మహిళా వెయిట్​లిఫ్టింగ్​ కేరాఫ్​ మణిపూర్

‘వెయిట్​ లిఫ్టింగ్​’ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు కరణం మల్లీశ్వరి.  బరువులెత్తడంలో ఆమె సాధించిన ఘనత అలాంటిది. 20 ఏళ్ల కిందట ఒలింపిక్స్​లో మెడల్​ పొందిన మొదటి ఇండియన్​ ఉమెన్​గా ఈ తెలుగమ్మాయి రికార్డ్​ సృష్టించింది. ఆ హిస్టరీని ఇప్పుడు మణిపూర్​ ఆడపిల్లలు కొనసాగిస్తున్నారు. మరో మాట చెప్పాలంటే ఆమెను మించిన విజయాలే నమోదు చేస్తున్నారు. ఉమెన్​ వెయిట్​ లిఫ్టింగ్​కి మణిపూర్​ని కేరాఫ్​ అడ్రస్ చేశారు. ఇంటర్నేషనల్​ లెవల్​లో ఇండియాకి పేరు తెస్తున్న ఆ విజేతలు పేదింటి బిడ్డలు కావటం చెప్పుకోదగ్గ విషయం.

సెన్సిటివ్​ స్టేట్​గా భావించే మణిపూర్​లో రెబెల్స్, టెర్రరిస్టులు, పాలిటిక్స్​ సహా ఇతర అంశానికీ చెక్కు చెదరకుండా  నిలబెడుతున్న అంశం స్పోర్ట్స్​. మరీ ముఖ్యంగా ఆ ఈశాన్య రాష్ట్రం వెయిట్​ లిఫ్టింగ్​కి చిరునామాగా నిలుస్తోంది. అనితా చాను, కుంజరాణిదేవి, మీరాబాయి చాను వంటివాళ్లు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు. పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తున్నారు. ఈ పతకాల వేటను ఇకపైనా కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది టోక్యో (జపాన్)లో జరగనున్న సమ్మర్​ ఒలింపిక్స్​లో సత్తా చాటుతామంటున్నారు.

కుంజరాణికి పరుగుల రాణి ఇన్​స్పిరేషన్​

కుంజరాణిదేవి 14 ఏళ్ల వయసప్పుడు (1982లో) ఏషియన్​ గేమ్స్​ జరుగుతున్నాయి. అప్పుడే వాళ్లు టీవీ కొన్నారు. మన దేశంలో కలర్​ లైవ్​ టెలికాస్ట్​ అయిన బిగ్​ ఈవెంట్​ అదే. ఆ పోటీలు 16 రోజుల పాటు లైవ్ వచ్చాయి. అందులో మన దేశం నుంచి పాల్గొన్న పరుగుల రాణి పీటీ ఉష రెండు సిల్వర్​ మెడల్స్​ సొంతం చేసుకుంది. ఆమె ఆట చూసి ఇన్​స్పయిరైంది కుంజరాణి. తానూ ప్లేయర్​ కావాలని నిర్ణయించుకుంది. కానీ.. ఆమె ఎత్తు తక్కువ కావడం చాలా ఆటలకు ఆటంకంగా మారింది.

పొట్టివాళ్లు గట్టివాళ్లే!

బరువులెత్తే పోటీలకు ఎత్తుతో సంబంధం లేదు. దాంతో కుంజరాణి వెయిట్​లిఫ్టింగ్​ని ఎంచుకుంది. ఈ పొట్టితనం తనకు చాలా సార్లు ప్లస్​ పాయింట్​గా మారిందని ఆమె అంటుంటారు. 1983లో అనితా చాను అనే మరో అమ్మాయితో కలిసి కుంజరాణి వెయిట్​లిఫ్టింగ్​లో కోచింగ్​ తీసుకుంది. వీళ్లిద్దరూ పగలనగా రాత్రనకా, ఎండావానా లెక్కచేయకుండా గెలుపే శ్వాసగా ప్రాక్టీస్​ చేశారు. అప్పట్లో స్పోర్ట్స్​కి సర్కారు పెద్దగా డబ్బులిచ్చేది కాదు. ఆ కష్టాలను కూడా వాళ్లు విజయవంతంగా దాటి చాంపియన్లుగా నిలిచారు. ఫ్రెండ్స్​, చుట్టాల దగ్గర అప్పులు చేసి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేవారు.

