వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ రికార్డ్.. అతి చిన్న వయసులోనే..

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది భారత వుమెన్స్ టీమ్ ఓపెనర్ షెఫాలీ వర్మ. 20 ఓవర్లు, 50 ఓవర్లు ఫార్మాట్లలో వరల్డ్ కప్ హిస్టరీలో అతి చిన్న వయసులోనే ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్‌గా నిలిచింది. ఈ రికార్డు కేవలం మహిళల క్రికెట్‌కే పరిమితం కాదు. పురుషుల క్రికెట్‌లోనూ ఆమె కంటే తక్కువ వయసులో వరల్డ్ కప్ ఫైనల్ ఆడినవాళ్లు లేరు. ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా-టీమిండియా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంటున్న షెఫాలీ వయసు నేటికి 16 ఏళ్ల 40 రోజులు.

తొలి కప్ కోసం…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వుమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గెలుపు మీద ధీమాగా ఉన్నాయి. ఈ రోజే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 31వ బర్త్ డే కావడం విశేషం. వరల్డ్ కప్ సొంతం చేసుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె.. మ్యాచ్‌ మొదలయ్యే ముందు చెప్పింది. తన తల్లి స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తోందని, ఫైనల్ ప్రెషర్ ఉంటుందని, తొలి బ్యాటింగ్ రావాలని తామ కోరుకున్నామని చెప్పింది హర్మన్‌ప్రీత్. అయితే చేజింగ్‌పైనా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని, తమ బౌలర్లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తొలి వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్ ఇప్పటికే నాలుగు సార్లు వరల్డ్ కప్‌ ఫైనల్‌లో విజయం సాధించింది.

Latest Updates