తొలిసారే ఫైనల్ కు మంజు రాణి

ఉలాన్‌‌-ఉడె (రష్యా): ఇండియా యువ బాక్సర్‌‌ మంజు రాణి సంచలన పెర్ఫామెన్స్‌‌ చేసింది. వరల్డ్‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బరిలోకి దిగిన తొలిసారే ఫైనల్‌‌కు దూసుకెళ్లి కనీసం సిల్వర్‌‌ మెడల్‌‌ ఖాయం చేసుకుంది. అయితే, ఏడో గోల్డ్‌‌పై గురి పెట్టిన లెజెండరీ బాక్సర్‌‌ ఎమ్‌‌సీ మేరీకోమ్‌‌తో పాటు లవ్లీనా బొర్గొహైన్, జమునా బోరొ సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు. శనివారం జరిగిన 48 కేజీల సెమీఫైనల్‌‌ బౌట్‌‌లో ఆరో సీడ్‌‌ రాణి 4–1తో థాయ్‌‌లాండ్‌‌ బాక్సర్‌‌ చుతామట్‌‌ రక్సత్‌‌ను ఓడించి టైటిల్‌‌ ఫైట్‌‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాదే నేషనల్‌‌ క్యాంప్‌‌లో చేరిన హర్యానా బాక్సర్‌‌ రాణి తనకంటే బలమైన ప్రత్యర్థిపై గొప్ప పోరాట పటిమ కనబరిచింది. తొలి రెండు రౌండ్లలో కౌంటర్‌‌–-అటాక్స్‌‌పై ఆధారపడ్డ ఆమె చివరి మూడు నిమిషాల్లో మాత్రం రక్సత్‌‌పై పూర్తిగా ఎదురుదాడికి దిగింది. ఒకవైపు పవర్‌‌ఫుల్‌‌ స్ట్రెయిట్‌‌ పంచ్‌‌లు విసురుతూనే.. పటిష్టమైన డిఫెన్స్‌‌తో ప్రత్యర్థి దాడిని అద్భుతంగా తిప్పికొట్టి విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సెకండ్‌‌ సీడ్‌‌ రష్యా ప్లేయర్‌‌ ఎకతరీనా పాల్సెవాతో రాణి అమీతుమీ తేల్చుకోనుంది.  అయితే, మిగతా సెమీఫైనల్స్‌‌లో ఇండియా బాక్సర్లకు నిరాశే ఎదురైంది. మెగా టోర్నీలో ఎనిమిదో మెడల్‌‌ ఖాయం చేసుకొని రికార్డు సృష్టించిన మేరీకోమ్‌‌ (51కేజీ) ఫైనల్‌‌ చేరలేకపోయింది. సెమీస్‌‌లో మూడో సీడ్‌‌ ఇండియా బాక్సర్‌‌ 1–4తో సెకండ్‌‌ సీడ్‌‌ బుసెనాజ్‌‌ కకిరొగ్లు (టర్కీ) చేతిలో పరాజయం పాలైంది. అయినా వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో టోర్నీలో ఎక్కువ మెడల్స్‌‌ గెలిచిన ఏకైక బాక్సర్‌‌గా మేరీ రికార్డు సృష్టించింది. 51 కేజీ కేటగిరీలో ఆమెకిదే తొలి మెడల్‌‌ కావడం గమనార్హం. జమున బోరొ (54కేజీ) 0–5తో టాప్‌‌ సీడ్‌‌ హువాంగ్‌‌ సియావొ-వెన్‌‌ (చైనీస్‌‌ తైపీ) చేతిలో చిత్తుగా ఓడింది.  హోరాహోరీగా సాగిన 69కేజీల సెమీస్‌‌లో లవ్లీనా 2–3తో చైనా బాక్సర్‌‌ యాంగ్‌‌ లియు చేతిలో పోరాడి ఓడి వరుసగా రెండో ఎడిషన్‌‌లోనూ కాంస్యంతో వెనుదిరిగింది.

మేరీ, లవ్లీనా రిజల్ట్స్‌‌పై ఇండియా అప్పీల్‌‌

తన సెమీస్‌‌ బౌట్‌‌లో మేరీ టెక్నికల్‌‌గా బాగా పోరాడింది. ఫస్ట్‌‌ రౌండ్‌‌లో ఇద్దరు బాక్సర్లు ఆరంభంలో ఆచితూచి ఆడారు. కౌంటర్‌‌-అటాక్స్‌‌ మొదలయ్యాక మేరీకోమ్‌‌ చాలా దూకుడుగా ఆడి పైచేయి సాధించింది. బుసెనాజ్‌‌ తన హైట్‌‌ను సద్వినియోగం చేసుకోవడంలో ఇబ్బంది పడింది. రెండో రౌండ్‌‌ కూడా ఇదే రీతిలో సాగగా.. చివరి మూడు నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు పోటాపోటీగా పంచ్‌‌లు విసురుకున్నారు. ఓవరాల్‌‌గా మేరీ చాలా దూకుడుగా ఆడగా.. బుసెనాజ్‌‌ కొన్నిసార్లు ఆమె ధాటిని తట్టుకోలేకపోయింది. కానీ, ఐదుగురు జడ్జీల్లో నలుగురు టర్కీ బాక్సర్​కే ఓటు వేయడంతో మేరీ ఆశ్చర్యపోయింది. 69కేజీ సెమీస్‌‌లో లవ్లీనా కూడా అద్భుతంగా పోరాడినా జడ్జీలు ఆమెవైపు మొగ్గు చూపలేదు. దాంతో, మేరీ, లవ్లీనా బౌట్లపై వారి నిర్ణయాలను ఇండియా టీమ్‌‌ సవాల్‌‌ చేసింది. కానీ, మన అప్పీల్స్‌‌ను ఐబా టెక్నికల్‌‌ కమిటీ రిజెక్ట్‌‌ చేసింది. నిరుత్సాహానికి గురైన మేరీకోమ్‌‌.. తన బౌట్‌‌ వీడియోను ట్విటర్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసింది. ‘ఇలా, ఎందుకు జరిగింది. ఈ నిర్ణయం ఎంతవరకు తప్పో, ఒప్పో ఈ ప్రపంచమే తెలుసుకోవాలి’అని ట్వీట్‌‌ చేసిన మేరీ.. ప్రధాని మోదీ, సెంట్రల్‌‌ స్పోర్ట్స్  మినిస్టర్‌‌ రిజిజుకు ట్యాగ్‌‌ చేసింది.

Latest Updates