నాకు న్యాయం కావాలి… బావ చేతిలో మోసపోయిన మరదలు

పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించిన మరదలిని మోసం చేశాడో బావ. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బావ మాట మార్చడంతో ఆమెకు ఏం చేయాలో తెలియక న్యాయం కోసం ఊరిలోకి వాటర్ ట్యాంక్ ఎక్కింది. బావ తనను పెళ్లి చేసుకోకపోతే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంటానని కన్నీరుమున్నీరయ్యింది. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామంలో గురువారం (జూన్ 13) ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

అప్పన్నపేట గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన తన మేనబావ అనవేణి శ్రీకాంత్‌‌తో మూడేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. వరసకు మేనబావే కావడంతో అతడిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది.
యువతితో ఆమె బావ శ్రీకాంత్‌ ప్రేమ వ్యవహారం గురించి గ్రామంలోనూ అందరికీ తెలుసు. అయితే.. కొద్ది రోజులుగా శ్రీకాంత్‌ తన మరదలిని దూరం పెడుతున్నాడు. ఏం జరిగిందని ఆరా తీయగా.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధితురాలు తన బావను నిలదీసింది. కానీ, ఆమెతో పెళ్లికి శ్రీకాంత్‌ ససేమిరా అన్నాడు.

పెళ్లి పేరుతో మేన బావ తనను దారుణంగా మోసం చేశాడంటూ తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి.. గురువారం ఉదయం గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కింది. తన బావతో పెళ్లి చేయించాలని.. లేదంటే చనిపోతానని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను సినిమాలు, షికార్లకు తీసుకెళ్లాడని.. పుట్టినరోజుకు కుందేళ్లు కానుకగా ఇచ్చాడని చెప్పింది.  అతడికి తాను డ్రెస్సులు ఇప్పించానని చెప్పింది. అన్నీ జరిగాక ఇప్పుడు తనను మోసం చేశాడంతూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది.

సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ఘటనా స్థలికి వచ్చి యువతికి సర్దిచెప్పడంతో కిందకి దిగింది. వాటర్ ట్యాంక్‌ దిగిన తర్వాత బాధితురాలు వాళ్ల ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్ధం కాగా.. పోలీసులు సర్దిచెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె సమస్యపై ఫిర్యాదు తీసుకున్నారు. యువతి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన విషయం తెలిసిన ఆమె బావ శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయారు. ఎలాగైన యువతికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు గ్రామస్థులు.

Latest Updates