వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోంతో కొందరికి ట్యాక్స్ పెరిగే అవకాశం

బిజినెస్ డెస్క్, వెలుగువర్క్​ ఫ్రం హోమ్​… ఉద్యోగులకు సౌకర్యవంతమే అయినా కొందరికి పన్ను మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఎలాగో ఒక ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్​కు చెందిన శ్రీనివాస్​ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​. కరోనా కారణంగా కచ్చితంగా ఇంటి నుంచే పనిచేయాలని కంపెనీ ఆదేశించింది. దీంతో ఆయన జూలైలోనే హైదరాబాద్​ అద్దెంటిని ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. దీనివల్ల అద్దె మొత్తం మిగులుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా, శ్రీనివాస్​ తన తల్లిదండ్రులతో ఉన్నంతకాలం హౌజ్​ రెంట్ అలవెన్స్ (హెచ్​ఆర్​ఏ) మినహాయింపును క్లెయిమ్​ చేసుకోవడం సాధ్యం కాదు. ఫలితంగా చెల్లించాల్సిన పన్ను విలువ పెరుగుతుంది. ఇదొక్క శ్రీనివాస్​ పరిస్థితే కాదు. లాక్​డౌన్​ విధించిన తరువాత చాలా మంది ఉద్యోగులు అద్దిండ్లను వదిలేసి సొంతూళ్ల బాట పట్టారు. అక్కడి నుంచే పనిచేసుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ హెచ్​ఆర్​ఏ మినహాయింపు ఉండకపోవచ్చని ట్యాక్స్​ ప్లానర్లు అంటున్నారు. మరికొందరు సిటీల్లోనూ ఉంటూ యజమానిపై ఒత్తిడి తెచ్చి ఇంటి అద్దెను తగ్గించుకున్నారు.

హెచ్​ఆర్​ఏ లెక్కింపు ఇలా..

ఐటీ చట్టం సెక్షన్​ 10 (13ఏ) ప్రకారం ఉద్యోగి జీతంలో హెచ్​ఆర్​ఏ కూడా భాగమే! చెల్లించిన అద్దె మొత్తానికి పన్ను మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుంది. నివసించే నగరం, పట్టణం, గ్రామీణ ప్రాంతాన్ని బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. మెట్రో నగరాల వాళ్లు ఎక్కువ మొత్తాన్ని, చిన్న పట్టణాల ఉద్యోగులు తక్కువ మొత్తాన్ని క్లెయిమ్​ చేసుకోవచ్చు. ‘‘సొంతింటి నుంచే పనిచేసే వారికి కిరాయి ఏమీ లేదు కాబట్టి ఇంటి నుంచి పనిచేసిన కాలానికి హెచ్​ఆర్​ఏను క్లెయిమ్​ చేసుకోవడం సాధ్యం కాదు”అని ఏకేఎం అనే కన్సల్టింగ్​ ఫర్మ్​ డైరెక్టర్​ శిల్పా భాటియా అన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.15 వేలు హెచ్​ఆర్​ఏగా పొందుతున్నాడు. ఇంతే మొత్తాన్ని అద్దెగా చెల్లిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలపాటు కిరాయి కట్టలేదు కాబట్టి అతడు పన్ను కట్టాల్సిన మొత్తం విలువ రూ.1.35 లక్షలకు పెరుగుతుంది. ఉద్యోగి 20 శాతంట్యాక్స్​  బ్రాకెట్లోకి వస్తే రూ.27 వేల వరకు కట్టాలి. అయితే ఇంటి నుంచి పనిచేసే సమయంలో కొంత మొత్తం కుటుంబ సభ్యుడికి చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని క్లెయిమ్​ చేసుకోవచ్చు. అయితే, అతడు/ఆమె ఆ మొత్తాన్ని తన ఐటీఆర్​లో చూపించాలి. సొంతింట్లో ఉంటే ఇలాంటి చెల్లింపుల అవసరం రాదు కానీ బంధువులు లేదా స్నేహితుల ఇంట్లో ఉండి వారికి కొంత మొత్తం ఇస్తే డిడక్షన్​ వర్తిస్తుందని సీనియర్​ ట్యాక్స్​ప్లానర్​ ఒకరు అన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కిరాయి వివరాలన్నీ ముందుగానే కంపెనీ హెచ్​ఆర్​కు తెలియజేయాలి.

 

 

Latest Updates