అత్తింటి వేధింపులు : రెండేళ్ల కొడుకుతో ఆత్మహత్య

అత్తింటి వేధింపులు తట్టుకోలేక రెండేళ్ల కొడుకుతో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎల్ బీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం..నాగోల్ బండ్లగూడకి చెందిన తూర్పాటి రాజశేఖర్ నల్లకుంటకి చెందిన సుజాత(27)ని ఐదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు నితీశ్ ఉన్నాడు.

రాజశేఖర్ సోదరుడు రాఘవేంద్ర అప్పులు చేశాడు. వీటిలో కొన్నింటికి రాజశేఖర్ మధ్యవర్తిగా ఉన్నాడు. రాఘవేంద్ర తాను చేసిన అప్పులు తీర్చకుండ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అప్పులిచ్చివారు రాజశేఖర్ పై ఒత్తిడి తెచ్చారు. సుజాత తన బంగారు నగలను అమ్మేసి అప్పు తీర్చేందుకు డబ్బు ఇవ్వాలని ఆమెపై రాజశేఖర్ తల్లిదండ్రులు ఎల్లమ్మ, దయాకర్ ఒత్తిడి తెచ్చేవారు.

అప్పటి నుంచి రాజశేఖర్ డ్యూటీకి వెళ్లగానే అత్త, మామ సుజాతను రోజూ వేధించేవారు. వీరి వేధింపులు తట్టుకోలేక సుజాత సోమవారం ఉదయం భర్త రాజశేఖర్ బయటకు వెళ్లిన సమయంలో బెడ్రూంలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి కొడుకు నితీశ్ కి చున్నీతో ఓ వైపు ఉరి వేసి మరోవైపు తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఇంటికి వచ్చిన రాజశేఖర్ డోర్ తీసేందుకు ప్రయత్నించగా.. రాలేదు.

అనుమానం వచ్చిన రాజశేఖర్ స్థానికుల సాయంతో బెడ్రూం డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ సుజాత, తన కొడుకు చనిపోయి ఉన్నారు. సుజాత తల్లిదండ్రులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.