అర్ధరాత్రి.. ఆమె.. పెట్రోలింగ్

  • ​-పంజాగుట్టలో స్టార్టైన విమెన్ బ్లూకోల్ట్స్
  • -షీ టీమ్స్ తరహాలో నిఘా
  • -నిమజ్జనం ముగిసే వరకు రాత్రిళ్లు గస్తీ
  • ఈవ్ టీజర్లు, స్నాచర్సే టార్గెట్

హైదరాబాద్ సిటీలో పంజాగుట్ట పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. విమెన్ కానిస్టేబుల్స్ తో నైట్ పెట్రోలింగ్ కి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా గణేశ్ నవరాత్రుల కోసం విమెన్ బ్లూకోల్ట్స్ ను శుక్రవారం ప్రయోగాత్మకంగా  ప్రారంభించారు. పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

వినూత్న కార్యక్రమం

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విమెన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్యామల(30) రెజ్లింగ్ లో మూడు పతకాలు గెలుచుకుంది. స్పోర్ట్స్ లో మంచి ప్రతిభను కనబరిచింది. అలాగే శ్యామలకు బైక్ రైడింగ్ ఎంతో ఇష్టం. ఎలాంటి బైక్ నైనా సరే ఈజీగా డ్రైవ్ చేయగల శక్తి ఆమె  సొంతం. పీఎస్​లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎంతో స్పోర్టివ్ గా పనిచేసేది. పంజాగుట్ట పీఎస్​ పరిధిలో నిర్వహిస్తున్న స్ట్రీట్ సైకిల్ పెట్రోలింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచేది. బస్తీల్లో గస్తీ తిరుగుతూ బాధిత యువతులకు అందుబాటులో ఉండేది. ఇలా విమెన్ పెట్రోలింగ్ లో మంచి నైపుణ్యం కలిగిన శ్యామలతో ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

బుల్లెట్ బైక్ తో స్పెషల్

శ్యామల కొనుగోలు చేసిన బుల్లెట్ బైక్ తో పెట్రోలింగ్ కు ప్లాన్ చేశారు. శ్యామలతో పాటు మరో విమెన్ కానిస్టేబుల్ హేమలత(25)తో కలిసి నైట్ పెట్రోలింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గణేష్ నవరాత్రులు, నిమజ్జనం పూర్తయ్యే వరకు షీ టీమ్ తరహాలో స్పెషల్ విమెన్ బ్లూకోల్ట్స్ పెట్రోలింగ్ కి ఏర్పాట్లు చేశారు. పంజాగుట్ట పీఎస్​ పరిధిలోని బస్తీలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, గణపతి మండపాలు, మార్కెట్ల వద్ద శ్యామల టీమ్ నిఘా పెడుతుంది. ఎవరైనా పోకిరీలు యువతులను వేధించినట్లు కనిపిస్తే నివారించడంతో పాటు ప్యాట్రో కార్ కి సమాచారం అందిస్తుంది. ఈవ్ టీజర్లు, స్నాచర్ల మూవ్ మెంట్స్ పై శ్యామల టీమ్ ఫోకస్ పెడుతుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి..

శ్యామల బుల్లెట్ డ్రైవ్ చేస్తుండగా హేమలత పిలియన్ రైడర్ గా ఉంటుంది. తమతో పాటు క్యారీ చేసే వైర్ లెస్ మ్యాన్ ప్యాక్, కెమెరాతో ఆకతాయిల ఆట కట్టిస్తుంది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో డ్యూటీకి హాజరై రాత్రి 2.30 గంటల వరకు నైట్ పెట్రోల్ చేసేలా ప్లాన్ చేశారు. ప్రధానంగా పంజాగుట్టలోని షాపింగ్ కాంప్లెక్స్ ల వద్ద నిఘా పెట్టి యువతులు, మహిళలకు అందుబాటులో ఉంటారు. ఎవరినైనా వేధింపులకు గురైతే చర్యలు తీసుకుంటారు. గణేశ్ నవరాత్రులను ప్రామాణికంగా తీసుకుని ప్రారంభించిన స్పెషల్ విమెన్ బ్లూకోల్ట్స్ ను రానును రోజుల్లో మరింత పటిష్ఠం చేస్తామని ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Latest Updates