వాళ్లకు బెస్ట్ ఆప్షన్..వర్క్ ఫ్రమ్ హోమ్

ఒకప్పటిలా వంటింటికే పరిమితం అవ్వాలని… ఇప్పుడు ఏ మహిళా అనుకోవట్లేదు. పెద్దపెద్ద చదువులు చదవాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి! ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడొద్దు! వంటి ఆశయాలతో ముందుకు వెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. అందుకే చదువుకుని ఉద్యోగం సంపాదించాకే పెళ్లి చేసుకుంటున్నారు. అయినా పిల్లల విషయంలో మాత్రం…. పెళ్లైన మహిళలకు కొన్ని అడ్డంకులు తప్పట్లేదు. డెలివరీ, పిల్లల పెంపకం వంటి బాధ్యతల వల్ల చాలామంది మహిళలు… ఎంతో ప్యాషన్​గా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. దాంతో వాళ్ల మనసుల్లో అసంతృప్తి మిగిలిపోతోంది. అలాంటి వాళ్లకు బెస్ట్​ ఆప్షన్​… ‘వర్క్​ ఫ్రమ్​ హోమ్​’. ఈ మూడు పదాల మాట… ప్రస్తుతం ఉద్యోగం చేయాలనుకుంటున్న ఎంతోమంది తల్లులకు గొప్ప అవకాశం.

‘వర్క్​ ఫ్రమ్​ హోమ్​’ అంటే… ఇంట్లో ఉంటూ తమకు నచ్చిన పని చేస్తూ ఆర్థికంగా ఎదగడం. 21వ శతాబ్దంలో ఈ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చాలామందికి చేరువయ్యింది. అయితే ఆఫీసుకి వెళ్లకుండా ఇల్లు, పిల్లల్ని చూసుకుంటూ… ఉద్యోగం చేయడం ఎంత గొప్ప విషయమో, అంత కష్టం కూడా. అలా గంపెడు బాధ్యతలను మోస్తున్న మహిళలను ‘సూపర్​ విమెన్​’గా పిలుస్తోంది సమాజం. ఎందుకంటే, ఈ విధంగా రాణించాలంటే వాళ్లకు ఎంతో పట్టుదల, ఆత్మ విశ్వాసం ఉండాలి. మీరూ ‘వర్క్​ ఫ్రమ్​ హోమ్​’ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.

కొంచెం కష్టమే.. కానీ!

ఆఫీసులో ఉన్నట్టు ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా… కదలకుండా కూర్చొని పని చేయడం సాధ్యమయ్యే పని కాదు. అలాంటి వాతావరణం ఏర్పరచుకోవడానికి… చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని ఉంటాయి. అలాగే ఉన్న బలాలను పెంచుకుంటూ… బలహీనతలను తగ్గించుకుంటూ పోవాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరు.

చేయాల్సినవి...

 •  చేసే పనిలో నిమగ్నమైనప్పుడు, డెడ్​లైన్​ దగ్గర పడుతున్నప్పుడు…. పిల్లలను చూసుకునే బాధ్యతను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు అప్పగించాలి.
 • పిల్లలు నిద్ర పోయినప్పుడు, స్కూల్​కి వెళ్లినప్పుడు… ఆ సమయాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలి.
 •  కంప్యూటర్​ ముందు కూర్చుని పని చేస్తున్నప్పుడు… మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. అటూఇటూ నడవడం, కొద్దిగా బయటికి వెళ్లి రావడం చేయాలి.
 • చేయకూడనివి…
 •  ల్యాప్​టాప్​, పుస్తకాలు, ఫైళ్ల​ను పిల్లలకు అందుబాటులో పెట్టకూడదు.
 •  పనిలో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడటం, సోషల్​ మీడియాలో చాటింగ్​ వంటివి చేయొద్దు. దానివల్ల తెలియకుండానే విలువైన సమయం వృథా అవుతుంది.
 •  ఇంట్లో పని ఏదైనా ఉంటే, అది పూర్తి కాకుండా కంప్యూటర్​ ముందు కూర్చోవద్దు. అలా చేస్తే మధ్యలో ఆ పనిలోకి వెళ్లాల్సి రావచ్చు.
 • పెంచుకోవాల్సిన బలాలు…
 •  పని వేళలను నచ్చినట్టుగా సెట్​ చేసుకోవాలి. అప్పుడే  సంతోషంగా పని చేయగలరు.
 •  పిల్లల జీవితంలో ప్రతి అంశాన్ని మిస్​ కాకుండా చూసుకోవాలి. వాళ్లతోనూ సమయాన్ని గడపాలి.
 •  పనితో పాటు నచ్చిన వ్యాపకాలకూ సమయాన్ని కేటాయించాలి.
 •  వీలున్న ప్రతిసారీ కుటుంబంతో బయటికి వెళ్లేలా ప్లాన్​ చేసుకోవాలి.

