కంగారెత్తిస్తారా? ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియా ఢీ

world-cup-india-vs-austrailia-match-today

లండన్‌‌:  వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా కఠిన సవాల్‌‌కు సిద్ధమైంది. మొదటి మ్యాచ్‌‌లో కాస్త కష్టపడినా.. సౌతాఫ్రికాను ఓడించి బోణీ కొట్టిన కోహ్లీసేనకు మలిపోరులో  ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా నుంచి సిసలైన పరీక్ష ఎదురవనుంది. వన్డేల్లోగానీ.. వరల్డ్‌‌కప్‌‌ల్లో గానీ ఆసీస్‌‌ను చూడగానే కంగారు పడే  ఇండియా ఈసారి మాత్రం ఆ జట్టును చిత్తు చేయాలని భావిస్తోంది.  వచ్చే ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌తో అల్టిమేట్‌‌ వార్‌‌కు ముందు ఆసీస్‌‌పై విజయం సాధిస్తే  ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్‌‌ రెట్టింపవడం ఖాయం. కానీ, అది అంత సులభమేమీ కాదన్న విషయం ఆటగాళ్లకే కాదు అందరికీ తెలుసు. కంగారూలతో అవతలి జట్టుకు ఎప్పుడూ కంగారే. పైగా,  పెద్ద టోర్నీల్లో.. సవాల్‌‌ విసిరే మ్యాచ్‌‌ల్లో ఆ జట్టు తిరుగులేని ఆటతీరును కనబరుస్తుంది. ఒత్తిడిని ఎలా జయించాలో.. చేజారిపోతున్న మ్యాచ్‌‌లను ఎలా కాపాడుకోవాలో ఆసీస్‌‌కు వెన్నతో పెట్టిన విద్య.  విండీస్​తో మ్యాచే అందుకు  ఉదాహరణ. టాపార్డర్‌‌ కుప్పకూలినా.. ఆ జట్టు 280 ప్లస్‌‌ రన్స్‌‌ చేసింది. ఛేజింగ్‌‌లో కరీబియన్లు గెలుపు ముంగిట నిలిచినా..  అద్భుతమైన బౌలింగ్‌‌తో  వారిని అడ్డుకొని గెలిచింది.  అందువల్ల ఆ జట్టుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోహ్లీదే.

ముగ్గురు పేసర్లతో..

మార్చిలో టీమిండియాతో ఆడిన సిరీస్‌‌లో  లెగ్‌‌ స్పిన్‌‌ ద్వయం చహల్‌‌, కుల్దీప్‌‌ బౌలింగ్‌‌ను కంగారూలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కెప్టెన్‌‌ ఆరోన్‌‌ పించ్‌‌, ఉస్మాన్‌‌ ఖవాజ.. కేదార్‌‌ జాదవ్‌‌ సైడ్‌‌ ఆర్మ్‌‌ ఆఫ్‌‌ స్పిన్‌‌ను తిప్పికొట్టారు. నిషేధం ముగించుకొని వచ్చిన స్మిత్‌‌, వార్నర్‌‌ గత రెండు మ్యాచ్‌‌ల్లో చెరో హాఫ్‌‌ సెంచరీతో ఇద్దరూ ఫామ్‌‌ అందుకున్నారు. అందువల్ల ఆసీస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను అడ్డుకునేందుకు కెప్టెన్‌‌ కోహ్లీ, కోచ్‌‌ శాస్త్రి  కొత్త వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. విండీస్​తో పోరులో షార్ట్​ పిచ్​ బాల్స్​, బౌన్సర్లకు ఆసీస్​ ఇబ్బంది పడిన నేపథ్యంలో  సీనియర్‌‌ పేసర్‌‌  షమీ తుది జట్టులోకి తీసుకొని ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. అప్పుడు ఇద్దరు స్పిన్నర్లలో ఒక్కరికే చాన్స్‌‌ రానుంది.  చహల్‌‌ గత మ్యాచ్‌‌లో 4 వికెట్లు తీసినప్పటికీ.. ఆసీస్‌‌పై మెరుగైన సక్సెస్‌‌ రేట్‌‌ ఉన్న కుల్దీప్‌‌కే మొగ్గు ఉండొచ్చు. బౌన్స్‌‌, టర్న్‌‌ రాబడుతూ లెఫ్టాండర్లకు కుల్దీప్‌‌ సవాల్‌‌ విసరగలడు. పార్ట్‌‌టైమ్‌‌ స్పిన్నర్‌‌గా కేదార్‌‌ జాదవ్‌‌ ఉన్నాడు. కానీ,  ఓవల్‌‌ పిచ్‌‌పై కేదార్‌‌ సైడ్‌‌ ఆర్మ్‌‌ ఆఫ్‌‌ బ్రేక్స్‌‌ అంత ఎఫెక్టివ్‌‌గా ఉండకపోవచ్చు కాబట్టి అతని స్థానంలో విజయ్‌‌ శంకర్‌‌ను ఆడించే ఆలోచనకూడా మేనేజ్‌‌మెంట్‌‌ చేస్తోంది.  వికెట్‌‌ టు వికెట్‌‌ సీమ్‌‌తో పాటు బ్యాటింగ్‌‌లో కూడా నిలకడ చూపే శంకర్‌‌ వైపు కెప్టెన్‌‌ కోహ్లీ మొగ్గు చూపొచ్చు.

