ఇరగదీసిన ఇంగ్లండ్ : 27 ఏళ్ల తర్వాత.. ఫైనల్లోకి

బర్మింగ్‌‌హామ్‌‌: వరల్డ్‌‌కప్‌‌లో ఈసారి కొత్త చాంపియన్‌‌ను చూడబోతున్నాం. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న కప్‌‌ కలను నెరవేర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆరంభం నుంచి దంచికొడుతున్న ఇంగ్లండ్‌‌.. సెమీస్‌‌లోనూ ఇరగదీసింది. జేసన్‌‌ రాయ్‌‌ (65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85) దుమ్మురేపడంతో.. గురువారం జరిగిన మ్యాచ్‌‌లో మోర్గాన్‌‌సేన 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌‌ టైటిల్‌‌ పోరుకు అర్హత సాధించడం ఇది నాలుగోసారి. 1979, 1987, 1992లో ఈ ఫీట్‌‌ను సాధించింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన ఆసీస్‌‌ 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌‌ (119 బంతుల్లో 6 ఫోర్లతో 85), కారీ (70 బంతుల్లో 4 ఫోర్లతో 46) రాణించారు. తర్వాత ఇంగ్లండ్‌‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు చేసి గెలిచింది. వోక్స్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

స్మిత్‌‌ ఒక్కడే..

టాస్‌‌ గెలిచిన ఆసీస్‌‌ను ఇంగ్లండ్‌‌ పేసర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. ఓపెనింగ్‌‌ స్పెల్‌‌లో వోక్స్‌‌ (3/20), ఆర్చర్‌‌ (2/32) ఫుల్‌‌ లెంగ్త్‌‌, స్వింగ్‌‌తో నిప్పులు చెరిగారు. దీంతో భారీ ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు వార్నర్‌‌ (9), ఫించ్‌‌ (0)తో పాటు తొలి మ్యాచ్‌‌ ఆడుతున్న హ్యాండ్స్‌‌కోంబ్‌‌ (4) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. ఫలితంగా  ఏడు ఓవర్లు కూడా ముగియకముందే ఈ త్రయం పెవిలియన్‌‌కు చేరడంతో ఆసీస్‌‌ 14 రన్స్‌‌కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న మాజీ కెప్టెన్‌‌ స్మిత్‌‌ ఆచితూచి ఆడాడు. కానీ ఎనిమిదో ఓవర్‌‌లో ఆర్చర్‌‌ వేసిన ఓ షార్ప్‌‌ బౌన్సర్‌‌కు కారీ
గాయపడ్డాడు. 86 ఎంపీహెచ్‌‌ వేగంతో దూసుకొచ్చిన బాల్‌‌.. కారీ హెల్మెట్‌‌ను బద్దలుకొడుతూ దవడను బలంగా తాకింది. అంతే క్షణంలో రక్తం దార కట్టింది. ప్రథమ చికిత్స తర్వాత గాయానికి బ్యాండేజ్‌‌ కట్టుకుని మరి బరిలోకి దిగిన కారీ ఇన్నింగ్స్‌‌కు ప్రాణం పోశాడు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ అవసరమైనప్పుడు చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఈ ఇద్దరు నిలబడ్డారు. దాదాపు 27 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుకుని ఈ జంట నాలుగో వికెట్‌‌కు 103 రన్స్‌‌ భాగస్వామ్యాన్ని నెలక్పొలింది. ఇక ఆసీస్‌‌ ఇన్నింగ్స్‌‌ తేరుకుందని భావించే లోపే రషీద్‌‌ (3/54) డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. ఐదు బంతుల తేడాలో కారీ, స్టోయినిస్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. 72 బంతుల్లో స్మిత్‌‌ హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసినా.. అవతలి వైపు మ్యాక్స్‌‌వెల్‌‌ (22), కమిన్స్‌‌ (6) వరుస విరామాల్లో ఔట్‌‌కావడంతో ఆసీస్‌‌ భారీ స్కోరుకు కళ్లెం పడింది. చివర్లో స్టార్క్‌‌ (29)తో కలిసి స్మిత్‌‌ ఎనిమిదో వికెట్‌‌కు 51 పరుగులు జోడించడంతో కంగారూల స్కోరు 200 దాటింది. 48 ఓవర్‌‌లో వరుస బంతుల్లో స్మిత్‌‌, స్టార్క్‌‌ ఔట్‌‌కావడంతో ఆసీస్‌‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.

