గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు

వరల్డ్స్ షార్టెస్ట్ మ్యాన్‌గా పేరుగాంచిన ఖాగేంద్ర థాపా మాగర్ శుక్రవారం మృతిచెందాడు. గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఖాగేంద్ర.. నేపాల్, పొఖారా సిటీలోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ‘ఖాగేంద్ర న్యుమోనియా కారణంగా ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత అతని గుండెపై ఆ ప్రభావం పడింది. దాంతో శుక్రవారం ఆయన కన్నుమూశారు’ అని అతని సోదరుడు మహేష్ థాపా మాగర్ తెలిపారు.

ఖాగేంద్ర 2010లో ప్రపంచపు అతి చిన్న వ్యక్తిగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. అతని పొడవు 67.08 సెంటీమీటర్లు అంటే 2.41 అంగుళాలు మరియు బరువు 6 కేజీలు మాత్రమే. మాగర్ తన 18వ పుట్టినరోజు తర్వాత 2010లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. ఆ సమయంలో అతను గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఇచ్చిన సర్టిఫికెట్‌ను పట్టుకొని ఫోటో దిగాడు. ఆ సర్టిఫికెట్‌ అతని కంటే కొంచెం చిన్నదిగా ఉంది. నేపాల్‌కు చెందిన చంద్ర బహదూర్ డాంగి 54.6 సెంటీమీటర్ల పొడవుతో ఖాగేంద్ర రికార్డును బ్రేక్ చేశాడు. కానీ డాంగి 2015లో మరణించడంతో తిరిగి ఆ టైటిల్ మళ్లీ ఖాగేంద్ర పేరు మీదనే నమోదైంది.

‘ఖాగేంద్ర ఇక మాతో లేడనే వార్త వినడానికి మాకు చాలా బాధగా ఉంది. ఎవరైనా సరే కేవలం 6 కేజీల బరువుంటే వారి జీవితం సవాలుగా ఉంటుంది. అటువంటి వారు ఈ ప్రపంచంతో ముందుకెళ్లలేరు. కానీ, ఖాగేంద్ర మాత్రం తన పొడవును, బరువును చూసుకొని అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్లాడు’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ క్రెయిగ్ గ్లెన్డే అన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తిగా ఫిలిప్పిన్స్‌కు చెందిన జున్రే బాలావింగ్, 59.93 సెంటీమీటర్ల పొడవుతో ఉన్నాడు. కానీ, జున్రే నిలబడలేడు మరియు నడవలేడు. అందుకే అతి చిన్న వ్యక్తి టైటిల్ ఖాగేంద్రకు దక్కింది. ఖాగేంద్ర భారతదేశానికి చెందిన అతి చిన్న మహిళ జ్యోతి అమ్గేతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నఇతర చిన్న వ్యక్తులను కలుసుకున్నారు. ప్రపంచంలోని అతి చిన్న వ్యక్తిగా పేరుగాంచిన 27 ఏళ్ల ఖాగేంద్ర పలు దేశాలలో టెలివిజన్ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఖాగేంద్ర, నేపాల్ టూరిజానికి అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ పర్వతం ఉన్న నేపాల్‌కు, అతి చిన్న వ్యక్తిగా ఉన్న ఖాగేంద్ర ఆ దేశ టూరిజం అభివృద్ది కోసం పనిచేశాడు.

For More News..

నిందితులకు 4,738 సంవత్సరాల శిక్ష విధించిన కోర్టు

అసదుద్దీన్ ఓవైసీకి ఎదురుదెబ్బ

Latest Updates