చెత్తకుప్పలో లబ్దిదారుల ఐడీ కార్డులు : మహిళ వైరల్ వీడియో

హైదరాబాద్ : సరూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో లబ్దిదారుల గుర్తింపు కార్డులు చెత్తబుట్టలో పడేసి ఉన్నాయంటూ ఓ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రం కొరకు మీ సేవలో నమోదు చేసుకొన్నప్పటికీ… అవి సరైన సమయంలో ప్రాసెస్ కావడం లేదన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. నెలల తరబడి కాళ్ళు అరిగేలా తిరిగినా… ధ్రువీకరణ పత్రం నిర్ణీత సమయంలో లబ్ధిదారులు చేరడం లేదన్న ఆరోపణలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి.

ఇంతలోనే… ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర చెత్తకుప్పలో లబ్దిదారుల గుర్తింపు పత్రాలు పడేశారన్న విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి.   మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్న కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్ అప్లికేషన్లు… సరూర్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం వెనకాల చెత్తబుట్టలో పడేశారంటూ వీడియోలో ఆ మహిళ చెప్పింది.

“పేదవారు ఉద్యోగం కోసమో.. ఏదైనా పథకం కోసమో అప్లై చేసుకుంటే ఇలా చెత్తబుట్టలో పడేస్తారా..? ఆఫీస్ లోకి వెళ్లి అడిగితే మాపైనే రివర్స్ లో కోపం చూపిస్తున్నారు. అప్లికేషన్లు లేవంటున్నారు. ఇక్కడేమో చెత్తబుట్టలో పడేశారు. లబ్దిదారులు సంతకం చేసిన అన్ని గుర్తింపుకార్డులు, ప్రభుత్వ స్టాంపులు వేసి ఉన్న ఫైల్స్ ఇక్కడ పడేస్తే.. అవి ఎవరికైనా దొరికితే.. వారు వీటిని మిస్ యూజ్ చేస్తే ఆ లబ్దిదారులకు కలిగే నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి. దీనికి స్థానిక ఎమ్మార్వో, కలెక్టర్, మంత్రి, సీఎం అందరూ సమాధానం చెప్పాలి. ఈ ఇష్యూను నేను అందరి దృష్టికి తీసుకెళ్లదలిచాను” అని ఆమె వీడియోలో చెప్పింది.

అప్లికేషన్లు చెత్తబుట్టలో పడేసిన వ్యవహారంపై కలెక్టర్ కు కంప్లయింట్ చేస్తాననీ… దీనికి కారకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

ఇంతకీ ఆమె ఎవరు… ఎమ్మార్వో ఏమంటున్నారు…

దీనిపై సరూర్ నగర్ తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. చెత్తలో అప్లికేషన్స్ పడేశారన్నది అబద్దమన్నారు. ఎవరైతే వీడియోను వైరల్ చేయాలనుకున్నారో ఆమె పేరు సిమ్రాన్ క్రిస్టోఫర్ అనీ… ఆమె అర్హత లేకున్నా కులం సర్టిఫికెట్ కోసం కావాలనే రాద్ధాంతం చేస్తోందని అన్నారు. సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పిన సిబ్బంది, అధికారులతో గొడవ పడి.. ఉద్యోగం నుంచి తీయించేస్తా అంటూ బెదిరించి ఈ వీడియో క్రియేట్ చేసిందని అన్నారు. చెత్తకుప్పలోనుంచి తీసిన అప్లికేషన్లు.. మీ సేవలో గానీ.. మా ఆఫీస్ లో గానీ.. లేకపోతే.. దరఖాస్తు దారుల నుంచి తీసుకుని ఇలా సీన్ క్రియేట్ చేసిందని చెప్పారు. ఈ వీడియోను క్రియేట్ చేసి… తమ ప్రతిష్టను దిగజార్చిందన్న ఆరోపణతో.. ఆ మహిళ పై సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయబోతున్నట్టు వివరించారు ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి.

 

Latest Updates