హార్దిక్‌‌ మెరుపులిక్కడే..

ఈ వేదికపై ఇండియా చివరగా చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్‌‌ ఆడింది. పాకిస్థాన్‌‌ చేతిలో  ఓడినప్పటికీ ఆ మ్యాచ్‌‌లో హార్దిక్‌‌ పాండ్యా పవర్‌‌ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇండియా టాపార్డర్‌‌ కుప్పకూలిన టైమ్‌‌లో పాండ్యా 43 బంతుల్లో 76 రన్స్‌‌తో చెలరేగాడు. ఐపీఎల్‌‌లో చెలరేగి ఫుల్‌‌ఫామ్‌‌లో ఉన్న పాండ్యా తనకు అచ్చొచ్చిన వేదికపై సత్తా చాటాలని అందరూ కోరుకుంటున్నారు.

ఆ నలుగురిని అడ్డుకోకుంటే..

వరల్డ్‌‌కప్‌‌లో రెండో అడుగు విజయవంతంగా పడాలంటే కోహ్లీసేన ఆస్ట్రేలియా జట్టుపై సర్వశక్తులోడ్డి తీరాల్సిందే. కంగారూల జట్టులో ఏ ఒక్కరిని తక్కువగా అంచనా వేయడానికి లేదు.  ఓపెనర్ల నుంచి ఎనిమిదో నంబర్‌‌ వరకూ బ్యాటింగ్‌‌ చేసే సమర్థులే. బౌలింగ్‌‌లోనూ ఆ జట్టు దుర్భేధ్యంగా కనిపిస్తోంది. ఆ జట్టులో అందరూ మ్యాచ్‌‌ విన్నర్లే.  మరీ ముఖ్యంగా డేవిడ్‌‌వార్నర్‌‌, స్టీవ్‌‌ స్మిత్‌‌, మిచెల్‌‌ స్టార్క్‌‌, పాట్‌‌ కమిన్స్‌‌ విషయంలో పక్కా ప్రణాళికతో  బరిలోకి దిగకపోతే మొదటికే మోసం వచ్చే చాన్సుంది.

స్టీవ్‌‌ స్మిత్‌‌

నేటితరం క్రికెటర్ల బ్యాటింగ్‌‌ శైలికి పూర్తి భిన్నంగా ఆడడం స్మిత్‌‌ స్టయిల్‌‌. క్రీజును సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో స్మిత్‌‌ తర్వాతే ఎవరైనా. విలక్షణమైన బ్యాటింగ్‌‌ శైలి  వల్ల  స్మిత్‌‌ను ఎల్బీ చేయాలంటే పేసర్లు చాలా కష్టపడాలి. స్పిన్‌‌ బౌలింగ్‌‌లో చాలా సింపుల్‌‌గా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తుంటాడు. కానీ డ్రైవ్‌‌లు ఆడడంలో కాస్త తడబడుతుంటాడు. పేసర్లు ఈ అంశంపై దృష్టిపెడితే  స్మిత్‌‌ను అడ్డుకోవచ్చు.

జట్లు (అంచనా)

ఇండియా: ధవన్‌‌, రోహిత్‌‌, కోహ్లీ (కెప్టెన్‌‌), లోకేశ్‌‌, విజయ్‌‌/కేదార్‌‌, ధోనీ (కీపర్‌‌), హార్దిక్‌‌, కుల్దీప్‌‌, భువనేశ్వర్‌‌/చహల్‌‌, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా:  వార్నర్‌‌, ఫించ్‌‌ (కెప్టెన్‌‌),  ఖవాజ, స్మిత్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌, స్టొయినిస్‌‌, కారీ (కీపర్), కూల్టర్‌‌నైల్‌‌, కమిన్స్‌‌, స్టార్క్‌‌, జంపా.

Latest Updates