జోరే.. జోరు

టార్గెట్‌‌ చిన్నదే అయినా.. ఇంగ్లండ్‌‌ ఓపెనర్లు రాయ్‌‌, బెయిర్‌‌స్టో (34) అలసత్వం చూపలేదు. కంగారూల బౌలింగ్‌‌పై విరుచుకుపడుతూ బౌండరీల వర్షం కురిపించారు.  దీంతో తొలి 10 ఓవర్లలో 50 రన్స్‌‌ చేసి ఇంగ్లండ్‌‌ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఆరంభంలో క్యాచ్‌‌ ఔట్‌‌ నుంచి రివ్యూలో గట్టెక్కిన రాయ్‌‌.. క్రీజులో ఉన్నంతసేపు దుమ్ముదులిపాడు. కండ్లు చెదిరే డ్రైవ్స్‌‌తో పాటు లాంగాన్‌‌, లాంగాఫ్‌‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 15వ ఓవర్‌‌లో బౌండరీలతో చెలరేగిన రాయ్‌‌ 50 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ చేశాడు. ఇక స్మిత్‌‌ వేసిన 16 వ ఓవర్‌‌లో వరుసగా మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో ఇంగ్లండ్‌‌ స్కోరు 100 దాటింది. 18వ ఓవర్‌‌లో స్టార్క్‌‌.. బెయిర్‌‌స్టోను ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 124 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రూట్‌‌ (49 నాటౌట్‌‌).. ఇదే ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టి జోరు తగ్గకుండా చూశాడు. కానీ 20 ఓవర్‌‌లో రాయ్‌‌ వికెట్‌‌ తీసి కమిన్స్‌‌ ఆసీస్‌‌ శిబిరంలో ఆనందం నింపాడు. 20వ ఓవర్‌‌ ముగిసేసరికి ఇంగ్లండ్‌‌ 147 రన్స్‌‌కు 2 వికెట్లు కోల్పోయింది.  రూట్‌‌తో జతకలిసిన మోర్గాన్‌‌ (45 నాటౌట్‌‌) మరో వికెట్‌‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ విజయానికి కావాల్సిన పరుగులు జోడించాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌‌కు 79 రన్స్‌‌ జోడించడంతో ఇంగ్లండ్‌‌ మరో 107 బాల్స్‌‌ మిగిలి ఉండగానే గెలుపును అందుకుంది.

ఆస్ట్రేలియా: వార్నర్‌‌ (సి) బెయిర్‌‌స్టో (బి) వోక్స్‌‌ 9, ఫించ్‌‌ (ఎల్బీ) ఆర్చర్‌‌ 0, స్మిత్‌‌ రనౌట్‌‌ 85, హ్యాండ్స్‌‌కోంబ్‌‌ (బి) వోక్స్‌‌4, కారీ (సి) (సబ్‌‌) విన్స్​ (బి) రషీద్‌‌ 46, స్టోయినిస్‌‌ (ఎల్బీ) రషీద్‌‌ 0, మ్యాక్స్‌‌వెల్‌‌ (సి) మోర్గాన్‌‌ (బి) ఆర్చర్‌‌ 22, కమిన్స్‌‌ (సి) రూట్‌‌ (బి) రషీద్‌‌ 6, స్టార్క్‌‌ (సి) బట్లర్‌‌ (బి) వోక్స్‌‌ 29, బెరెన్‌‌డార్ఫ్‌‌ (బి) వుడ్‌‌ 1, లైయన్‌‌ (నాటౌట్‌‌) 5, ఎక్స్‌‌ట్రాలు: 16, మొత్తం: 49 ఓవర్లలో 223 ఆలౌట్‌‌.

వికెట్లపతనం: 1–4, 2–10, 3–14, 4–117, 5–118, 6–157, 7–166, 8–217, 9–217, 10–223.

బౌలింగ్‌‌: వోక్స్‌‌ 8–0–20–3, ఆర్చర్‌‌ 10–0–32–2, స్టోక్స్‌‌ 4–0–22–0, వుడ్‌‌ 9–0–45–1, ఫ్లంకెట్‌‌ 8–0–44–0, రషీద్‌‌ 10–0–54–3.

ఇంగ్లండ్‌‌: రాయ్‌‌ (సి) కారీ (బి) కమిన్స్‌‌ 85, బెయిర్‌‌స్టో (ఎల్బీ) స్టార్క్‌‌ 34, రూట్‌‌(నాటౌట్‌‌) 49, మోర్గాన్‌‌ (నాటౌట్‌‌) 45, ఎక్స్‌‌ట్రాలు: 13, మొత్తం: 32.1 ఓవర్లలో 226/2.

వికెట్లపతనం: 1–124, 2–147.

బౌలింగ్‌‌: బెరెన్‌‌డార్ఫ్‌‌ 8.1–2–38–0, స్టార్క్‌‌ 9–0–70–1, కమిన్స్‌‌ 7–0–34–1, లైయన్‌‌ 5–0–49–0, స్మిత్‌‌ 1–0–21–0, స్టోయినిస్‌‌ 2–0–13–0.

Latest Updates