మసీదులో ఉమెన్​ వెల్​నెస్​

నిన్నటి దాంక నమాజ్​కే ప్రవేశం లేని ఆడోళ్ల కోసమని ఒక మసీదుల వెల్​నెస్​ సెంటర్​ స్టార్ట్​ చేసిన్రు! మత బోదనలే గాదు, మతాన్ని  విశ్వసించేటోళ్ల హెల్త్​ గూడా కాపాడటం మా అభి‘మతం’ అని చెబుతున్న ఈ మసీదు ఏడనో లేదు. మన హైదరాబాద్​ సిటీలనే ఉంది! ఆ డోళ్ల కోసం స్టార్ట్​ చేసిన వెల్​నెస్​ సెంటర్ రాజేంద్ర నగర్​లో ఉన్న ‘మజీద్​–ఎ–ముస్తఫ’ల ఉన్నది. హైదరాబాద్​ సెంటర్​గ పనిచేసే హెల్పింగ్​ హ్యాండ్ ఫౌండేషన్… ఎడ్యుకేషన్​, ఎకనామిక్​ డెవలప్​మెంట్​ కోసం పనిచేసే అమెరికా ఎన్​జీవో ‘సపోర్ట్​ ఫర్​ ఎడ్యుకేషన్​ అండ్​ ఎకనామిక్​ డెవలప్​మెంట్​ (సీడ్)’ ​ కలిసి ఈ వెల్​నెస్​ సెంటర్​ని స్టార్ట్​ చేశినయ్​. చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో ఉండే పేద మహిళలు ఉపయోగించుకునేలా ఈ వెల్​నెస్​ సెంటర్​ని నిర్వహిస్తామని ఆర్గనైజర్స్​ చెప్తున్నరు.

ఈ వెల్​నెస్​ సెంటర్​ల జిమ్​ కూడా ఉన్నది. బస్తీ ఆడోళ్లని ట్రైన్​ చేయనీకి ఫిట్​నెస్ ఎక్స్​పర్ట్​ ట్రైనర్​ గూడ ఉన్నరు. ఆమె  ప్రతి రోజూ రెండు బ్యాచ్​లకు వర్కవుట్స్​ ఎట్ల చేయాల్నో చెబుతదట. ‘హెల్తీగ ఉన్నరో? లేదో? చెక్​ చేసుకోవాల్నంటే వెల్​నెస్​ సెంటర్​కి రండ్రి’ డాక్టర్​ కన్సల్టెన్సీ ఫ్రీగ ఇప్పిస్తమని బస్తీ ఆడోళ్లకు వెల్​కమ్​ చెప్తున్నరు. జనం ఆరోగ్యంగా ఉన్నరా? లేదా? ఏం ఇబ్బందులున్నయ్​? ఎందుకొచ్చినయ్? తెలుసుకోని కౌన్సెలింగ్​ చేయనీకి ఇందులో ఒక లేడీ డాక్టర్​ గూడ ఉంది. ఇట్ల మజీద్​ని దవాఖాన లెక్క మార్చినరు. ఈ దవాఖానల కౌన్సెలింగ్ ​చేసే డాక్టర్…​ రోగం రాకముందలే సింప్టమ్స్​ని పసిగట్టి అలర్ట్​ చేస్తది. పేదోళ్లకు ఇంతకంటే పెద్ద సాయం ఏముంటది? ప్రాబ్లమ్​ ఉందని తెలిస్తే వాళ్లు యాడికి పోవాలె? ఎవర్ని కలవాల్నో కూడా చెప్పి, అవసరమైన సాయం జేస్తరట.

క్లినిక్​ కమ్​ జిమ్​

బస్తీల్ల మస్త్​ జనం ఉంటరు. గల్లీలే కాదు ఇళ్లు గూడా ఇరుకే. ఇల్లు పక్కన ఇల్లు ఉండే ఈ బస్తీల్లో ఒకలు మంచం పడితె వారంల బస్తీ అంతా సుస్తి జేస్తది. ఇసుంటి చోట అందరూ ఖుషీగా ఉండాల్నంటె ఫిట్​నెస్​ పెంచుకొనుడే ఆప్షన్​. ఆమ్దాని పెరగకున్న ఫిట్​నెస్​ అన్నా పెంచుకుంటే కోవిడ్​  టైమ్​ల గట్టెక్కుతం అని అనుకుంటే సరిపోలే. జిమ్​లకు, వెల్​నెస్​ సెంటర్స్​కి పోవాల్నంటే  మస్త్​ పైసలు ఉండాలె. మరి పైసల్లేనోళ్ల సంగతి ఏంది? వాళ్ల కోసమే మసీద్​ల హెల్పింగ్​ హ్యాండ్​ ఫౌండేషన్​ మసీద్​ల వెల్​నెస్​ సెంటర్​ని స్టార్ట్​ చేసింది.

బెటర్​ ప్రివెన్షన్​

బస్తీల్ల రోగాలెక్కువ. ఎందుకిట్లయితందని ఇంతకుముందెన్నోసార్లు సర్వే చేసిన్రు. ఆ సర్వేల్ల ఒక సర్వే ఏం తేల్చిందంటే.. 52 శాతం మంది ఆడోళ్లు కార్డియో మెటబాలిక్​ సిండ్రోమ్​ (గుండె కండరాలు, గుండెలోని వాల్వ్స్​కి సంబంధించిన)లోపంతో ఇబ్బంది పడ్తున్నరు. పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన విషాదం గిది. ఒక సర్వేల 25 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఆడోళ్లల  30 శాతం మంది పీసీఓడీ (పాలిసిస్టిక్​ ఒవేరియన్​ డిసీజ్​)తో ఇబ్బందులు పడ్తున్నరని తేలింది. 12 శాతం మంది డయాబెటిస్, హైపర్​ టెన్షన్​, థైరాయిడ్​ ప్రాబ్లమ్స్​ల ఏదో ఒకదానితో ఉన్నరు. బాడీ మాస్​ ఇండెక్స్​ కూడా సరిగ లేకుండె. ఈ బాధలు లేకుండ చేయాల్నంటె అందరిల హెల్త్​ అవేర్​నెస్​ తీస్కరావాలనుకున్నరు. గుండెతో పాటు కిడ్నీ, లివర్​, కంటి చూపు మీద ఎక్కువ ఫోకస్​ చేస్తున్నమని చెప్తున్నరు.

బస్తీ దవాఖాన

కోవిడ్​ టైమ్​ దవాఖానకు పోవల్నంటె ఎంత కష్టంగుండెనొ. చిన్న చిన్న దవాఖానలన్నీ మూతపడ్డయ్​. పెద్ద దవాఖానలకు పోదమంటే పేదోళ్లకు కష్టంగుండె. ఆ టైమ్​లో ఈ వెల్​నెస్​ సెంటర్​ల ‘రుబియా క్లినిక్​’ పేరుతో దవాఖాన నడిపిన్రు. కోవిడ్​ బారిన పడకుండా సేఫ్టీ కోసం ప్లాస్టిక్​ కర్టెన్స్​, ఫేస్​ షీల్డ్​ మాస్కులు పెట్టుకుని ఎంత మంది వచ్చినా చెకప్​ చేసి పంపిన్రు. రాజేంద్ర నగర్​ మండలం పరిధిలో ఉన్న 31 బస్తీ జనాలకు ఈ క్లినిక్​ హెల్ప్​చేసింది.

Latest Updates