టీఆర్‌ఎస్‌ మా భూమి గుంజుకుంది

  • మహబూబాబాద్ లో భూమిపూజను అడ్డుకున్న మహిళలు
  • కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం
  • అరెస్టు చేసి ఠాణాకు తరలించిన పోలీసులు

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మా భూమిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లాక్కొని అక్రమంగా బిల్డింగ్‌ కట్టాలనుకుంటోందని మహబూబాబాద్‌లో కొదరు మహిళలు భూమిపూజను అడ్డుకున్నారు. తమకు పట్టాలున్నాయని కొన్నేళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని అందులో ఓ మహిళ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమెను అడ్డుకొని… మహిళలందరిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరించారు. కలెక్టరేట్ రోడ్‌లోని ఎర్రబోడ్ వద్ద 551సర్వేనెంబరులో ఎకరం భూమిని టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు కోసం ప్రభుత్వం కేటాయించింది. సోమవారం పార్టీ నాయకులు భూమిపూజకు ఉపక్రమించగా చేపూరి ఎల్లయ్య, లింగయ్య కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి, సునీత, సరిత, అలివేలు, ఉమా, స్వాతి, యాదగిరి, వీరస్వామి వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సునీత వెంట తీసుకొచ్చిన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

పోలీసులు ఆమెను, మిగతా వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో అస్వస్థతకు గురైన సునీతను, వెంకటలక్ష్మిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం  జడ్పీ ఛైర్‌పర్సన్ బిందు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు శంకర్​నాయక్​, రెడ్యానాయక్ పోలీస్ బందోబస్తు మధ్య పార్టీ కార్యాలయం కోసం భూమి పూజ నిర్వహించారు.

మా పట్టాలు.. పుట్నాల పాకెట్‌ కట్టనికి కూడా పనికిరావంటా

నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మా భూమి వద్దకు వచ్చి పరిశీలిస్తుండగా అనుమానం వచ్చి మేం అక్కడికి వేళ్లాం. ఎవరూ మీరని ఎమ్మెల్యే అడిగాడు. ఈ భూమి మాదని, మా తండ్రిగారిదని పట్టాలు ఉన్నాయని చెప్పాం. 1978లో ఇచ్చిన పట్టాలు, ప్రస్తుతం ఉన్న పహాణీలు, 1బీ కూడా ఇస్తే.. ఈ పట్టాలు పుట్నాల పాకెట్‌ కట్టనికీ కూడా పనికి రావని హేళన చేశారన్నాడు. అవసరమైతే మీకు డబుల్​బెడ్ రూమ్‌ ఇండ్లు రెండు ఇస్తామని చెప్పాడు. మేం వాటికి ఒప్పుకోలేదు. దీంతో  అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి రాత్రే చదును చేసి, భూమి పూజ చేసేందుకు పోలీసుల బందోబస్తుతో వచ్చారన్నారు. – వెంకటలక్ష్మి, బాధిత మహిళ

భూపాలపల్లిలో పూజకు అంతరాయం

తన స్థలమంటూ అడ్డుకున్న గండ్ర సత్యనారాయణరెడ్డి

భూపాలపల్లి అర్బన్, వెలుగు: అధికార పార్టీ బిల్డింగ్‌ భూమిపూజకు జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంతరాయం కలిగింది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం పట్టణంలోని కొంపల్లి శివారు సర్వే నంబర్ 170/1లో ఎకరం స్థలంలో బిల్డింగ్‌కు భూమిపూజకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ స్థలం తనదంటూ స్థానిక ఎమ్మెల్యే గుండ్ర వెంకటరమణారెడ్డి సోదరుడు, ఘణపురం మండలం చెల్పూరుకు చెందిన గండ్ర సత్యనారాయణరెడ్డి పూజ నిర్వహించకుండా లారీలను నిలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి లారీలు తొలగించే ప్రయత్నం చేయగా సత్యనారాయణరెడ్డి వారిని అడ్డుకొన్నారు. ఇతరుల నుంచి తాను ఇక్కడ ఎకరన్నర భూమిని కొన్నానని చెప్పడంతో ఆఫీసర్లు పక్కనున్న స్థలంలో భూమి పూజకు ఏర్పాట్లు చేశారు. అది కూడా తన స్థలమేనని సత్యనారాయణరెడ్డి అన్నప్పటికీ… చివరకు పార్టీ కోసం అనుమతి ఇవ్వడంతో ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌ నాయకులు భూమి పూజ తంతును ముగించారు. ఇలా మూడు గంటల పాటు భూమిపూజకు అంతరాయం ఏర్పడింది.

నోటీసులు కూడా ఇవ్వకుండా లాక్కున్నరు

అధికార పార్టీ నాయకులు దళితులమైన మా భూమిని ఆక్రమిం చుకొని పార్టీ ఆఫీసు నిర్మిస్తున్నారు. మాకు పట్టా లు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు కనీసం సమాచారం, నోటీసులు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ పార్టీకి అప్పగించా రు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి.- చేపూరి సునీత, బాధితురాలు

పట్టాలున్నట్లు మా దృష్టికి రాలేదు

టీఆర్‌ఎస్ పార్టీకి కేటాయించిన భూమి సాగులో లేదు. పట్టాలిచ్చిన మూడెళ్లలోపు సాగు చేయాలి. కానీ అక్కడ సాగు చేయడం లేదు. అక్కడ రైతులకు పట్టాలు ఉన్న విషయం మా దృష్టికి రాలేదు. తహసీల్దార్‌ను కలిసి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – కొంరయ్య, ఆర్డీవో, మహబూబాబాద్​

మార్కెట్ యార్డ్ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం

గద్వాల, వెలుగు: అధికార పార్టీ కార్యాలయానికి విలువైన మార్కెట్ యార్డ్ భూమి ఇవ్వడం చట్టవిరుద్ధమని జోగులాంబ గద్వల జిల్లా బీజేపీ నాయకుడు  సంజీవ్ భరద్వాజ్ అన్నారు. సోమవారం ధరూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ మార్కెట్‌యార్డు కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించిందన్నారు. నిబంధనల ప్రకారం ఆ భూమిని మార్కెట్​ యార్డు కోసమే ఉపయోగించుకోవాలి అయితే అధికార పార్టీ తన సొంత ఆఫీస్‌ కోసం వాడుకోవడం చట్టవిరుద్దమన్నారు. మార్కెట్ యార్డు ఆ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతే ఆ స్థలం తిరిగి పూర్వ యజమానులకే చెందుతుందన్నారు. అక్కడ ఎకరా భూమి రిజిస్ట్రేషన్ ఖర్చే రూ. 6 లక్షలు అవుతుంది అలాంటిది గజం వంద రూపాయలకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

 

Latest Updates