లాయర్ కుటుంబంలోనే వరకట్న వేధింపులు.. ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మహిళ ధర్నా

రంగారెడ్డి జిల్లా:- వరకట్న వేధింపుల కార‌ణంగా ఇంటిముందు ధర్నాకు దిగారు ఓ మ‌హిళ . త‌న‌పై వేధింపుల‌కు పాల్పడుతున్న అత్త,మామ మరియు బావ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక హిల్స్ లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ కు చెందిన సంధ్య కు, మీర్ పేట కు చెందిన క్రాంతి కుమార్ తో 3 సంవత్సరాల క్రితం పెళ్లి జ‌రిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్న క్రాంతి కుమార్ కు పెళ్లి సమయంలో అత్తింటి వారు కట్నం కింద 10 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, ఇంటిలోకి సరిపడా ఫర్నిచర్ ఇచ్చారు. అయితే మరో 20 లక్షల రూపాయ‌ల‌ అదనపు కట్నం తీసుకురావాలని త‌న అత్త,మామల‌తో పాటు బావ, మరిది కూడా వేధిస్తున్నారని బాధితురాలు సంధ్య‌ వాపోయారు.

ఉన్నత విద్య చదివి లాయర్ గా పనిచేస్తున్న త‌న‌ బావ అయిన వినోద్ కుమార్ కూడా వరకట్న వేధింపులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయని సొంతూరుకు వెళ్లిన సమయంలో త‌న భ‌ర్త విడాకులు నోటీసులు పంపి నాలుగు నెలలుగా కనిపించకుండా తిరుగుతున్నాడ‌ని, కావాలనే ఇంటిలోకి రానివ్వకుండా చేస్తున్నాడ‌ని ఆమె అన్నారు. త‌నను ఇంట్లోకి రానివ్వ‌కుంటే న్యాయం జరిగేంత వరకు ఇంటి ముందే దీక్షకు దిగుతానని బాధితురాలు తెలిపారు.

Latest Updates