అదే సంవత్సరం కుంజరాణి పవర్​లిఫ్టింగ్​లో నేషనల్​ రికార్డ్​ సృష్టించింది. రెండేళ్ల తర్వాత (1985లో) అనితా చాను.. వియన్నాలో జరిగిన వరల్డ్​ చాంపియన్​షిప్​లో ఇండియా తరఫున పార్టిసిపేట్​ చేసింది. కుంజరాణి ఒలింపిక్స్​లో పాల్గొనాలనుకుంది కానీ, ఒలింపిక్స్​లో పవర్​ లిఫ్టింగ్​ ఈవెంటే లేదు. అదే ఏడాది మన దేశంలో సమ్మర్​ ఒలింపిక్స్​ తరహాలో నేషనల్​ గేమ్స్​ ఆరంభించి, దానిలో ఉమెన్​​ వెయిట్​లిఫ్టింగ్​కి చోటు కల్పించారు. ఆ అవకాశాన్ని కుంజరాణి, అనిత చాను చక్కగా వాడుకున్నారు. కుంజ మూడు కేటగిరీల్లో గోల్డ్​ మెడల్స్​​ తెచ్చుకుంది.

1989 నాటికి కుంజరాణి దేశంలోనే పాపులర్​ స్పోర్ట్స్ ​ఉమెన్. మాంచెస్టర్​లో జరిగిన వరల్డ్​ వెయిట్​లిఫ్టింగ్​ చాంపియన్​షిప్​లో మూడు సిల్వర్​ మెడల్స్​ సాధించింది. 1990, 94 ఆసియన్​ గేమ్స్​తోపాటు 2006 కామన్వెల్త్​ గేమ్స్​లో ‘బ్రాంజ్’ గెలిచింది. మొత్తమ్మీద 68 ఇంటర్నేషనల్​ మెడల్స్​ సొంతం చేసుకుంది కుంజరాణి. ఆమె విజయాలకు, సేవలకు గుర్తుగా ప్రభుత్వం అర్జున, రాజీవ్ ​ఖేల్​రత్న అవార్డులను అందజేసింది. 2011లో పద్మశ్రీ కూడా వరించింది. తద్వారా ఆమె ఎందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.

2009లో చత్తీస్​గఢ్​ యూత్​ చాంపియన్​షిప్​లో మొదటి మెడల్​ సాధించిన మీరాబాయి ఐదేళ్లలో అందనంత ఎత్తుకు ఎదిగింది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్​ గేమ్స్​లో ‘సిల్వర్​’​ సొంతం చేసుకునే స్థాయికి చేరింది. 2016లో 192 కేజీల బరువెత్తి గతంలో కుంజరాణి సృష్టించిన 190 కేజీల రికార్డును బ్రేక్​ చేసింది. 2018లో ‘రాజీవ్​ ఖేల్​రత్న’ గెలుచుకుంది. 2016 రియోడీజెనిరో సమ్మర్​ ఒలింపిక్స్​లో ఫెయిల్​ అయినా 2017లో వరల్డ్​ ఛాంపియన్​షిప్​లో ‘గోల్డ్’తో మెరిసింది. మల్లీశ్వరి తర్వాత ఆ ఘనత సాధించిన రెండో అమ్మాయిగా నిలిచింది.

కొనసాగిన హవా

మీరాబాయి చాను ప్రస్థానం ఆ తర్వాత కొనసాగింది. 2018 కామన్వెల్త్​ గేమ్స్​లో, 2019లో థాయ్​లాండ్​లో జరిగిన ఈజీఏటీ కప్‌లోనూ బంగారు పతకాలను సొంతం చేసుకుంది. అంతా అనుకున్నట్లే సాగితే ఈ ఏడాది టోక్యో సమ్మర్​ ఒలింపిక్స్​లో కూడా మీరాబాయి మరోసారి తానేంటో నిరూపించుకుంటుందని ఆమె కోచ్​ శర్మ అంటున్నారు. ‘నేను ఏదైనా సాధించాలని అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోను. నాపై ఎంతో మంది ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్లను నిరుత్సాహపరచను’ అని మీరాబాయి భరోసా ఇస్తున్నారు.

