శంషాబాద్ లో రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా

హైదరాబాద్: క‌బ్జారాయుళ్లు ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కూడా వ‌ద‌లట్లేదు. ఖాళీగా ఉన్న భూముల‌నే కాకుండా నిరుప‌యోగంగా ఉన్న చెరువుల‌ను, బావుల‌ను మ‌ట్టితో పూడ్చి క‌బ్జా చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హుడా కాలనీలో కోటి రూపాయల ప్రభుత్వ స్థలాన్ని కొందరు నేతలు కబ్జా చేశారు. ఈ ఘటన పై హుడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రావు మాట్లాడుతూ… కాలనీ లోని ప్లాట్ నెంబర్ 181 లో పెద్ద బావి ఉండేదని, గతంలో గ్రామ పంచాయతీ అధికారులు చెత్తా చెదారంతో బావిని మూసివేయడంతో.. ఇదే అదునుగా భావించిన కొందరు కబ్జాదారులు మట్టితో ఆ స్థలాన్ని చదును చేసి కబ్జాకు యత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ స్థ‌లం కబ్జాకు గురైన ఘటనపై హుడా లేఅవుట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ,హెచ్.ఎమ్.డి.ఏ ఎస్టేట్ ఆఫీసర్ కి, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయ‌న అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేసినా.. వారు కూడా స్పందించలేదని, అధికారులందరూ కబ్జాదారులకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన‌ స్థలాన్ని కబ్జాదారులు విడిపించాలని ఆయన కోరారు.

Latest Updates