ఆర్మీలో కమాండ్‌ పోస్టులకు మహిళలు అర్హులే

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. మహిళల శారీరక లక్షణాలకు, వారి సామర్థ్యానికి ఎటువంటి సంబంధం లేదని… ఆర్మీ కమాండ్ పోస్టులకు వారు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల సామర్థ్యాలపై ఎటువంటి అనుమానాలైనా ఉంటే మీ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని సూచించింది.

మహిళలకు పర్మినెంట్‌ గ్రాంట్‌ కమిషన్‌ హోదా కల్పించడంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కమాండ్‌ పోస్టుకు మహిళా అధికారులను నిరాకరించడం అంటే రాజ్యాంగం వారికి కల్పిస్తున్న సమాన హక్కులకు వ్యతిరేకమని తెలిపింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనల కారణంగా మహిళలకు అవకాశం కల్పించడం లేదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

Latest Updates