
హైదరాబాద్, వెలుగు: ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకుని వేధింపులకు గురైన మహిళలకు విమెన్ సేఫ్టీ వింగ్ అండగా నిలుస్తోంది. ఫారిన్ లో ఉన్న నిందితులను రాష్ట్రానికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు విచారణకు సహకరించని ఎన్ఆర్ఐలపై చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా విమెన్ సేఫ్టీ వింగ్ గురువారం లక్డికాపూల్ లోని ఆఫీసులో బాధిత కుటుంబాలతో వర్క్ షాప్ నిర్వహించింది. ఐజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి పాల్గొన్నారు. ఆస్ట్రేలియా నుంచి రప్పించిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీని ఒకటి చేశారు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు,విదేశాల్లో ఉన్నవారిని తీసుకురావడానికి గల అవకాశాలను చర్చించారు. కౌన్సిలింగ్ కూడా హాజరు కాకుండా దేశం విడిచి పారిపోయినవారిపై లుక్ ఔట్ నోటీసులతోపాటు పాస్ పోర్ట్ పై తీసుకోవలసిన చర్యలపై ఇన్వెస్టిగేషన్ అధికారులకు గైడ్ లైన్స్ జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 574 కేసులు
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 574 ఎన్ఆర్ఐ కేసుల్లో హైదరాబాద్ లో అత్యధికంగా 248 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటితోపాటు రాచకొండ,సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో 198, వరంగల్ లో 42, కరీంనగర్ లో 21 ఎన్ఆర్ఐ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ 8, నల్గొండ, సిద్దిపేట,ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసులు, మహబూబ్ నగర్ లో ఆరు, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఐదు చొప్పున ఎన్ఆర్ఐ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది జులై 17 న ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్ లో ఇప్పటి వరకు 73 ఫిర్యాదులు అందాయి. వీటిలో 70 కంప్లయింట్స్ పై కేసులు నమోదు చేశారు. ఇందులో 41 కేసుల్లో ట్రయల్స్ పెండింగ్ లో ఉండగా మరో 46 కేసుల్లో నిందితులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 32 కేసుల్లో నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.