వైరల్ వీడియో: డాక్టర్లు తలకి ఆపరేషన్ చేస్తుంటే.. వయోలిన్ వాయించిన పేషెంట్

ఓ వైపు డాక్టర్లు బ్రెయిన్‌కి ఆపరేషన్ చేస్తుంటే.. ఆ మహిళ మాత్రం హాయిగా వయోలిన్ వాయిస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తోంది. అదేంటి.. సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ భయంగా బెడ్‌పై పడుకోని ఉంటారు కానీ, ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? చిన్ననాటి నుంచి ఆమె ఎంతో ఇష్టంతో నేర్చుకున్న సంగీతం మర్చిపోకూడదన్న తన కోరిక డాక్టర్లకు చెప్పడంతో ఇలా వినూత్నంగా ప్రయత్నించారు డాక్టర్లు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ సర్జరీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

53 ఏళ్ల డాగ్మర్ టర్నర్.. లండన్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పని చేసేది. అయితే ఆమెకు కొన్నాళ్ల క్రితం బ్రెయిన్‌లో ట్యూమర్ పెరిగింది. దీంతో ఆమెను తీవ్రమైన తలనొప్పి వేధించేది. మామూలు తలనొప్పేనని అనుకున్న డాగ్మర్ హాస్పిటల్‌కు వెళ్లడంలో ఆలస్యం చేసింది. తీరా ఆ బాధ తట్టుకోలేనంత స్థాయిలో ప్రతి రోజూ రావడంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుంది. తలలో ట్యూమర్ పెరిగినట్లు గుర్తించారు లండన్‌లోని కింగ్స్ హాస్పిటల్ డాక్టర్లు. అది అలానే పెరిగితే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. దానిని సర్జరీ చేసి తీసేయొచ్చని, అయితే ఆపరేషన్ చేసే సమయంలో నరాలపై ఎఫెక్ట్ పడి ఎడమ చేయి పని చేయకుండా పోయే చాన్స్ ఉందని డాగ్మర్‌కు తెలిపారు.

పదేళ్ల వయసులో ఎంతో ఇష్టంగా నేర్చుకున్నా

డాక్టర్లు చెప్పిన విషయం విని డాగ్మర్ చెప్పలేని బాధలో కుంగిపోయింది. తాను పదేళ్ల వయసులో ఎంతో ఇష్టంగా వయోలిన్ నేర్చుకున్నానని, ఈ సర్జరీ తర్వాత ఇక జీవితంలో దాన్ని ప్లే చేయలేనని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణంగా నేర్చున్న సంగీతాన్ని వదులుకోవాల్సిరావడాన్ని తట్టుకోలేకపోతున్నాని డాక్టర్ల దగ్గర భావోద్వేగానికి లోనైంది. దీంతో వైద్యులు ఆలోచించి.. ఓ వినూత్న ప్రయోగం చేశారు. బ్రెయిన్ ట్యూమర్‌కి ఆపరేషన్ చేసేటప్పుడు ఆమెను వయోలిన్ ప్లే చేయాలని చెప్పారు. దీని ద్వారా చేతి నరాల కదలిక అలాగే ఉండడంతో పాటు.. వయోలిన్ వాయించడానికి సంబంధించిన మెమోరీ పోకుండా సర్జరీ పూర్తి చేశారు. ఏ మాత్రం ప్రాబ్లమ్ లేకుండా ఆపరేషన్ విజయవంతం కావడంతో డాగ్మర్ వారికి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. డాక్టర్ల ఐడియా సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates