శబరిమల గుళ్లోకి మహిళల్ని పోనీయలె

శబరిమల:అయ్యప్ప దర్శనానికి వచ్చిన పదిమంది మహిళలను  కేరళ పోలీసులు అడ్డుకున్నారు. ఇరుముడి లేకుండా కొండ ఎక్కుతున్న వారిని పంబ బేస్‌ క్యాంప్ వద్ద ఆపేశారు. ఐడీ కార్డులు చెక్‌ చేసి, వారంతా పది నుంచి యాభై ఏళ్ల వయసులోపు వారేనని నిర్ధారించారు. దీంతో వారిని పైకి వెళ్లకుండా ఆపేశారు. వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని అధికారులు చెప్పారు. ఇరుముడి లేకుండా రావడంతోనే అడ్డుకున్నామని అన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ మహిళలు కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకుండా వెనుదిరిగారు. అంతకుముందు, శనివారం సాయంత్రం శబరిమల గుడి తలుపులు తెరిచారు. శరణుఘోష మధ్య ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహేశ్‌‌‌‌ మోహనరారు ప్రత్యేక పూజలు చేశారు. మండల పూజ సందర్భంగా 41 రోజులు ఆలయంలో పూజలు చేసి డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 27న మూసేస్తారు. ఆ తర్వాత మకర విళక్కు పండుగ కోసం డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 30న తిరిగి తెరుస్తారు. జనవరి 15న విళక్కు పండుగను నిర్వహిస్తారు. భక్తులను మాత్రం ఆదివారం నుంచి దర్శనానికి అనుమతిస్తారని అధికారులు చెప్పారు. గతేడాది జరిగిన ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. శబరిమల ఆలయ పరిసర ప్రాంతాల్లో 10 వేల మందితో సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. పోయిన ఏడాదిలా ప్రొహిబిషన్​ ఆర్డర్స్​జారీ చేయాల్సిన అవసరంకలగలేదని అధికారులు చెప్పారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కేరళ నలుమూలలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని వివరించారు. భక్తులు ఇబ్బంది పడకుండా దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది. నీలక్కళ్, పంబ, సన్నిధానం ఏరియాల్లో మెడికల్, వాటర్, టాయిలెట్​ సదుపాయాలతోపాటు 5 ఎమర్జెన్సీ మెడికల్​ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన పదిమంది మహిళలను పోలీసులు తిప్పి పంపారు. భక్తుల కోసం కేరళ స్టేట్​ రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్(కేఎస్ఆర్టీసీ) స్పెషల్​ సర్వీసులను నడుపుతోంది. పంబ నుంచి నీలక్కళ్​కు 150  బస్సులను తిప్పుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పెషల్‌‌‌‌ సర్వీసులను నడుపుతున్నట్లు కేఎస్‌‌‌‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఎవరైనా ఆందోళనలు చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం బోర్డు పేర్కొంది. గతేడాది భక్తుల ఆందోళనలతో కొచ్చి ఎయిర్​పోర్ట్​నుంచే వెనుతిరిగిన మహిళా బ్రిగేడ్​ లీడర్​ తృప్తి దేశాయ్.. ఈసారి ఎలాగైనా అయ్యప్ప ఆలయంలో అడుగుపెడతానని చెప్పారు. సెక్యూరిటీ ఇవ్వబోమని చెప్పినా, తన ప్రయాణాన్ని ఆపేదిలేదన్నారు.

పోలీసు ఆఫీసర్​ మృతి

టెంపుల్​ కాంప్లెక్స్​లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న సివిల్​ పోలీస్​ ఆఫీసర్​ ఒకరు శనివారం చనిపోయారు. మలబార్​ స్పెషల్​ ఆఫీసర్​ బిజు(32) మధ్యాహ్నం ఆలయ ఆవరణలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. బిజుకు భార్య, ఏడు నెలల కూతురు ఉన్నారు.

గుడి తలుపులు తెరుచుకున్నదిలా..

4:58 -– మండల పూజ కోసం పూజారులు ఆలయ తలుపులు తెరిచారు.

5:04 – సన్నిధానం వరకు చేరుకున్న భక్తులు

5:09 – గర్భగుడి తెరిచిన పూజారులు

5:15 – అయ్యప్ప దర్శనానికి వచ్చిన 10 మంది మహిళలను అడ్డుకుని, వెనక్కు పంపిన పోలీసులు

6:00 – మహిళలను అడ్డుకున్న ఘటనపై స్పందించిన తృప్తి దేశాయ్.. కేరళ సర్కారు మహిళలకు వ్యతిరేకమని ఆరోపించారు.

Latest Updates