జ్యుడీషియరీలో 50 శాతం కోటా మహిళలకు ఇవ్వాలె

జ్యుడీషియరీలో 50 శాతం కోటా మహిళలకు ఇవ్వాలె

న్యూఢిల్లీ: జ్యుడీషియరీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ ఉండాలని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. రిజర్వేషన్​ కోసం మహిళలు డిమాండ్​ చేయాలని, అది వాళ్ల హక్కు అని చెప్పారు. లా కాలేజీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉండాలన్నారు. బార్ కౌన్సిల్​ఆఫ్​ ఇండియా ఆదివారం సీజేఐ ఎన్వీ రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా లాయర్లను ఉద్దేశించి జస్టిస్​ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘వెయ్యేండ్ల అణచివేత సమస్య ఇది. కింది కోర్టుల్లో 30 శాతం కన్నా తక్కువ మంది మహిళా జడ్జిలు ఉన్నారు. హైకోర్టుల్లో చాలా తక్కువగా 11.5 శాతమే ఉన్నారు. సుప్రీంకోర్టులోనూ 11 శాతమే ఉన్నారు’ అని చెప్పారు. చాలా కష్టపడి సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్యను11 శాతానికి తీసుకొచ్చామన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినప్పుడు జ్యుడీషియరీలో మహిళలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని అనుకుంటారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల వల్ల జ్యుడీషియరీలో ఎక్కువ మంది మహిళలు ఉండొచ్చని, కానీ ఇంకా ఎక్కువ మందికి వెల్​కమ్​ చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళల్లో పై స్థాయి వరకు కొంత మందే వెళ్తున్నారని, వాళ్లూ చాలా సమస్యలను ఎదుర్కుంటున్నారని చెప్పారు. లాయర్ వృత్తిలో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని 33 మంది సిట్టింగ్​ జడ్జిల్లో జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ హిమా కోహ్లీ, జస్టిస్​ బీవీ నాగరత్న, జస్టిస్​ బేలా ఎం త్రివేది మహిళా జడ్జిలు. జస్టిస్​ నాగరత్న 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.