బలహీనతలకు దూరంగా…

 •  చాలామంది డెడ్​లైన్​ దగ్గర పడుతున్న కొద్దీ ఒత్తిడికి లోనవుతుంటారు. దాన్ని కచ్చితంగా అధిగమించేందుకు ప్రయత్నించాలి.
 •  వర్క్​ షెడ్యూల్​ని సరిగా ప్లాన్​ చేసుకోలేక ఇబ్బంది పడతారు.
 •  పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు… తమ కుటుంబ సభ్యుల సాయాన్ని అడగలేరు. కానీ కచ్చితంగా వాళ్ల సాయం తీసుకుంటేనే మంచిది.
 • ఇంకొందరు పనిలో ఉన్నప్పుడు… ఇతర విషయాల్లో చొరవ తీసుకోవడం, సమయం వృథా చేయడం లాంటివి చేస్తుంటారు. అలా కాకుండా నిబద్ధతగా పని చేస్తే, తర్వాత వచ్చే డెడ్​లైన్​ టెన్షన్​ ఉండదు.

‘వర్క్​ ఫ్రమ్​ హోమ్​’ ఎందులో ఉంటుంది?

 •   ఫ్రీలాన్స్​ రైటింగ్​, ఎడిటింగ్​
 •   ఆన్​లైన్​ ట్యూటర్​​ (ఎడ్యుకేషన్, ఫిట్​నెస్​…)
 •   మెడికల్​ ట్రాన్స్​క్రిప్షన్​
 •   క్యాటరింగ్​, బేకింగ్​
 •   ఇంట్లో ట్యుటోరియల్స్​ పెట్టడం
 •   న్యూట్రిషనిస్ట్​
 •   డ్యాన్స్​, మ్యూజిక్ మొదలైన కళల్ని నేర్పించడం
 • సాఫ్ట్​ స్కిల్స్​లో ట్రైనింగ్​
 •   కమర్షియల్​ బిజినెస్​
 •   రియల్​ ఎస్టేట్​, ఇన్స్యూరెన్స్​ ఏజెన్సీలు నడపడం

ఈ సూచనలు  పాటించాలి

 •  మర్నాడు చేయాల్సిన పనిని… ముందు రోజు రాత్రే ప్లాన్​ చేసుకోవాలి. పిల్లల దగ్గరి నుంచి ఇంటి పని వరకు, అన్నింటికీ టైమ్​ ప్లానింగ్​ ఉండాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలో రాసి పెట్టుకోవాలి. అలా అన్నీ ప్లాన్​ ప్రకారం చేస్తేనే అనుకున్నది సాధిస్తారు.
 •  ఇంట్లో ఉండే మహిళలకు ఒక బలహీనత ఉంటుంది. అన్ని పనులూ తామే చేయాలనుకుంటారు. ఎందులోనూ పక్కవాళ్ల సాయం తీసుకోవాలనుకోరు. అది చాలా తప్పు. ఒంట్లో అలసటగా ఉన్నప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు పిల్లలకు తినిపించడం, స్కూల్​కి రెడీ చేయడం, వంట చేయడం వంటి పనుల్లో కుటుంబ సభ్యులను భాగం చేయాలి.
 •  పని వేళలను ప్లాన్​ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యలో ఎలాంటి ఇబ్బంది రాని సమయాన్నే పని కోసం కేటాయించాలి. ఎవరూ నిద్ర లేవక ముందు… అంటే తెల్లవారుజామున లేదా రాత్రుళ్లు అందరూ పడుకున్నాక పని చేసుకునేలా ప్లాన్​ చేసుకుంటే ఎలాంటి ఆటంకాలు ఉండవు.
 •  ఇంట్లో పసి పిల్లలు ఉన్నప్పుడు… వాళ్లను పక్కనే కూర్చోబెట్టుకుని పని చేసుకోవచ్చు. పిల్లలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే…  బొమ్మలు, స్నాక్స్​, పుస్తకాలు మొదలైనవి వాళ్ల చేతికి ఇవ్వాలి. అప్పుడు పిల్లలు  ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అన్న టెన్షన్​ ఉండదు. పిల్లలకూ అమ్మ పక్కనే ఉన్నామన్న ధైర్యం, సంతోషం ఉంటాయి.
 •  అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే…  ఇలా అన్ని పనులూ ఒకేసారి చేస్తున్నప్పుడు ఒక్కోసారి విజయం రాకపోవచ్చు. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. అలాంటప్పుడు కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించాలి. ‘ఏది జరిగినా…అంతా మంచికే’ అనే సానుకూల దృక్పథంతో ఉండాలి.

Latest Updates