డాన్‌కు చెక్‌ పెట్టిన ప్రణయ్

బాసెల్‌‌వరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియన్‌‌ షట్లర్ల జైత్రయాత్ర కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ రెండోరౌండ్‌‌లో అన్‌‌సీడెడ్‌‌ హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌ 21–11, 13–21, 21–7తో ప్రపంచ మాజీ చాంపియన్‌‌, 11వ సీడ్‌‌ లిన్‌‌ డాన్‌‌ (చైనా)పై సంచలన విజయాన్ని సాధించాడు. తద్వారా ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించాడు. డాన్‌‌తో తలపడటం ప్రణయ్‌‌కు ఇది ఐదోసారి కాగా, మూడుసార్లు నెగ్గడం విశేషం.  గంటా 2 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరాటంలో.. చైనీస్‌‌ ప్లేయర్‌‌ నుంచి ఎదురైన ప్రతి సవాల్​ను ప్రణయ్‌‌ అధిగమించాడు. 2–2తో తొలి గేమ్‌‌ను మొదలుపెట్టిన ఇండియన్‌‌ ప్లేయర్.. వరుస పాయింట్లతో 10–5 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. క్రాస్‌‌ కోర్టు షాట్లతో పదును చూపెట్టిన ప్రణయ్‌‌.. డాన్‌‌ను కట్టిపడేశాడు. దీంతో ప్రత్యర్థి ఒకటి, రెండు పాయింట్లకే పరిమితమైన పరిస్థితుల్లో ప్రణయ్‌‌ ఆధిక్యాన్ని 19–11కు పెంచుకున్నాడు. చివర్లో రెండు బలమైన స్మాష్‌‌లు సంధించి గేమ్‌‌ను ముగించాడు.

తొలి గేమ్‌‌ గెలిచిన ఆనందంలో ఉన్న ప్రణయ్‌‌కు డాన్‌‌ రెండో గేమ్‌‌లో చుక్కలు చూపెట్టాడు. ఆరంభంలో ప్రణయ్‌‌ పోరాడి 5–5తో స్కోరు సమం చేసినా.. ఆ తర్వాత వెనుకబడ్డాడు. డాన్‌‌ వేసిన సూపర్‌‌ డ్రాప్స్‌‌కు సమాధానం చెప్పలేక వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు. 18–13తో వెనుకబడ్డ దశలో డాన్‌‌ కొట్టిన మూడు బలమైన బేస్‌‌లైన్‌‌ షాట్స్‌‌కు ప్రణయ్‌‌ తేలిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌‌లో ప్రణయ్‌‌ మరింత రెచ్చిపోయాడు. కనీసం డాన్‌‌కు కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బమీద దెబ్బ కొట్టాడు. 1–1, 4–4తో స్కోరు సమమైన తర్వాత ప్రణయ్‌‌ ఆట రాకెట్‌‌ వేగాన్ని తలపించింది. 6–4 స్కోరు వద్ద తనలోని అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టిన ప్రణయ్‌‌.. అలసిపోయిన చోట డ్రాప్స్‌‌, అవసరమైన చోట ర్యాలీ, కండ్లు చెదిరే క్రాస్‌‌ కోర్టు విన్నర్లతో  వరుసగా 8 పాయింట్లు గెలిచి 14–5 ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే మరో 5 పాయింట్ల రావడంతో ఆధిక్యం 19–7కు పెరిగింది. ఈ దశలో డాన్‌‌కు చాన్స్‌‌ లేకుండా రెండు గేమ్‌‌ పాయింట్లతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. మరో మ్యాచ్‌‌లో సాయి ప్రణీత్‌‌ 21–16, 21–15తో  లీ డాంగ్ కున్‌‌ (కొరియా)పై గెలిచాడు.

మహిళల డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో చాంగ్‌‌చింగ్ హుయ్–యాంగ్ చింగ్ తున్‌‌ (చైనీస్‌‌ తైపీ) తప్పుకోవడంతో  అశ్విని పొన్నప్ప-– సిక్కిరెడ్డి జంటకు వాకోవర్‌‌‌‌ లభించింది. ఇతర మ్యాచ్‌‌ల్లో  పూజా దండు–సంజనాసంతోష్  15–21,14–21తో  సుయాచింగ్–హు లింగ్‌‌ ఫాంగ్ (చైనీస్‌‌ తైపీ) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్ లో మను అత్రి–సుమిత్‌‌ రెడ్డి 21–13, 21–13తో థామ్‌‌ గిక్వెల్‌‌–రోనన్‌‌ లాబర్‌‌ (ఫ్రాన్స్‌‌)పై, అర్జున్​‌‌– శ్లోక్​ 21–14, 21–16తో కుంజీ–ఒలివర్​(స్విట్జర్లాండ్)పై గెలవగా, అరుణ్ జార్జ్–సన్యమ్ శుక్లా 8–21, 11–21తో టకుటో ఇనోయ్‌‌–యుకీ కనెకో (జపాన్‌‌) చేతిలో ఓడారు.

నా గేమ్‌‌ స్టార్టింగ్‌‌, ఎండింగ్‌‌ బాగున్నాయి. రెండో గేమ్‌‌ చాలా టఫ్‌‌గా జరిగింది. కానీ కీలక సమయంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మ్యాచ్​ గెలిచా. నా కోచ్‌‌లకు ధన్యవాదాలు. నా గేమ్‌‌ పట్ల చాలా హ్యాపీగా ఉన్నా. వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ మొమోటాతో మ్యాచ్‌‌ కోసం ఎదురు చూస్తున్నా. నా టాలెంట్‌‌ చూపించడానికి ఇదే సరైన అవకాశం అనుకుంటున్నా . బుధవారం కూడా నాదే అనుకుంటున్నా. –ప్రణయ్‌‌

Latest Updates