వైరల్ వీడియో: పిల్లి కోసం పసివాడి ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టిన బామ్మ

పెంపుడు పిల్లి కోసం పసివాడి ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టింది ఆ ముసలావిడ. సొంత మనవడికి తాడు కట్టి ఐదో అంతస్తు బాల్కనీలో నుంచి వేలాడదీసింది. కింది ప్లోర్‌లో పడిన పిల్లిని వెనక్కి లాగాడనికి ఏడేళ్ల మనవడి నడుముకు తాడు కట్టి కిందికి దించింది. ఆదివారం నాడు ఆ బామ్మ చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పసివాడి పరిస్థితి ఏమయ్యేదంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

చైనాలోని సిచౌన్ ప్రావిన్స్‌లో పెంగాన్‌లో ప్రాంతంలో నివసించే తాంగ్ అనే ముసలావిడ ఎంతో ముద్దుగా చూసుకోవాల్సిన తన ఏడేళ్ల మనవడు హయో హయో ప్రాణంతో ఆటలాడింది. తన పెంపుడు పిల్లి వారు ఉండే ఐదో ఫ్లోర్ నుంచి నాలుగో ఫ్లోర్‌లోకి దూకింది. దీన్ని చూసిన తాంగ్ పిల్లి కోసం మనవడికి తాడు కట్టి ఐదో ఫ్లోర్ బాల్కనీ నుంచి వేలాడదీసింది. ఇది చూసిన ఇరుగుపొరుగు వద్దని అరిచినా ఆమె వినలేదు. పిల్లాడి చేతికి ఓ బుట్ట ఇచ్చి అందులో పిల్లిని పెట్టాక.. మరో వ్యక్తి సాయంతో తాడును పైకి లాగింది. 10 నిమిషాల పాటు జరిగిన ఈ సాహసాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి.. ఇంటర్నెట్‌లో పెట్టాడు. ఈ వీడియో చూసిన వాళ్లు కూడా.. పిల్లి కోసం పసివాడి ప్రాణం రిస్క్‌లో పెట్టిందంటూ ముసలావిడను తిడుతున్నారు.

వీడియో చూశాక భయమేసింది

ఈ పని చేసిన ముసలమ్మను ప్రశ్నించగా.. తాను తాడు కట్టి దించుతున్నప్పుడు ఏమీ తెలియలేదని చెబుతోంది. పిల్లి కోసం తాను మనవడిని ప్రమాదంలోకి నెట్టానని అప్పుడు అనిపించలేదని అంటోంది. ఆ సమయంలో తనకు ఏమీ భయం వేయలేదట. కానీ, వీడియో చూశాక వెన్నులో వణుకు పుట్టిందని చెబుతోందామె. పిల్లాడికి ఏమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అనిపించిందని, ఇలాంటి పనులు మళ్లీ చేయబోనని చెప్పింది.

Latest Updates