నిర్ల‌క్ష్యానికి నిండు ప్రాణం బ‌లి

ఆసుప‌త్రిలో ఐసీయూ గ‌ది తాళం చెవి దొర‌క్క‌పోవ‌డంతో స‌కాలంలో చికిత్స అంద‌క ఓ మ‌హిళ క‌న్నుమూసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. గురువారం ఉజ్జ‌యిన్ జిల్లాకు చెందిన‌ మ‌హిళ‌(55)కు అధిక ర‌క్త‌పోటుతోపాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో ఆమెను వెంట‌నే జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిట‌ల్ కి తీసుకెళ్లారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో డాక్ట‌ర్లు మాధ‌వ్ న‌గ‌ర్‌లోని మ‌రో హాస్సిట‌ల్ కి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కానీ ఆ హాస్పిట‌ల్ ప‌రీక్ష‌ల కోసం నిర్దేశించినందున అంబులెన్సులో “ఆర్డీ గార్డీ మెడిక‌ల్ హాస్పిట‌ల్”కి తీసుకెళ్లారు. తీరా అక్క‌డికి వెళ్లేస‌రికి అత్య‌వ‌స‌ర విభాగ‌మైన‌ ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌) గ‌దికి తాళం వేసి ఉంది. స‌రైన సిబ్బంది కూడా అక్క‌డ అందుబాటులో లేరు. మ‌రోవైపు ఆమె ప‌రిస్థితి క్ష‌ణ‌క్ష‌ణానికి మ‌రింత దిగ‌జారుతుండ‌టంతో ఐసీయూ గ‌ది తాళాన్ని ప‌గ‌ల‌గొట్టారు.

కానీ అప్ప‌టికే ఆల‌స్యం కావ‌డంతో డాక్ట‌ర్లు ఆమె ప్రాణాల‌ను కాపాడ‌లేక‌పోయారు. ఈ ఘ‌ట‌న గురించి ఉజ్జ‌యిని జిల్లా వైద్యాధికారి అన‌సూయ గాలి మాట్లాడుతూ.. బాధితురాలు బీపీ, మ‌ధుమేహం వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆసుపత్రికి తీసుకు వ‌చ్చిన వెంట‌నే ముందుగా వైద్యులు ఆమె నుంచి కోవిడ్‌-19 న‌మూనాల‌ను సేక‌రించారు. కానీ ఆ స‌మ‌యంలో ప‌రిస్థితి క్షీణించి మ‌ర‌ణించింది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నాం అని తెలిపారు. అయితే హాస్పిట‌ల్ సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ మృతురాలి బంధువులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స‌కాలంలో ఐసీయూలోకి తీసుకెళ్తే ప్రాణాపాయం త‌ప్పేందంటూ విల‌పించారు.

Latest Updates