ఐటీ కంపెనీ, ఇతర ఇండస్ట్రీలు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. దీంతో రియల్ రంగం అభివృద్ధికి మరింత అనువైన ప్రాంతంగా మారనుంది. ఫిర్జాదిగూడ, ఘట్ కేసర్, పోచారం, బోడుప్పల్ వంటి పంచాయతీలన్నీ  మున్సిపాలిటీలుగా మారడంతో ఈ ప్రాంతాల్లోనూ రోడ్లు, రవాణా, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రోడ్ల విస్తరణ, వరంగల్ హైవే పనులతో పాటు ఉప్పల్ మినీ శిల్పారామం, ఉప్పల్ భగాయత్ ప్లాట్లలో నిర్మాణాలు మొదలైతే రియల్ వ్యాపారానికి మరింత సానుకూల వాతావరణం వస్తుంది.

Latest Updates