భర్తను వదిలి ప్రియుడితో కూతురు పరార్.. ఇద్దరిని నరికిచంపిన తండ్రి

జైపూర్: రాజస్థాన్ లో దారుణం జరిగింది. తన కూతురు భర్తను విడిచిపెట్టి ప్రియుడితో పారిపోవడంతో కోపం పెంచుకున్న తండ్రి ప్రియుడికి చెందిన కుటుంబ సభ్యుడిని, అతని ఫ్రెండ్ ని నరికి చంపేశాడు. జంఝూను జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు అనిల్ జాట్(40)ను పోలీసులు అరెస్టు చేసి కేసు వివరాలు గురువారం మీడియాకు వెల్లడించారు.

‘‘హర్యానాలోని మహేంద్రగఢ్ కు చెందిన అనిల్ కూతురు సుమన్ బుహానాకు కొద్దిరోజుల కిందట రాజస్థాన్ లోని జంఝూను జిల్లాకు చెందిన నరేంద్రజాట్​తో పెళ్లయింది. ఈ నెల 2 న సుమన్ తన భర్తను వదిలి అదే ప్రాంతానికి చెందిన ప్రియుడు కృష్ణతో కలిసి పారిపోయింది. దీంతో కక్ష పెంచుకున్న సుమన్ తండ్రి అనిల్.. తన కూతురు తిరిగి ఇంటికి రాకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని కృష్ణ ఫ్యామిలీని హెచ్చరించాడు. వారం దాటినా తన కూతురు జాడ లేకపోయేసరికి తన నివాసం నుంచి రాజస్థాన్ కు వెళ్లిన అనిల్.. కృష్ణ సోదరుడు దీపక్(20), అతని ఫ్రెండ్ నరేష్​(19)లు బంగ్లాపై నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి చంపేశాడు”అని పోలీసులు తెలిపారు.

తన పరువు తీసిన కూతురితో పాటు ఆమెను తీసుకుని వెళ్లిన వ్యక్తిని జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంపేస్తానని కూడా హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. అనిల్‌కు ఇప్పటికే క్రిమినల్ రికార్డ్ ఉందని, రాజస్థాన్, హర్యానాల్లో అతనిపై మోసం, అల్లర్లు, అక్రమ ఆయుధాలకు సంబంధించిన ఐదు కేసులు ఉన్నాయని చెప్పారు.

Latest Updates