న్యూజిలాండ్‌తో నేడు మూడో టీ20.. హ్యాట్రిక్‌పై కన్నేసిన ఉమెన్స్ టీం

గెలిస్తే సెమీస్‌ బెర్తు ఖాయమే!
ఫుల్‌‌ జోష్‌‌లో హర్మన్‌ అండ్‌ కో
బరిలోకి స్మృతి మంధాన
ఉదయం 9.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్‌లో..

ఆస్ట్రేలియా అడ్డు దాటేశారు..! బంగ్లాదేశ్‌‌ను బాదేశారు..! ఇప్పుడిక న్యూజిలాండ్‌ పని పట్టాల్సిన సమయం వచ్చింది..! టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఫుల్‌‌ జోష్‌‌లో ఉన్న ఇండియా నేడు జరిగే మ్యాచ్‌లో కివీస్​ టీమ్‌‌ మైండ్‌ బ్లాంక్‌ చేసి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని చూస్తోంది..! స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన అనారోగ్యం నుంచి కోలుకోవడంతో జట్టు బలం మరింత పెరిగింది..! మరి మన అమ్మాయిలు కివీస్‌‌కు చెక్‌ పెట్టి హ్యాట్రిక్‌‌తో పాటు సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంటుందా?

మెల్‌‌బోర్న్: ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించి బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌‌లో‌నూ అదిరిపోయే పెర్ఫామెన్స్‌ చేసిన టీమిండియా.. మహిళల 20 వరల్డ్‌‌కప్‌‌లో మూడో విజయంపై కన్నేసింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం జరిగే మ్యాచ్‌‌లో పటిష్ట న్యూజిలాండ్‌‌తో పోటీ పడనుంది. ఫస్ట్‌‌ మ్యాచ్‌లో‌నే డిఫెండింగ్‌ చాంపియన్‌, హాట్‌ ఫేవరెట్‌ ఆస్ట్రేలియాపై అనూహ్య విజయంతో ఎనలేని ఆత్మవిశ్వాసం సాధించిన హర్మన్‌ ప్రీత్‌ నేతృత్వంలోని ఇండియా గత మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌ విసిరిన సవాల్‌‌ను కూడా ఛేదించింది. దాంతో ఐదు జట్ల గ్రూప్‌-ఎలో నాలుగు పాయింట్లతో టాప్‌ ప్లేస్‌‌లో ఉన్న ఇండియా.. అదే జోరుతో కివీస్‌ అడ్డు కూడా
దాటేస్తే సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్, బాల్‌‌తో హర్మన్‌ అండ్‌ కో ఆకట్టుకుంది. ధనాధన్​ బ్యాటింగ్​తో దూసుకెళ్తున్న 16 ఏళ్ల యువ క్రికెటర్‌ షెఫాలీ వర్మ ఆట ముచ్చటగొలుపుతోంది. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ కూడా పరిస్థితులకు తగ్గట్టు తన ఆటతీరును మార్చుకుంటూ జట్టుకు ఉపయోగపడుతోంది. ఇక, వైరల్‌‌ ఫీవర్‌ కారణంగా గత మ్యాచ్‌‌కు దూరంగా ఉన్న స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన కోలుకుని కివీస్‌‌పై బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ధనాధన్‌ బ్యాటింగ్‌‌తో క్షణాల్లో ఆటను మలుపుతిప్పే మంధాన ఉంటే జట్టు బలం కొండంత పెరుగుతుంది. ఇక, ఆల్‌‌రౌండర్‌ దీప్తి శర్మతో పాటు వేదా కృష్ణమూర్తి టచ్‌ లోకి రావడంతో మిడిలార్డర్‌ కూడా మెరుగ్గా మారింది. అయితే, బ్యాటింగ్‌‌లో ఇండియాను వేధిస్తున్న ఏకైక సమస్య కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఫామ్‌. చాలా రోజుల నుంచి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న హర్మన్‌ కూడా గాడిలో పడితే జట్టుకు తిరుగుండదు. 2018 వరల్డ్‌‌కప్‌‌లో కివీస్‌పై సెంచరీతో అదరగొట్టిన కౌర్‌ ఈ సారి కూడా అలాంటి పెర్ఫామెన్స్‌ చేయాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్‌‌లో ఇండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. గూగ్లీలు, స్లో బాల్స్‌‌తో ప్రత్యర్థులకు సవాల్‌‌గా మారిన స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ మన బౌలింగ్‌‌ను ముందుండి నడిపిస్తోంది. పేసర్లు శిఖా పాండే, అరుంధతి రెడ్డి కూడా తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. మంధాన జట్టులోకి వస్తే రిచా ఘోష్‌ బెంచ్‌‌కు రావడం తప్ప ఇండియా ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో మార్పులు ఉండబోవు.

కివీస్‌‌తో సవాలే
టీమిండియా అన్ని డిపార్ట్‌‌మెంట్లలో బలంగా కనిపిస్తున్నప్పటికీ న్యూజిలాండ్‌‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఏడాది కిందట జరిగిన టీ20 సిరీస్‌‌ను 3–0తో క్లీన్‌ స్వీప్‌ చేసిందా జట్టు. గత టీ20 వరల్డ్‌‌కప్‌‌లో కివీస్‌ పై హర్మన్‌ సెంచరీ చేయడంతో ఇండియా 34 పరుగులతో విజయం సాధించింది. అయితే, తమ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో శ్రీలంకపై ఏడు వికెట్లతో భారీ విజయం సాధించిన కివీస్​తో ఈసారి హర్మన్‌ బృందానికి సవాల్‌‌ ఎదురవనుంది. ఫామ్‌‌లో ఉన్న కెప్టెన్‌, ఆల్‌‌రౌండర్‌ సోఫీ డివైన్‌ జట్టుకు కొండంత అండ. శ్రీలంకపై 55 బాల్స్‌లోనే 75 రన్స్‌ చేసిన ఆమెను ఇండియా బౌలర్లు వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చే మార్గాలు అన్వేషించాలి. టాపార్డర్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్‌, పేసర్ లియా తహుహు, లెగ్ స్పిన్నర్‌ అమేలియా కెర్‌ ప్రమాదకర ప్లేయర్లే.

Latest Updates