3 నిమిషాల్లోనే ముక్కలైన మూడు ముళ్ల బంధం

కువైట్ : మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఓ జంట..మూడు నిమిషాలకే విడిపోయారు. ఈ సంఘటన కువైట్ లో ఇటీవల జరగగా ప్రస్తుతం వైరల్ అయ్యింది. కువైట్‌ లో ఓ జంట జడ్జి ముందే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పెళ్లికూతురు పొరపాటున కింద పడింది.

పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి.. కింద పడినందుకు కోపంగా చూశాడట.  అంతే ఒక్కసారిగా సీరియస్ అయిన వధువు.. జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడగటం.. ఆయన ఇవ్వడం చకచకా జరిగిపోయింది.

మూడు నిమిషాల్లోనే ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కువైట్‌ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఇంతకుముందు దుబాయ్‌ లో ఓ జంట 15 నిమిషాల్లో  విడాకులు తీసుకున్నా.. వీరు 3 నిమిషాల్లోనే విడిపోయారని తెలిపింది. ప్రపంచంలోనే సూపర్ ఫాస్ట్ గా విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 

 

Latest Updates