
ఇప్పటివరకు అరడజను మహిళల టీ20 వరల్డ్‌కప్స్ జరిగాయి..! కానీ ఒక్కటీ మన సొంతం కాలేదు..! కారణాలేమైనా గతం.. గతః..! కానీ ఈసారి పరిస్థితులు మారాయి.. అంచనాలూ పెరిగాయి..! ఫేవరెట్ హోదా వచ్చేసింది..! స్టార్లతో నిండిన బలమైన టీమ్ అందుబాటులో ఉంది..! ఇక చేయాల్సిందల్లా.. అవకాశాలను అందిపుచ్చుకోవడమే..! తొలి కప్ గెలవడానికి ఇంతకంటే మించిన తరుణం మళ్లీ రాదేమో అనుకుంటున్న నేపథ్యంలో.. ఇండియా.. ధనాధన్ మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది..! నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అన్ని అస్త్రాలతో రెడీ అయ్యింది..! మరి తొలి కప్‌ను ముద్దాడాలన్న బలమైన లక్ష్యంతో ఉన్న టీమిండియా.. తొలి అడుగు ఘనంగా వేస్తుందా? లేదా చూడాలి..!!
సిడ్నీ: నిలకడగా ఆడటమే ప్రధాన లక్ష్యంగా ఇండియా మహిళల టీమ్.. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ కోసం సిద్ధమైంది. పాత చరిత్రను పక్కనబెట్టి.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చే విజయాలను సాధించాలన్న ఏకైక టార్గెట్‌తో శుక్రవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో తమదైన విజయాలు సాధించినా.. ఇప్పటివరకు వరల్డ్‌కప్ మాత్రం ఇండియాకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. వ్యక్తిగత రికార్డులు సృష్టించిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలాంటి టాప్ ప్లేయర్లు కూడా ఓ దశలో కప్ కోసం పోరాడి వెనక్కి తగ్గారు. అయితే ఈసారి యంగ్ లేడీస్‌తో బరిలోకి దిగుతున్న టీమిండియా భారీ విజయాలపై కన్నేసింది. తొలి అడుగులోనే బలమైన కంగారూలకు చెక్ పెడితే టోర్నీ మొత్తం ఆత్మవిశ్వాసంతో ఆడొచ్చని అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
వామ్లింక్ ఔట్
ఇటీవల జరిగిన ట్రై సిరీస్ విజేతగా నిలిచిన ఆసీస్ టీమ్.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. జరిగిన ఆరు ఎడిషన్లలో నాలుగుసార్లు విన్నర్‌గా నిలవడమంటే కంగారూల పెర్ఫామెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే పాదం గాయంతో.. లీడ్ పేసర్ టేలా వ్లామింక్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. ట్రై సిరీస్‌లో వ్లామింక్ తన ఎక్స్‌ట్రా పేస్‌తో ఇండియా బ్యాట్స్‌వుమెన్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. వ్లామింక్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ మోలీ స్ట్రానోను తీసుకున్నారు. జట్టులో ఆల్‌రౌండర్లకు కొదువలేకపోవడంతో ఒకరిద్దరు గాయపడినా ఆసీస్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదు. బ్యాటింగ్‌లో మూనీ, లానింగ్, హీలీ, మేగన్ షుట్, సదర్లాండ్ కీలకం కానున్నారు. ఆసీస్ ఫేవరెట్‌గా దిగుతున్నా.. టీమిండియాలోనూ నైపుణ్యానికి తక్కువలేదు కాబట్టి రసవత్తర పోరు జరగడం ఖాయం.
మిడిల్‌తోనే సమస్య
టీమిండియాను పూర్తిగా పరిశీలిస్తే.. మిడిలార్డర్‌తోనే పెద్ద సమస్య ఎదురవుతున్నది. నాకౌట్ స్టేజ్‌ల్లో ఒత్తిడిని అధిగమించే ప్లేయర్లు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చాలా ముందంజలో ఉన్నాయి. ఈ రెండు టీమ్‌లను నిలువరించాలంటే ఇండియా మిడిలార్డర్ కూడా మరింత బలోపేతం కావాలి. ఓపెనింగ్‌లో స్మృతి మంధానకు ఎదురులేదు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత జోరుమీదున్నా.. రన్స్ చేయడంలో మంధాన దిట్ట. రెండోఎండ్‌లో 16 ఏళ్ల షెఫాలీ వర్మ పై కూడా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం షెఫాలీ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరిస్తే ఇండియా భారీ స్కోరును ఆశించొచ్చు. ఇంగ్లండ్, ఆసీస్‌తో జరిగిన ట్రైసిరీస్‌లో కౌర్ విఫలంకావడం ప్రతికూలాంశంగా మారినా.. ఈ మ్యాచ్ వరకు గాడిలో పడుతుందని మేనేజ్‌మెంట్ ధీమాతో ఉంది. ఇక 16 ఏళ్ల రిచా ఘోష్‌కు ఇంటర్నేషనల్ అనుభవం ఎక్కువగా లేకపోయినా.. తన బ్యాటింగ్ స్కిల్‌తో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. వేదా కృష్ణమూర్తి, రోడ్రిగ్స్.. వచ్చిన చాన్స్‌ను వినియోగించుకుంటే చాలు. ఇక బౌలింగ్‌లో ఇండియా ఎక్కువగా స్పిన్నర్లపై ఆధారపడటం ఇబ్బందిగా మారింది. జులన్ గోస్వామి తర్వాత ఆ స్థాయిలో పేస్ విభాగాన్ని నడిపే బౌలర్ అందుబాటులో లేరు. చాలా కాలంగా శిఖా పాండే పేస్ బౌలింగ్ వేస్తున్నా.. ఎర్లీ బ్రేక్‌త్రూ ఇవ్వడంలో వెనుకబడుతున్నది. అయితే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా శిఖా పేరు రికార్డుల్లో ఉంది. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ స్పిన్‌లో మెరిస్తే ఇండియా ఇబ్బందులు తప్పినట్లే. కానీ ఆసీస్‌లో అన్నీ పేస్ పిచ్‌లు కావడంతో పేసర్ల అవసరం చాలా ఉంటుంది.
వేయడానికి లేదు. చాలామంది టాలెంట్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. హైస్కోరింగ్, టఫ్ మ్యాచ్ ఆశిస్తున్నా. రెండు టీమ్‌ల బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కానీ దేశానికి అవసరమైన రోజు ఎవరు రన్స్ చేస్తారనేది ముఖ్యం. టీ20 రికార్డు పరంగా ఇండియా కంటే ఆస్ట్రేలియాకే విన్నింగ్ చాన్స్ ఎక్కువుగా ఉంది. – మిథాలీరాజ్
జట్లు (అంచనా)
ఇండియా: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షెఫాలీ, రోడ్రిగ్స్, దీప్తి, భాటియా, డియోల్, అరుంధతి, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్.
ఆస్ట్రేలియా: లానింగ్ (కెప్టెన్), హీలీ, మూనీ, గార్డెనర్, హైన్స్, మోలినెక్స్, జొనాసెన్, క్యారీ, కిమ్మిన్స్, షుట్