తేనెటీగలకు విష విపత్తు: ప్రపంచవ్యాప్తంగా 38 శాతం నశించాయి

worldwide-honey-bees-in-danger

    కొత్త పురుగుమందులతో తేనెటీగలకు పెనుముప్పు  

     ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలోనే 38 శాతం తేనెటీగలు కనుమరుగు

మనుషులకు తియ్యటి తేనెను ఇవ్వడమే కాదు.. ఫుడ్డు దొరకడంలోనూ అతి కీలక పాత్ర పోషిస్తున్న తేనెటీగలకు మన నుంచి మాత్రం తీవ్ర ముప్పు ఎదురవుతోంది. ఎవుసం కోసం విచ్చలవిడిగా పురుగుమందులు వాడుతుండటంతో ఆ విషాలకు తట్టుకోలేక తేనెటీగలు నేల రాలిపోతున్నాయని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఓ పురుగులమందు నుంచి తేనెటీగలకు ఇప్పటివరకు ఊహించినదాని కంటే 48 రెట్లు ఎక్కువ ముప్పు కలుగుతోందని అమెరికా సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. నియోనికోటినాయిడ్స్​అనే ఈ రసాయనాలు కలిసిన పురుగుమందులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్నారని తేలింది.  ఇంతకుముందు ఆర్గానోపాస్ఫేట్స్​ అనే పురుగులమందును ఎక్కువగా వాడేవారు. కానీ, వాటి కన్నా నియోనికోటినాయిడ్స్​ రకం మందులు ఎక్కువ రోజులు ఎఫెక్టివ్​గా ఉంటాయి. ధర తక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని కంపెనీలు ఆ మందును తయారుచేస్తున్నాయి. వీటిని  ఎక్కువగా విత్తన శుద్ధి కోసం ఉపయోగిస్తుంటారు. విత్తనంతో పాటు మొలకెత్తిన తర్వాత మొక్కకాండం, వేర్లు, ఆకులు, పూవులు, వాటిలోని మకరందం కూడా విషపూరితం అయిపోతాయి. వీటివల్ల తేనెటీగలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాటిలో అడ్జువెంట్స్ ​రకం కెమికల్స్​ను కలుపుతున్నారు. దాని వల్ల తేనెటీగలు గుంపులుగుంపులుగా చనిపోతున్నాయని చైనా శాస్త్రవేత్తలు ‘ఎన్విరాన్మెంటల్​ టాక్సికాలజీ’ అనే జర్నల్​లో రీసెర్చ్​పేపర్​ప్రచురించారు.

తేనెటీగలు అంతరిస్తే.. మనం బతికేది నాలుగేండ్లే!

‘ఈ భూమి మీద తేనెటీగలు అంతరించిపోతే మనం బతికేందుకు కేవలం నాలుగేండ్లు మాత్రమే మిగిలి ఉంటాయి’.. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్​ఐన్​స్టీన్​చెప్పిన మాట ఇది. అయితే, తేనెటీగలు ఇప్పటికిప్పుడే పూర్తిగా అంతరించిపోకున్నా, అవి చనిపోతున్న సంఖ్య మాత్రం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేనెటీగలు 90 శాతం వరకూ అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2018 అక్టోబర్​నుంచి 2019 ఏప్రిల్​మధ్యలోనే సుమారుగా 38 శాతం తేనెటీగల కాలనీలు అంతరించాయట. 2007 నుంచి 2016 మధ్య 89% తేనెటీగలు చనిపోయాయని అంచనా.

తేనెటీగలన్నీ అంతరిస్తే ఏమవుతుంది?

తేనెటీగలన్నీ చనిపోతే మనుషులూ అంతరించిపోతారన్నది కొంచెం అతిశయోక్తే. కానీ.. అవి లేకుంటే మనుషులకు గడ్డుకాలం తప్పదన్నది మాత్రం నిజం. తేనెటీగలు లేకుంటే ఇప్పుడు మనం పండించుకుంటున్న పంటల్లో చాలావరకూ పండవు. తేనె, కొన్ని రకాల నట్స్, బీన్స్​వంటివి శాశ్వతంగా కనుమరుగవుతాయి. చాలా ఔషధాలు పూలు పూసే మొక్కల నుంచే తయారు చేస్తారు. తేనెటీగలు లేకుంటే పరాగసంపర్కం జరగక పుష్పించే మొక్కలు చాలావరకూ అంతరిస్తాయి. ఆహారంగా తీసుకునే 100 రకాల పంటల్లో 70 రకాల పంటలు తేనెటీగలు పరాగసంపర్కం (పాలినేషన్) జరపడం వల్లనే పండుతున్నాయి. ప్రపంచంలో 90% పంట తేనెటీగలు పాలినేషన్​ చేయడం వల్లనే పండుతోంది. ఇవి లేకపోతే పండ్లు, కూరగాయలు, కాటన్​ వంటి ఎన్నో పంటలు పండించడం కష్టమైపోతుంది.

ఎలా కాపాడుకోవాలి?

తేనెటీగల ఉసురు తీస్తున్న

పురుగుమందులను నిషేధించాలి.

పర్యావరణానికి హాని చేయని

వ్యవసాయం చేయాలి.

తేనెటీగల ఆవాసాలను పరిరక్షించాలి. ధ్వంసమైనవాటిని పునరుద్ధరించాలి.

కాలిఫోర్నియాకు చెందిన సీడ్​ ల్యాబ్స్​బయోప్యాటీస్​కలిపిన ఆహారాన్ని తేనెటీగలకు అందుబాటులో ఉంచుతోంది. దీనివల్ల వాటి ఇమ్యూన్​సిస్టం బలోపేతం అవుతోంది.

తేనెపట్టు పరిస్థితి, తేనెటీగల ఆరోగ్యం తెలుసుకునేందుకు బీహీరో అనే ఇజ్రాయెలీ కంపెనీ సెన్సర్లు, హైటెక్​ పరికరాలను వినియోగిస్తోంది.

పొలాల్లో ప్రత్యేకంగా కొంత ఫీల్డ్​ మార్జిన్​ను వదిలేస్తే సహజంగా పెరిగే

పూలమొక్కలూ మేలు చేస్తాయి.

Latest Updates