పెద్దలు ఒప్పుకోరని..విషం తాగారు

పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరనే కారణంతో ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్​ లోని  శ్రీనివాస్​కాలనీకి చెందిన తీలపల్లి జనేశ్వర్​ కుమార్తె స్వర్ణలత(21) బీటెక్​ పూర్తి చేసింది. నల్గొండ జిల్లా నారాయణపురం మండలం చిల్లాపూర్​ గ్రామం  కొర్రతండా ప్రాంతానికి చెందిన లచ్చిరాం నాయక్​ కుమారుడు కొర్ర మోహన్​నాయక్​(25)సిటీలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. స్వర్ణలత, లచ్చిరాం నాయక్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేదు. ఇద్దరి కులాలు వేరుకావడంతో ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోరనే నిర్ణయానికి వచ్చిన స్వర్ణలత, లచ్చిరాం నాయక్ ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యారు.

ఈ నెల 8న ఇద్దరూ కలిసి చందానగర్ లోని వీవీ ప్రైడ్ లాడ్జ్ లో ఓ రూమ్ తీసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న విషంను   స్వర్ణలత, లచ్చిరాం నాయక్ కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు స్వర్ణలత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజు కుటుంబసభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం స్వర్ణలత ఫోన్ ను ట్రేస్ చేయగా..చందానగర్ పీఎస్ పరిధిలోని వీవీ ప్రైడ్ లాడ్జ్ లో ఉన్నట్టు చూపెట్టింది. ఎల్బీనగర్ ఇన్ స్పెక్టర్ చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఎస్సై భాస్కర్ తన సిబ్బందితో లాడ్జ్ కు చేరుకుని స్వర్ణలత, లచ్చిరాం ఉన్న రూమ్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు.  అక్కడ వారిద్దరు చనిపోయి ఉన్నట్టు ఎస్సై భాస్కర్ తెలిపారు. స్వర్ణలత బంధువు ఇచ్చిన కంప్లయింట్ మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని..ఇద్దరి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించినట్టు ఆయన చెప్పారు.

శామీర్ పేట, వెలుగు: వెహికల్ ఫైనాన్స్ కట్టలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బొమ్మరాసిపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) ఏడాది క్రితం చోళమండలం ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బు తీసుకుని ఓ డీసీఎం కొన్నాడు. కొంతకాలం పాటు చంద్రశేఖర్ డీసీఎంను నడిపించాడు. చంద్రశేఖర్ కొన్ని నెలలుగా డీసీఎంకు ఫైనాన్స్ కట్టడం ఆపేశాడు. ఫైనాన్స్ కంపెనీ వారు డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఈ నెల 7న చంద్రశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని సిటీలోని యశోద హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చంద్రశేఖర్ సోమవారం చనిపోయాడు. అతడి భార్య వినోద కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నవీన్ తెలిపారు.

పటాన్ చెరులో..
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక  వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్ చెరు పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పుల్కల్ మండలంలోని లక్ష్మిసాగర్ గ్రామానికి చెందిన ఎల్లంపల్లి పోచయ్య(28) కొంతకాలంగా భార్యాపిల్లలతో కలిసి రుద్రారం గ్రామంలో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన పోచయ్య ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. అతడి భార్య ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates