శివుడు తప్ప.. అక్కడ కోటిమంది దేవుళ్లు

కాశీలో ఏదో పని పడింది. అట్లా ఈశాన్య భారతదేశం నుంచి కోటి మంది దేవుళ్లు,దేవతలు బయలుదేరారు. వస్తూ వస్తూ మధ్యలో విశ్రాంతి కోసం పెద్ద పెద్ద కొండలు, గుట్టలు ఉన్నచోట ఆగారు. అంతా రాత్రికి అక్కడే నిద్రపోయేందుకు సిద్ధమయ్యారు. శివుడికి మాత్రం అక్కడ ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్టు అనిపించింది. సూర్యోదయం కాక ముందే అక్కడి నుంచి బయలు దేరాలని,లేకుంటే అంతా రాళ్లుగా మారిపోతారని హెచ్చరించాడు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో అంతా గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. శివుడు తెల్లారక ముందే లేచి, కాశీకి వెళ్లిపోయాడు. మిగతా 99లక్షల 99 వేల 999 మందిదేవుళ్లంతా విగ్రహాలుగా మారిపోయారు.. ఇదీ త్రిపుర రాష్ట్రంలోని ఉనకోటి ప్రాంతం గురించి స్థా నికులు చెప్పే గాథ. ఉనకోటి అంటే అర్థం కూడా ‘కోటి కన్నా ఒకటి తక్కువ’. చిత్రమేంటంటే మిగతా దేవుళ్ల విగ్రహాలేమోగానీ ఇక్కడ శివుడి విగ్రహాలే పెద్దగా ఉన్నాయి.త్రిపుర రాజధాని అగర్తలా కు 178 కిలోమీటర్లదూరంలో ఉనకోటి ఉంది. దట్టమైన అడవి మధ్య కొండలు, గుట్టలతో నిండిన ఈ ప్రాంతంలో 7, 8శతాబ్దాల నాటి, అంటే 1,300 ఏళ్ల కిందటి అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కొండ రాళ్లపై హిందూ దేవతల విగ్రహాలను చెక్కారు. ముఖ్యంగా మన దేశంలో శివుడంటే లింగం ఆకారంలోనే రూపొందిస్తారు. కానీ ఇక్కడ మానవాకారంలో పెద్దజటాజూటాలతో, కిరీటాలతో శివుడి విగ్రహాలు ఉండటం విశేషం. అసలు వీటిని ఇంత మారుమూల అడవిలో ఎందుకు చెక్కారు. ఏ రాజు పాలనలో ఏర్పాటు చేశారు, ఎవరు చెక్కారన్న ఆధారాలేమీలేవు. 30 అడుగుల ఎత్తున్న ప్రధాన విగ్రహాన్ని ‘ఉన  కోటేశ్వర కాల భైరవ’గా చెబుతారు. దీనికి ఒకవైపుసింహం మీద కూర్చున్న దుర్గా మాత, మరోవైపు గంగాదేవి విగ్రహాలు ఉన్నాయి. కొద్ది దూరంలో పెద్దగణేశుడి విగ్రహం ఉంది. విష్ణువు, నర్సింహస్వామి,రావణుడు, హనుమాన్, నందితోపాటు వందలాదివిగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడి అడవిలో ఇంకా విగ్రహాలు ఉండొచ్చని, పరిశోధనలు చేయాల్సి ఉందని ఆర్కియాలజీ అధికారులు చెబుతున్నారు.

 

Latest Updates