
అప్పుడెప్పుడో 1983లో ఇంగ్లండ్ గడ్డపై కపిల్ డెవిల్స్ కొదమ సింహాల్లా గర్జించి.. కరీబియన్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి .. ఇండియాకు తొలి వరల్డ్‌కప్ అందించారు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎదురు చూపులకు తెరదించుతూ.. యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తుతూ..2011లో స్వదేశంలో అసమాన ఆటతో.. అద్వితీయ పోరాట పటిమతో మహేంద్రుడు ఇండియాను మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. ఇప్పుడిక విరాట్ కోహ్లీ వంతొచ్చింది. కొన్నేళ్లుగా ఆటగాడిగా, నాయకుడిగా తిరుగే లేదన్నట్టుగా దూసుకెళ్తున్న కోహ్లీ ఇప్పుడు ‘విశ్వ విరాట్’గా మారే సందర్భం ఆసన్నమైంది.
ఆటగాడిగా ఓసారి కప్పును అందుకున్న విరాట్.. కెప్టెన్‌గా ప్రపంచాన్ని జయించేందుకు ఇదే సరైన సమయం! ఇంగ్లిష్ గడ్డపై మరో 24 గంటల్లో మహా సంగ్రామం మొదలవుతోంది!మన నాయకుడే ఇప్పుడు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్. అంతేనా నంబర్ వన్ పేసర్.. ప్రపంచంలోనే బెస్ట్ కీపర్, ఫినిషర్.. మూడు డబుల్ సెంచరీలు చేసిన ఓపెనర్.. నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్.. మణికట్టుతో ప్రత్యర్థుల పని పట్టే ఇద్దరు స్పిన్నర్లు.. ఇలా ఎవరికి వారే సాటి అనేలా 15 మంది ప్లేయర్లతో మన సైన్యం శత్రు దుర్భేధ్యంగా ఉంది. మూడోసారి ప్రపంచాన్ని జయించేందుకు అన్ని అర్హతలు టీమిండియాకు ఉన్నాయి! ఇప్పుడు ఆటగాళ్లు, అభిమానులు, యావత్ దేశం మాట ఒక్కటే ‘ ఔర్ ఏక్ కప్’..! మరి, ఇండియా ‘తీన్మార్’కొడుతుందా? ఇంగ్లిష్ గడ్డపై మన తిరంగాను ఎగరవేస్తుందా..!
వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టు ఎప్పుడూ ఫేవరెటే. గత చాంపియన్‌పై అంచనాలు సహజం. అందుకే ఈసారి ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియాపై అందరి దృష్టి ఉంది. కానీ, అంతకుమించిన అంచనాలు టీమిండియాపై ఉన్నాయి. ఇండియన్సే కాదు ఇతర దేశాల ఫ్యాన్స్ కూడా కోహ్లీసేనకే ఓటేస్తున్నారు. కారణం అన్ని విభాగాల్లోనూ ఇండియా బలంగా ఉండడమే. గత వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాలో చాలా మార్పులు జరిగాయి. ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ ఇండియాను తిరుగులేని శక్తిగా మార్చాడు. నాలుగేళ్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో బలమైన ప్రత్యర్థులందరినీ కోహ్లీసేన ఓడించింది. వాటిలో చాలా ముఖ్యమైనది సౌతాఫ్రికాను వారి హోమ్‌గ్రౌండ్‌లో చిత్తు చేయడం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డపై కూడా కోహ్లీసేన విజయబావుటా ఎగరవేసింది. పైగా, ఈ టైమ్‌లో కోహ్లీ తిరుగులేని కెప్టెన్, ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. బుమ్రా, భువనేశ్వర్ వంటి అద్భుతమైన పేసర్లు.. చహల్, కుల్దీప్ రూపంలో మణికట్టు మాంత్రికులు.. హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ వెలుగులోకి వచ్చారు. ధోనీ తన కెరీర్‌కు ఘనమైన ముగింపునిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రపంచ క్రికెట్‌పై ఇప్పటికే తమదైన ముద్ర వేసిన వీరందరితో ఇంగ్లండ్‌కు వచ్చిన టీమిండియా 1983 కపిల్ డెవిల్స్ కథను రిపీట్ చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మన జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మెగా టోర్నీలో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం చాలా బలీయంగా ఉందన్న మాట వాస్తవమే అయినా ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా అత్యంత దుర్భేధ్యం అనడంలో సందేహం లేదు. రోహిత్, ధవన్, కోహ్లీ, ధోనీ ఇండియా బ్యాటింగ్‌కు నాలుగు స్తంభాలు. వీరిలో ఏ ఒక్కరు విజృంభించినా ప్రత్యర్థి వణికిపోవాల్సిందే. టన్నుల కొద్ది పరుగులు ఖాతాలో వేసుకున్న ఈ నలుగురు ఒంటిచేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. బ్యాటింగ్ వార్‌లో టీమిండియా ‘బ్యాట్మన్’ కోహ్లీ ముందున్నాడు. రికార్డులు బద్దలు కొట్టడం.. కొత్త ఘనతలు నమోదుచేయడమే పనిగా పెట్టుకున్న విరాట్ 2015 వరల్డ్‌కప్ తర్వాత మరింత రాటు దేలాడు. ఈ టైమ్‌లో 69 వన్డేలు ఆడిన కోహ్లీ 78.29 సగటుతో 4306 రన్స్ చేశాడు. 19 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు బాదేశాడంటే అతని రేంజ్ అర్థం చేసుకోవచ్చు. పైగా, గత ఇంగ్లండ్ టూర్లో అతను చెలరేగిపోయాడు. ఓపెనర్లు రోహిత్ (71 వన్డేల్లో 3790; సగటు 61.12), ధవన్ (67 వన్డేల్లో 2848; సగటు 45.20) కూడా తమ ఓవరాల్ కెరీర్‌తో పోల్చితే ఈ నాలుగేళ్లలో మంచి సగటుతో ఉండడం విశేషం. ఇంగ్లిష్ గడ్డపై వీరికి కూడా మంచి రికార్డు ఉంది. ధోనీ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో అతని బ్యాట్ పవర్ కాస్త తగ్గినా ఐపీఎల్లో విజృంభించి మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. పవర్ఫుల్ షాట్లతో మునుపటి వాడి చూపి ఫినిషర్‌గా తానింకా ఫినిష్ కాలేదని నిరూపించాడు. మెగా టోర్నీలో ఇన్నింగ్స్ ముగించే బాధ్యత మహీదే. కీపర్‌గా ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెప్పపాటులో స్టంపౌట్స్, రనౌట్స్ చేసి మ్యాచ్‌లను అతను మలుపు తిప్పిన సందర్భాలెన్నో. ఇక, ఆల్‌రౌండర్లు హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ కూడా పవర్ఫుల్ బ్యాటింగ్‌తో క్షణాల్లో ఆటను తారుమారు చేయగలరు. ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాండ్యా తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఐపీఎల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అతను జోరు మీదున్నాడు. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటిన జడేజా ఎంత విలువైన ఆటగాడో అందరికీ తెలిసింది.