ఫోన్ చూసుకుంటూ.. మెట్రో పట్టాలపై పడిన యువతి

స్మార్ట్ ఫోన్.. చాలా మందికి శరీరంలో అదో భాగం! నిద్ర లేచింది మొదలు.. తినేటప్పుడు.. నడిచేటప్పుడు.. పడుకునేప్పుడు పక్కలోనూ అదే. భార్య/భర్త కన్నా ఎక్కువ. ఆఖరికి బాత్ రూంలో ఉన్నా సెల్ ఉండాల్సిందే చాలామందికి!! అంతగా అడిక్ట్ అయిపోయారు యువత. ఆ ఫోన్ కు మొహం అతికించేసి.. ఏం చేస్తున్నామనే సోయి కూడా లేకుండా పోతోంది. కొందరైతే స్మార్ట్ ఫోన్ మాయలో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

అలా ఫోన్లో మునిగిపోయి ఓ యువతి మెట్రో స్టేషన్ లో పట్టాలపై పడిపోయింది. ఆ సమయంలో ఏ ట్రైన్ రాకపోవడంతో ప్రాణాలతో సేఫ్ గా బయటపడింది.

స్పెయిన్ లోని మాడ్రిడ్ సిటీ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. సెట్రెకో స్టేషన్ లో ఓ మహిళ రైలు కోసం ఎదురుచూస్తూ నిల్చునుంది. ట్రైన్ వచ్చే గ్యాప్ లో ఫోన్ కు ముఖం అతికించేసి.. బిజీ అయిపోయింది. స్క్రీన్ చూస్తూ ముందుకు అడుగులేసింది. ప్లాట్ ఫామ్ చివరికి వెళ్లిపోయానని గుర్తించలేక.. ఒక్కసారిగా బోర్లాపడిపోయింది. రెప్పపాటు సమయంలోనే కొద్ది అడుగుల దూరంలో రైలు ఆగింది.

ఏమైనా తేడా జరిగి ఆమె పడిపోయిన ట్రాక్ పై రైలు దూసుకొచ్చి ఉంటే.. ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (సీసీ కెమెరా ఫుటేజీ) ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అదృష్టవంతురాలివంటూ కొందరు, జనాలు ఇంత మూర్ఖంగా ఎలా ఉంటారో అంటూ మరికొందరు ట్విట్టర్లో కామెంట్లు పెట్టారు.

Latest Updates