రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద  ఉద్రిక్తత

హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్లను పెంచడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. గాంధీభవన్ మెట్రోస్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య, మధ్యతరగతి వారిపై పెనుభారం మోపుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ గ్యాస్ రేట్లను గిఫ్ట్ గా ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. 

బీజేపీ మహిళా మోర్చా నేతల ఆందోళన
ఇటు కాంగ్రెస్ మహిళా నేతల నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, సోనియాగాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రెండు పార్టీల నాయకుల నినాదాలతో గాంధీభవన్ మెట్రో స్టేషన్ ప్రాంతం హోరెత్తింది. ఆందోళనలు చేస్తున్న మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. 

మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను రూ.50కి పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కి చేరింది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది.