వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘటన : నెల రోజుల్లోనే మహిళకు రెండు కాన్పులు

శిశువు పుట్టిన తర్వాత కనీసం సంవత్సరమైన తేడాతో మరోసారి గర్భం దాల్చడం కామన్. కానీ..ఒక నెల గ్యాప్ లోనే ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది ఓ మహిళ. వైద్యశాస్త్రంలోనే అద్భుతమైన ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. బంగ్లాదేశ్‌ లోని జెస్సోర్‌ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీ(20) ఫిబ్రవరి 25న నెలలు నిండని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు రావడంతో హస్పిటల్ కి  తరలించగా.. నార్మల్ డెలివరీ అయ్యింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉండటంతో డాక్లర్లు వారిని ఇంటికి పంపించారు. అయితే ఇటీవల మార్చి 22న అరిఫాకు మరోసారి నొప్పులు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే హస్పిటల్ కి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి.. ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేశారు. అంటే సరిగ్గా 26 రోజుల తర్వాత అరిఫా మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

అరిఫాకు రెండు గర్భాశయాలు ఉన్నాయి. ఫస్ట్ డెలివరీ  సమయంలో ఈ విషయాన్ని డాక్టర్లు గుర్తించకపోవడంతో.. ఆమెకు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు డెలివరీ అయ్యింది. ‘మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం అత్యంత అరుదు. అరిఫాకు మొదట ఒక గర్భాశయం ద్వారా మగబిడ్డ జన్మించాడు. రెండోసారి మరో గర్భాశయం ద్వారా కవలలు పుట్టారు. బహుశా ఇలా జరగడం ఇదే తొలిసారి అయి ఉంటుంది’ అని అరిఫాకు సర్జరీ చేసిన డాక్టర్ షీలా తెలిపారు. ప్రస్తుతం అరిఫా, ఆమె ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.

source

Latest Updates