ప్రేమకు ఒప్పుకోలేదని.. యువతి తల్లిపై ఆర్మీ జవాన్ కాల్పులు

యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడో ఆర్మీ జవాన్. పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కానీ ఆమె తల్లి దానికి ఒప్పుకోలేదు. తనని కాదనడంపై కోపంతో రగిలిపోయాడు. ఆమెను చంపేస్తే అడ్డుతొలగిపోతుందని., తుపాకీ పట్టుకొచ్చి ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

గుంటూరు జిల్లాలో చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ బాలాజీ అనే ఆర్మీ జవాన్ కొన్నాళ్లుగా వెంటబడుతున్నాడు. ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. అయితే అతడు వ్యక్తిత్వం మంచిది కాదంటూ నిరాకరించింది రమాదేవి.

ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ శనివారం ఉదయం ఓ ఆటోలో ఆమె ఇంటికి వచ్చి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. అతడి తీరు తేడాగా ఉందని పసిగట్టిన రమాదేవి.. కాల్పుల జరిపే సమయంలో వేగంగా పక్కకు తప్పుకోవడంతో ప్రాణాలను కాపాడుకోగలిగింది. చెవికి బుల్లెట్ గాయమవడంతో అక్కడి నుంచి పరిగెత్తింది. బాలాజీని గమనించి చుట్టుపక్కల జనం అక్కడికి రావడంతో అతడు పరారయ్యాడు. ఆ కంగారులో తుపాకీ అక్కడే వదిలేశాడు.

ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీని అక్కడికి తీసుకుని  వచ్చిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక టీమ్సగా ఏర్పడి అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అతడికి నాటు తుపాకీ ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. బాలాజీ ప్రవర్తన బాగోలేదని కొన్నాళ్ల క్రితం ఆర్మీ నుంచి సస్పెండ్ చేశారని తెలుస్తోంది.

Latest Updates