బ్రిటిష్​వాళ్లు పాలించే రోజుల్లో మణిపూర్​లో స్పోర్ట్స్​ క్లబ్బులు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఆడవాళ్లను అన్ని రంగాల్లోనూ ఎంకరేజ్​ చేయటం ఆ స్టేట్​లో మొదటి నుంచీ ఉంది. మన దేశంలో జెండర్​ ఈక్వాలిటీ లేదని విదేశీయులు పొరపాటు పడుతుంటారు. ఆడవాళ్లను తక్కువ చేసి చూస్తారనే అపవాదునూ మనం ఎదుర్కొంటున్నాం. వాటన్నింటికీ మణిపూర్​ ధీటుగా సమాధానం చెబుతోంది. వెయిట్​లిఫ్టింగ్​లో అమ్మాయిలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రలు సృష్టిస్తుండటమే దీనికి తిరుగులేని సాక్ష్యం.

‘పోలో’కి పుట్టినిల్లు

ఆటలతో మణిపూర్​ అనుబంధం ఈనాటిది కాదు. రాజుల కాలం నుంచే ఆ ప్రాంత ప్రజల కల్చర్​లో స్పోర్ట్స్​ ఒక భాగమైంది. అది కూడా ఒక్క వెయిట్​లిఫ్టింగ్​లో కాదు. అసలు ‘పోలో’ పుట్టింది మణిపూర్​లోనే కావటం మరో విశేషం. హాకీకి మరో వెర్షన్​గా​ ఉండే ఆటను మణిపూరీలు చాలా ఇష్టంగా ఆడతారు.  మణిపూర్​ జనాలు ఎప్పుడూ ఫిట్​నెస్​ని కాపాడుకుంటూ ఉంటారు. యుద్ధం సహా అనుకోని ప్రమాదాలు ఏవైనా జరిగితే తలపడటానికి రెడీగా ఉంటారు.

చైనాకి చెక్​ పెట్టిన దేవి, చాను

అదే ఊపుతో త్రివేండ్రంలో జరిగిన రెండో నేషనల్​ గేమ్స్​లో కుంజరాణి రెండు జాతీయ రికార్డులు నెలకొల్పింది. అప్పట్లో వెయిట్​లిఫ్టింగ్​కి చైనా పెట్టింది పేరు. ఆ ట్రెండ్​కి 1985, 86, 87ల్లో వరుసగా బ్రేక్​ వేసింది. పెద్దగా కోచింగ్​ లేకుండానే ఆమె చైనా లిఫ్టర్లకు చెక్​ పెట్టగలిగింది. అనిత చానుకూడా ఆమెతో సమంగా రాణిస్తూ… ఓవరాల్​గా 11 ఇంటర్నేషనల్ కంటెస్ట్​ల్లో పాల్గొని వివిధ ఆసియన్​ చాంపియన్​షిప్​ల్లో మెడల్స్​ కైవసం చేసుకుంది. 1990ల్లో గాయాల బారిన పడటంతో పోటీల్లో పాల్గొనటం ఆపేసి కోచింగ్​ మొదలుపెట్టింది.

కొత్త కెరటం మీరాబాయి

అనిత చాను, కుంజరాణిల తర్వాత మణిపూర్​ నుంచి కొత్త కెరటం వచ్చింది. ఆమె పేరు.. మీరాబాయి చాను. వెయిట్​ లిఫ్టింగ్​ ప్రపంచంలోకి ఆమె ఎంట్రీ అనుకోకుండా జరిగింది. ఆర్చరీలో ట్రైనింగ్​ కోసం వచ్చిన మీరాబాయి చివరికి బరువులు ఎత్తడాన్ని బాగా వంట బట్టించుకుంది. మీరాబాయిలో టాలెంట్​ను గుర్తించిన కోచ్​ ఆ విషయాన్నే ఆమె పేరెంట్స్​కి చెప్పాడు. ఎంకరేజ్​ చేస్తే అద్భుత విజయాలను సాధిస్తుందన్న అంచనాలను నిలబెట్టుకుంది. మీరాబాయికి మొదటి కోచ్​ అనిత చాను కావటం విశేషం.

Latest Updates